Advertisement

’మూడుపై.. మండిపాటు.. ప్రజలను నమ్మించి మోసం చేసిన సీఎం ‘

Aug 1 2020 @ 09:22AM

ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతారా? 

ప్రభుత్వ తీరుపై మండిపడ్డ వివిధ రాజకీయపక్షాలు


గుంటూరు (ఆంధ్రజ్యోతి): రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు గవర్నర్‌ అమోద ముద్ర వేయడం పై అధికార వైసీపీ మినహా అన్ని రాజకీయ పక్షాలు తీవ్ర వ్యతిరేకతను తెలిపాయి. అమరావతికి భూములిచ్చిన రైతులకు పూర్తిస్థాయి మద్దతు తెలిపారు. రోడ్డెక్కి రైతుల త్యాగాలను తుంగలోకి తొక్కారంటూ టీడీపీ నేతలు మండిపడ్డారు. వైసీపీ నేతలు నమ్మించి మోసం చేస్తే.. బీజేపీ నయవంచన చేసిందంటూ అమరావతి రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. శ్రావణ శుక్రవారం నాడు తమచేత కన్నీరు పెట్టించారని రాజధాని మహిళలు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీడీపీ, వామపక్షాల నేతలు కార్యకర్తలు జిల్లా కేంద్రం గుంటూరులో నిరసన ప్రదర్శనలు నిర్వహించాయి. 


దమ్ముంటే ఎన్నికలకు వెళ్లాలి..: మాజీ ఎంపీ యడ్లపాటి వెంకట్రావు

రాజధాని అంశంపై ప్రభుత్వానికి దమ్ము ఉంటే ఎన్నికలకు వెళ్లాలి. రాజధాని రైతులతో పాటు రాష్ట్ర ప్రజల ఆశలపై ప్రభుత్వం నీళ్లు చల్లింది. అధికారంలోకి వచ్చే వరకు రాజధానికి సై అంటూ అధికారం చేజిక్కాక రైతులతో పాటు ప్రజలను మూడు పోట్లు పొడిచారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను కోర్టుల్లోనే తేల్చుకోవాల్సి ఉంటుంది. అప్పుడే ప్రభుత్వం ఆడుతున్న కపట నాటకం బయట పడుతుంది.

బిల్లు ఆమోదం చారిత్రక తప్పిదం: ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్‌

 రాష్ట్రంలో కరోనా వ్యాధి విజృంభిస్తూ ప్రజలు నానా కష్టాలు పడుతుంటే  రాజధాని బిల్లును ఆమోదించటం ప్రాంతాలు, ప్రజల మధ్య చిచ్చురేపే నిర్ణయం. సీఎం జగన్మోహనరెడ్డి కుటిల రాజకీయం చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా నియంత్రించటంలో జగన్‌ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందింది. రాజధాని బిల్లుకు గవర్నర్‌ ఆమోదించటాన్ని పునరాలోచించాలి. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల పోరాటాలను పరిగణలోకి తీసుకోవాలి.   


కోర్టు ఉల్లంఘన కిందకు రాదా.....?: గల్లా జయదేవ్‌,  ఎంపీ

రాజధాని ముక్కలు చేసే అంశం ఏపీ హైకోర్టులో పెండింగ్‌లో ఉంది. శాసన నిబంధనల ప్రకారం ఈ బిల్లులను చర్చించడం లేదా, ఆమోదించడం కోర్టు ఉల్లంఘనల కిందకు రావా.? వేలాది మంది రైతులు నిస్వార్థంగా ఆస్తులు త్యాగం చేసిన రైతులపై కక్షపూరింతంగా తీసుకున్న మూడు ముక్కల నిర్ణయంతో  రాజధాని రైతుల గుండెలు మండుతున్నాయన్నారు. ఈ బిల్లు గవర్నర్‌ ఆమోదించటం రాజ్యాంగ విరుద్ధం. మూడు రాజధానులపై ప్రజాభిప్రాయ సేకరణ జరిపి, గవర్నర్‌ నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది.  గవర్నర్‌ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి.


ప్రజాభిప్రాయం కోరాలి..: జీవీ ఆంజనేయులు, టీడీపీ జిల్లా అధ్యక్షుడు

సీఎం జగన్‌ తన ప్రభుత్వాన్ని రద్దు చేసి మూడు రాజధానులపై ప్రజాభిప్రాయం కోరాలి.  ప్రజలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడానికే మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చారు. గవర్నర్‌కు తప్పుడు సమాచారం ఇచ్చి బిల్లులు ఆమోదింప చేసుకున్నారు. ఈరోజు రాష్ట్రానికి చీకటి రోజు. 230 రోజులగా రైతులు చేస్తున్న ఆందోళనలను కనీసం పట్టించుకోరా..? కచ్చితంగా న్యాయస్థానాల్లో చెల్లదు. వికేంద్రీకరణ బిల్లు, సీఆర్డీయే రద్దుపై కోర్టులో పార్టీ తరఫున చాలెంజ్‌ చేస్తాం. అక్కడ ఏపీకి న్యాయం జరుగుతుంది.న్యాయ విచారణలో నిలబడదు.. : ముప్పాళ్ల నాగేశ్వరరావు, రాష్ట్ర సీపీఐ సహాయ కార్యదర్శి

 ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా గవర్నర్‌ తీసుకున్న నిర్ణయం న్యాయ విచారణలో నిలబడదు. రూల్‌ నెం.71 ప్రకారం మండలిలో మూడు రాజధానుల బిల్లు వీగిపోలేదు. సెలెక్ట్‌ కమిటీకి పంపారు. ఈ విషయాలను ప్రభుత్వ తరఫు న్యాయవాది కోర్డుకు తెలిపారు. దీని వెనుకు కచ్చితంగా బీజేపీ హస్తం ఉంది. న్యాయస్థానాల పరిధిలో అమరావతి రైతులకు న్యాయం జరుగుతుందని నమ్మకం ఉంది.  


ఆశ్చర్యానికి గురి చేసింది..: డాక్టర్‌ మాకినేని పెద రత్తయ్య, మాజీ మంత్రి

న్యాయకోవిదుడు అయిన గవర్నర్‌  బిశ్వభూషణ్‌ ఇటువంటి నిర్ణయం తీసుకోవటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఈ నిర్ణయం వెనుకు బీజేపీ హస్తం ఉందన్నది బహిరంగ రహస్యమే. ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు మాటలే అందుకు నిదర్శనం. దీనిపై జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఏం సమాధానం చెప్తారు. ఈ నిర్ణయంతో బీజేపీ ద్వంద్వ వైఖరి బయటపడింది. రాష్ట్రంలో కాంగ్రెస్‌ దుస్థితే  బీజేపీకీ పడుతుంది. 

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.