Congress Chintan : ప్రాంతీయ పార్టీల్లో చిచ్చు రేపిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2022-05-18T01:32:55+05:30 IST

రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన మేధోమథనంలో కాంగ్రెస్ నేత రాహుల్

Congress Chintan : ప్రాంతీయ పార్టీల్లో చిచ్చు రేపిన రాహుల్ గాంధీ వ్యాఖ్యలు

న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో జరిగిన మేధోమథనంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలు ప్రాంతీయ పార్టీల నేతలకు ఆగ్రహం తెప్పించాయి. పోరాటానికైనా, విజయాల కోసమైనా తమపైనే కాంగ్రెస్ (Congress) ఆధారపడుతోందని ఆ నేతలు గుర్తు చేస్తున్నారు. ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని చెప్తున్నారు. 


కాంగ్రెస్ మేధోమథనం సమావేశాలు ‘నవ సంకల్ప చింతన్ శివిర్’ (Nav Sankalp Chintan Shivir) పేరుతో శుక్రవారం నుంచి ఆదివారం వరకు జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశాల్లో రాహుల్ గాంధీ మాట్లాడుతూ, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆరెస్సెస్) విధ్వంసకర దాడికి సైద్ధాంతిక నిరోధాన్ని కాంగ్రెస్ తీవ్రతరం చేస్తోందన్నారు. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల మాదిరిగా కాకుండా ఆరెస్సెస్ దాడిని నిరోధించేందుకు సైద్ధాంతికంగా తీవ్ర కృషి చేస్తోందని చెప్పారు. ప్రాంతీయ పార్టీలకు సిద్ధాంతం కరువైందన్నారు. వాటికి వేర్వేరు దృక్పథాలు ఉన్నాయని పేర్కొన్నారు. 


దీనిపై కాంగ్రెస్ (Congress) మిత్ర పక్షాలు జేఎంఎం, ఆర్జేడీ ఘాటుగా స్పందించాయి. అయితే డీఎంకే నేతలు బహిరంగంగా స్పందించేందుకు నిరాకరిస్తున్నారు. జేఎంఎం, కాంగ్రెస్ కలిసి జార్ఖండ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. జేఎంఎం అధికార ప్రతినిధి సుప్రియో భట్టాచార్య మాట్లాడుతూ, పోరాటాల కోసమైనా, ఎన్నికల్లో గెలవడం కోసమైనా కాంగ్రెస్ ఈ ప్రాంతీయ పార్టీలపైనే ఆధారపడుతోందన్నారు. జార్ఖండ్‌లో జేఎంఎంపై ఆధారపడుతోందని, బిహార్‌లో ఆర్జేడీపై ఆధారపడుతోందని అన్నారు. 


ఆర్జేడీ ఎంపీ మనోజ్ ఝా మాట్లాడుతూ, రాహుల్ గాంధీ వ్యాఖ్యలు దురదృష్టకరమని చెప్పారు.  బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల్లో పోరాటాల ఫలితాలను రాహుల్ గాంధీ అర్థం చేసుకుని ఉంటే, ప్రాంతీయ పార్టీలు తీసుకొచ్చిన సైద్ధాంతిక, ఎన్నికల నిబద్ధతను అర్థం చేసుకుని ఉండేవారని చెప్పారు. ప్రాంతీయ పార్టీలకు సత్తా లేదని ఆయన అంటున్నారని, ఆ పార్టీలే ఈ నిబద్ధతను తీసుకొచ్చాయని చెప్పారు. గతంలో ఆర్జేడీ (RJD) నేత తేజస్వి యాదవ్ చెప్పిన మాటలను ఝా పునరుద్ఘాటిస్తూ, దాదాపు 225 స్థానాల్లో బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రత్యక్ష పోరు ఉందని, మిగిలిన స్థానాలను ప్రాంతీయ పార్టీలకు వదిలిపెట్టాలని చెప్పారు. సహ ప్రయాణికుడి భావనకు కాంగ్రెస్ రావాలన్నారు. 


తమిళనాడులో కాంగ్రెస్ మిత్ర పక్షం డీఎంకే (DMK) నేతలు ఈ అంశంపై మాట్లాడటం లేదు. తమ పార్టీ అధినేత స్టాలిన్ (MK Stallin) స్పందన కోసం వేచి చూస్తున్నట్లు తెలిపారు. సీపీఎం (CPM) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechuri) ఇటీవల కేరళలోని కొచ్చిలో జరిగిన ఆ పార్టీ సమావేశంలో మాట్లాడుతూ, కాంగ్రెస్ గతం కన్నా చాలా బలహీనపడిందన్నారు. బీజేపీ, ఆరెస్సెస్ నేతల్లో చాలా మంది కాంగ్రెస్ వల్ల తమకు ప్రధాన ముప్పు ఉందని భావించడం లేదని, ఎందుకంటే, కాంగ్రెస్ నేతల్లో ఎవరైనా, ఎప్పుడైనా బీజేపీలో చేరగలరని చెప్పారు. 


నేషనల్ కాన్ఫరెన్స్ (National Conference) నేత ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) మాట్లాడుతూ, అందరినీ ఒకే గాట కట్టి మాట్లాడటం సరికాదన్నారు. ఒకే కుంచెతో అన్ని ప్రాంతీయ పార్టీలకు రంగు వేయడం వాటికి హాని చేయడమేనని ఆరోపించారు. ఇతరుల గురించి తాను మాట్లాడబోనని, అయితే కచ్చితంగా తాము సిద్ధాంతం లేనివారం కాదని చెప్పారు. కాంగ్రెస్ సిద్ధాంతం గురించి ఏం చెప్పాలన్నారు. శివసేన, పీడీపీ, నేషనల్ కాన్ఫరెన్స్, ఏఐఏడీఎంకే, డీఎంకే, జేడీయూ... ఇలా అన్ని పార్టీలతోనూ కాంగ్రెస్ పొత్తులు పెట్టుకుందన్నారు. ప్రాంతీయ పార్టీల అవసరం కాంగ్రెస్‌కు ఉన్నపుడు వాటిపై అది దాడి చేయకూడదన్నారు. బీజేపీపై దాడి చేయడంపై దృష్టి పెట్టాలన్నారు. 


ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Admi Party) రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ (Sanjay Singh) మాట్లాడుతూ, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ప్రజలు కాంగ్రెస్‌కు పట్టం కట్టినప్పటికీ, ఆ పార్టీ ఎమ్మెల్యేలు అమ్ముడుపోయారన్నారు. ఉత్తర ప్రదేశ్, తమిళనాడు వంటి ప్రధాన రాష్ట్రాల్లో ఆ పార్టీ ఉనికి లేదన్నారు. సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే వంటి పార్టీలకు కాంగ్రెస్ జూనియర్ పార్టనర్‌గా ఉందన్నారు. అకాలీదళ్ (Akali Dal) నేత ప్రేమ్ సింగ్ చందుమజ్రా మాట్లాడుతూ, బీజేపీ, కాంగ్రెస్ ఒకే నాణేనికి ఉన్న బొమ్మ, బొరుసు వంటివని చెప్పారు. 


Updated Date - 2022-05-18T01:32:55+05:30 IST