ముంచేశారు..!

ABN , First Publish Date - 2021-07-19T05:07:07+05:30 IST

ముంచేశారు..!

ముంచేశారు..!
చెరువు కాదు సుమా.. గన్నవరంలో నీట మునిగిన ఓ లే అవుట్‌

చెరువులుగా మారిన పేదల ఇళ్ల స్థలాలు

వర్షపు నీరు నిలిచిపోవడంతో గల్లంతైన లే అవుట్లు

ఏ ప్లాట్‌ ఎక్కడో తెలియని పరిస్థితి

మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం వల్లే ఈ దుస్థితి

మెరక భారంపై లబ్ధిదారుల ఆందోళన

ఇప్పటికీ అందని ప్రభుత్వ సాయం

పేదల ఇళ్ల స్థలాలు వర్షార్పణమయ్యాయి. శంకుస్థాపనలు జరుపుకొన్న లే అవుట్లు చెరువులను తలపిస్తున్నాయి. నిండా మునిగిన నీటిలో ఎవరి ప్లాట్‌ ఎక్కడో తెలియని పరిస్థితి ఏర్పడింది. పేరుకు స్థలాలు ఇచ్చినా.. కనీసం పైపై మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో జిల్లాలోని చాలా లే అవుట్లు ఇప్పుడు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. 

విజయవాడ, ఆంధ్రజ్యోతి : ఇటీవల కురుస్తున్న వర్షాల కారణంగా పేదల ఇళ్ల స్థలాల లే అవుట్లు చెరువులుగా మారిపోయాయి. శంకుస్థాపనలు ఎలా చేయాలో అర్థంకాని పరిస్థితి ఏర్పడింది. ఎలాంటి సదుపాయాలు లేకుండా, సొంతూర్లకు దూరంగా పొలాల మధ్య వేసిన లే అవుట్లను లబ్ధిదారులకు కేటాయించారు. వీటి అభివృద్ధి కూడా తూతూమంత్రంగానే జరగడంతో చిన్నపాటి వర్షానికే తటాకాలను తలపిస్తున్నాయి. ఇళ్లు నిర్మించాక కూడా ఇదే పరిస్థితి తలెత్తుతుందేమోనని లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. 

మెరక ఎవరి బాధ్యత?

వాస్తవానికి శంకుస్థాపనలకు ముందే ఊరి రోడ్డుకు సమాంతరంగా లే అవుట్లలో మెర క తోలించి రోడ్లు, డ్రెయిన్లు వేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. రెవెన్యూ యంత్రాంగానికి ప్రభుత్వం పైసా విదల్చకపోవటంతో స్థానికంగా ఎక్కడికక్కడ లే అవుట్లు వేసి మమ.. అనిపించారు. ఇప్పుడు వర్షాలకు చెరువులను తలపిస్తున్న స్థలాల్లో మెరక తోలించుకునే భారం లబ్ధిదారులపై పడింది. ఊరి రోడ్డు కంటే నాలుగైదు అడుగుల కిందకు ఉన్న వీటిని చదును చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్న పని. 

సాయం అంతంతమాత్రమే..

ఇల్లు నిర్మించుకోవాలంటే సుమారు రూ.5 లక్షలు ఖర్చవుతుంది. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.1.50 లక్షలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందే తప్ప సొంతంగా ఏమీ ఇవ్వట్లేదు. మరో రూ.30వేల నరేగా నిధులు ఇస్తున్నామని చెబుతున్నా అవి కూడా కేంద్రానివే. మిగతా మొత్తం లబ్ధిదారులే పెట్టుకోవాలి. ఇలాంటి సమయంలో తటాకాలను తలపించే లే అవుట్లను చదును చేసుకోవాలంటే మట్టి లేదా గ్రావెల్‌ను తోలించటానికి రవాణా చార్జీలతో కలిపి రూ.లక్ష వరకు అవుతుంది. కరోనా కారణంగా ఆర్థికంగా చితికిపోయిన పేదలకు ఇది మోయలేని భారమే. ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్‌ ప్రకారం సిమెంట్‌ బస్తాలు, డబ్బుకు కూడా ఇప్పటివరకు దిక్కు లేదు.

తూర్పు కృష్ణా లే అవుట్లలో పరిస్థితి దారుణం

తూర్పు కృష్ణా ప్రాంతం లోతట్టు కావటం, సాగు ఎక్కువగా ఉండటం వల్ల సేకరించిన ప్రైవేట్‌ భూములు (పొలాలు) అన్నీ వర్షంతో నిండిపోయాయి. గన్నవరంలోని కేసరపల్లి, బాపులపాడు మండలంలోని అంపాపురం, కంకిపాడు మండలంలోని వణుకూరు, గుడివాడ పరిధిలోని నందివాడ మండలం, పెదపారుపూడి మండలం, కుదరవల్లి.. ఇలా ఏ లే అవుట్లలో చూసినా వర్షపు నీరు చెరువులను తలపిస్తోంది.







Updated Date - 2021-07-19T05:07:07+05:30 IST