శ్రుతులకు, గతులకు ఆద్యులు

ABN , First Publish Date - 2022-01-27T06:01:06+05:30 IST

రిగమ పదనిసలకు ఆద్యులు వాళ్లు. జీవన సంచారంలోనే శ్రుతులు, జతులు, గతులు, లయలు పలికించే కళాకారుల వారసత్వ సంపద ఒకరైతే... అడవిలో పూచే పూలు, వీచే గాలిని సుగంధభరితం చేసి, రాళ్లు, రప్పల చిరు సవ్వడులను ఒడిసిపట్టి...

శ్రుతులకు, గతులకు ఆద్యులు

సరిగమ పదనిసలకు ఆద్యులు వాళ్లు. జీవన సంచారంలోనే శ్రుతులు, జతులు, గతులు, లయలు పలికించే కళాకారుల వారసత్వ సంపద ఒకరైతే... అడవిలో పూచే పూలు, వీచే గాలిని సుగంధభరితం చేసి, రాళ్లు, రప్పల చిరు సవ్వడులను ఒడిసిపట్టి అందమైన అడవికే సుమధుర, సుందర శబ్దాలంకారాలను అద్దిన ఆదివాసీ కళాసంపన్నుడు మరొకరు. వారే, 12 మెట్ల కిన్నెర వాయిద్యకారులు దర్శనం మొగులయ్య, డోలి వాయిద్యకారులు సకినె రాంచంద్రయ్య. ఒకరిది నాగర్ కర్నూలు జిల్లా అసువుల కంట. మరొకరిది కొత్తగూడెం జిల్లా మణుగూరు దగ్గర కూనవరం. ఈ ఏడాది ఈ ఇరువురికీ భారత ప్రభుత్వం పద్మ అవార్డులు ప్రకటించింది. ఈ సందర్భంగా ఈ కళాకారుల గురించి నాలుగు మాటలు చెప్పుకోవడం మన బాధ్యత.


మొగులయ్య, రాంచంద్రయ్య చేతి వేళ్లు, స్వరాలు తమ జాతుల, తెగల, ఉప తెగల వీరత్వాన్ని గానం చేస్తాయి. అంతేకాదు ఏ చరిత్రకారుడూ చూడని, చూడలేని జీవిత కోణాలను వారు దర్శిస్తారు. ప్రధానస్రవంతికి చూపిస్తారు. మూల, ఆదివాసీ తెగల, ఉపతెగల వేల సంవత్సరాల చరిత్రను మసిపూసి మారేడుకాయ చేయాలనుకున్న పండిత సమూహాలకు సవాలు విసురుతూ తమ జాతుల మూలాలు ఇక్కడున్నాయని, తమదీ విద్వత్తు కలిగిన సాంఘిక, సామాజిక జీవితమని తాము వాయించే సంగీత సాహిత్య శబ్దాల రూపంలో చరిత్రలో రికార్డు చేస్తారు.


అంతఃపుర కాంతల గురించిన వర్ణభూషితమైన వాక్పటిమ కాదు వారిది. అచ్చం మట్టి మనుష్యుల మూగ రోదనల శోధన వారిది. తరం నుంచి మరో తరానికి వారసత్వంగా వస్తున్న అరుదైన కళారూపాలకు ప్రతీకలు వారిరువురూ. గండపెండేరం మొదలైన ఘన సన్మానాలు పొందని వాళ్లు. ఒక్క మాటలో చెప్పాలంటే అవి ఉంటాయని కూడా తెలియని పండితుల లోకం ఆ ఇరువురిదీ.


భారతీయ నిచ్చెనమెట్ల కుల వ్యవస్థలో అంటరాని కులానికే అంటరాని డక్కలి కులానికి చెందిన దర్శనం మొగులయ్య 12 మెట్ల కిన్నెర వాయిద్య కళాకారుడు. ఈ కులస్తులు మాదిగలను ఆశ్రయించుకుని జీవిస్తారు. వీరిది వీరగాథల గాన సంప్రదాయం. ప్రభువులపై తిరగబడిన పండుగల సాయన్న, మియాసాహేబ్, రాణి శంకరమ్మ, నక్కలపల్లి రాములు గురించిన పాటలు కిన్నెరపై వాయిస్తూ పాడితే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. ‘పాపాత్ముడు కాదప్ప పండుగొళ్ల సాయన్న... పాపమేమి చేసినాడు.... నేరమేమి చేసినాడు’.. ఇట్లా వారి గురించిన సుగుణాలను చెప్పకనే చెప్పడం ఈ డక్కలి కళాకారుల ప్రత్యేకత. ఇప్పుడు వీటి గురించి సోషల్ మీడియాలో చూస్తున్నాం. అయితే ఒకప్పుడు తెలంగాణ పల్లెల్లో వీరు రోజుల తరబడి పాటలు పాడితే ఊరంతా వారి వద్ద వాలిపోయేది. డక్కలి వారు పాడే పాటల నిండా ఎవ్వరూ నమోదు చేయని చరిత్ర ఉంటుంది. కొన్నేండ్లుగా ఈ పనిలో ఉన్న కళాకారుడు మొగులయ్య.


