దర్శి వైసీపీలో మళ్లీ వేరుకుంపట్లు

ABN , First Publish Date - 2021-10-19T06:24:10+05:30 IST

దర్శి వైసీపీలో వేరుకుంపట్ల రాజకీయం మళ్లీ ప్రారం భమైంది. సోమవారం జరిగిన జడ్పీచైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అభినందన సభ అందుకు కారణమైంది.

దర్శి వైసీపీలో మళ్లీ వేరుకుంపట్లు
సభలో మాట్లాడుతున్న వెంకాయమ్మ, వేదికపై శివప్రసాద్‌రెడ్డి

వెంకాయమ్మ అభినందన సభ  సందర్భంగా బహిర్గతం 

సీఎం హెచ్చరికలు పట్టించుకోని నేతలు 

రాష్ట్ర నాయకులకు మద్దిశెట్టి,  బూచేపల్లి పరస్పర ఫిర్యాదులు 

(ఆంధ్రజ్యోతి, ఒంగోలు)

దర్శి వైసీపీలో వేరుకుంపట్ల రాజకీయం మళ్లీ ప్రారం భమైంది. సోమవారం జరిగిన జడ్పీచైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ అభినందన సభ అందుకు కారణమైంది.  ఏడాదిన్నరగా నియోజకవర్గంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్‌, మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాదరెడ్డి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అది అధినాయకత్వానికి తలనొప్పిగా మారింది. ఈ నేపథ్యంలో సీఎం ఇద్దరికీ హెచ్చరికలతో కూడిన సూచనలు చేశారు. దీంతో గత రెండు నెలలుగా పరిస్థితి చక్కబడినట్లు కనిపించింది. ముండ్లమూరు ఎంపీపీ ఎన్నిక విషయంలో బూచేపల్లిని బలవంతంగా మద్దిశెట్టి గ్రూపునకు మద్దతిచ్చే విధంగా చేశారు. అనంత రం జడ్పీ చైర్‌పర్సన్‌గా వెంకాయమ్మ ఎన్నిక కార్యక్రమా నికి వేణుగోపాల్‌ కూడా హాజరుకావటంతో పరిస్థితులు చక్కబడుతున్నట్లుగా పార్టీశ్రేణులు భావించాయి. అయితే వెంకాయమ్మ జడ్పీటీసీగా ఏకగ్రీవంగా గెలుపొందినా దర్శి మండలానికి ఇంతవరకు వెళ్లలేదు. ఈ నేపథ్యంలో సోమవారం దర్శిలో జడ్పీ చైర్‌పర్సన్‌కు అభినందన సభ ఏర్పాటుచేశారు. ఆమెతోపాటు కుమారుడు, మాజీ ఎమ్మెల్యే శివప్రసాద్‌రెడ్డి కూడా హాజరయ్యారు. హంగామాగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి పార్టీ దర్శి, ముండ్లమూరు, దొనకొండ, కురిచేడు మండల కన్వీనర్లతోపాటు ఇటీవల కురిచేడు జడ్పీటీసీగా గెలుపొందిన నాగిరెడ్డి కూడా హాజరయ్యారు. కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.


హాజరుకాని ఎమ్మెల్యే వర్గం

చైర్‌పర్సన్‌ అభినందన కార్యక్రమానికి ఎమ్మెల్యే వేణుగోపాల్‌ కానీ, వైసీపీలో ఆయనతోపాటు కలిసి నడుస్తున్న నాయకులు కానీ హాజరుకాకపోవటం చర్చనీయాంశమైంది. సభకు హాజరైన స్థానిక నాయకు లు కానీ, ఇటు వెంకాయమ్మ అటు శివప్రసాదరెడ్డి కానీ ఎక్కడా ఎమ్మెల్యే  పేరుని ఉచ్చరించలేదు. మరోవైపు ఎమ్మెల్యే వేణుగోపాల్‌ ఈ కార్యక్రమ నిర్వహణపై పార్టీ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. అది తెలిసి బూచేపల్లి కూడా ఎమ్మెల్యే విధానాన్ని తప్పుబ డుతూ అధినాయ కత్వానికి ఫిర్యాదు చేయటం విశేషం. 


ఎమ్మెల్యేని పిలవకుండా కార్యక్రమమేంటి: వేణుగోపాల్‌ 

కార్యక్రమ నిర్వహణపై ఎమ్మెల్యే వేణుగోపాల్‌.. మంత్రి బాలినేనికి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఎమ్మెల్యేగా ఉన్న తనను పిలవకుండా తన నియోజ కవర్గంలో అభినందన సభ పెట్టుకోవటం సమంజసమా అని ప్రశ్నిస్తూ వెంటనే తగుచర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. సీఎం పేషీలో కూడా ఆయన ఫిర్యాదుచేసి సీఎం దృష్టికి తీసుకెళ్లాలని కోరినట్లు తెలిసింది. ఇలాగైతే నేను తాడోపేడో తేల్చుకుంటానని రాష్ట్ర నాయకుల వద్ద వ్యాఖ్యానించినట్లు కూడా తెలిసింది. 


మా ఊరికి మేము వెళ్లకూడదా : బూచేపల్లి 

 శివప్రసాదరెడ్డి ఇటు బాలినేని అటు సజ్జలకు ఘాటైన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దర్శిలో ఒకప్పుడు నాన్న ఎమ్మెల్యే, ఆ తర్వాత నేను ఎమ్మెల్యేని. ఇప్పుడు నా తల్లి వెంకాయమ్మ దర్శి నుంచే ఏకగ్రీవంగా జడ్పీటీసీ అయ్యారు. ఆమె జడ్పీ చైర్‌పర్సన్‌ అయి నెలైంది. ఎమ్మెల్యే నుంచి పిలుపు వస్తుంది, సొంత ప్రాంతానికి వెళ్లాలని ఎదురుచూశాం. కనీసం  ఆసరా కార్యక్రమానికి పిలుస్తారు వెళ్దామని అనుకున్నాం. కానీ పిలుపే రాలేదు. ఈ దశలో నియోజకవర్గంలోని అభిమా నుల నుంచి ఒత్తిడి వచ్చింది. బూచేపల్లి కుటుంబ అభి మానులుగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందుకే వెళ్తున్నాను అని కరాఖండిగా చెప్పినట్లు తెలిసింది. ఇద్దరి వాదనలు విన్న నాయకులు విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారే తప్ప కార్యక్రమా న్ని ఆపమని కానీ, అలాగే కొనసాగించమని కానీ తేల్చి చెప్పలేదని సమాచారం. 



Updated Date - 2021-10-19T06:24:10+05:30 IST