ఇక ఆదివాసీల జీవితాల గురించి బయటి ప్రపంచానికి పెద్దగా తెలియదు. తప్పును తప్పుగా తడుము కోకుండా చూపించడం ఆదివాసీల జీవన ప్రత్యేకత. అడవిలో ఉండే రంగు రంగుల పూల అందమైన మనఃలోకం వారిది. ఆ లోకపు సంగీత, సాహిత్యపు పసందైన ధ్వని వాయిద్యం డోలి. మధ్యభారతం నుంచి దక్షిణాది వరకు వ్యాపించిన కోయల గోత్రపురుషుల వీరగాన, విస్ఫోటనాల ప్రతిరూపం డోలీ వాయిద్యం. డోలీ వాయిద్యంతో తెలుగులో, కోయభాషలో సమ్మక్క, సారలమ్మల వీరోచిత గానాన్ని లయ, దరువులను సమతూకం వేసి పాడే అరుదైన మూడుభాషల్లో పట్టు సాధించిన కళాకారుడు రాంచంద్రయ్య. 


కొన్నాళ్ల కిందటి వరకు ఆదివాసీ వన దేవతలు... ఇప్పుడు కోటాను కోట్ల జనుల కొంగు బంగారం అయిన సమ్మక్క, సారమ్మల చరిత్రను మౌఖిక రూపంలో ఈ తరానికి అందిస్తున్న వారిలో డోలీ వాయిద్యకారులు ప్రముఖులు. నాటి ఓరుగల్లు ప్రభువులపై యుద్ధం చేసిన అడవి బిడ్డల ధీరత్వాన్ని... వెయ్యేళ్ల చరిత్రను పాట రూపంలో ప్రవహింపజేస్తున్నది ఈ ఆదివాసీ సంగీత, సాహిత్యకారులే. అందులో రాంచంద్రయ్య తొలివరుసలో ఉన్నారు. కాకతీయుల కాలం నాటి ఆదివాసీల చరిత్ర ఏ శిలాశానసంలో దొరకదు. కానీ రాంచంద్రయ్య నాలుకపై వివరాలు నాట్యం చేస్తాయి. ‘‘రేల రేరేలా...రేల... రేరేలా....రేలా...’’ అంటూ రాంచంద్రయ్య డోలిని వాయిస్తూ అద్భుతంగా ఆదివాసీల ఇల వేల్పుల శక్తిసామర్థ్యాలను ఆడి, పాడి ప్రదర్శిస్తారు.


వీళ్ల పాటలు విన్న తర్వాత. వారి సాహిత్యపు లోతులు అర్థం అయిన తర్వాత వీరు ప్రధాన స్రవంతికి ఎందుకు ఎట్లా దూరం అయ్యారో... ఈ సమాజం వారికి చేసిన నష్టం, కలిగించిన కష్టం ఏమిటో చాలా సులభంగా అర్థమవుతుంది. మనకు తెలియకుండా మరుగున పడి దూరంగా విసిరివేయబడిన ఎందరో గొప్ప పండితుల్లో వీరు ఒకరు. గతంలో ఈ ఇద్దరు కళాకారులను నేను ఇంటర్వ్యూ చేశాను. మేడారం జాతర సందర్భంగా రాంచంద్రయ్య గురించి తెలుసుకున్నాను. ఆయన ఇంటికి వెళ్లి కలుసుకున్నాను. డోలి వాయిద్యం వాయించడానికి ముందు ఆయన శుచీ, శుభ్రత పాటించిన తీరు ఆశ్చర్యం కలిగించింది. ఆదివాసీలే భారతీయ సాంస్కృతిక జీవితానికి మూల పురుషులని అన్పించింది. ఆదివాసీ తెగ, ఉపతెగల్లో ఓ గొప్ప కళాకారుడు ఉన్నాడనే విషయం 2014లో మాత్రమే విశాల ప్రపంచానికి తెలిసింది. వేలాది మంది సమక్షంలో రాంచంద్రయ్య తన వీరగాథా ప్రదర్శన చేశారు. అంతరించిపోయిందనుకున్న కిన్నెర వాయిద్యం మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఉందని మూడున్నర దశాబ్దాల క్రితమే లోకానికి చాటినవారు జయధీర్ తిరుమల రావు. ఆయనే 2014లో రాంచంద్రయ్య వీరగాథ ప్రదర్శనను ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ఎందరో కిన్నెర వాయిద్యకారులు లోకానికి పరిచయమయ్యారు. చాలా మంది వారిని ఆదుకున్నారు. తిరుమల రావు కృషి వల్లే ఈ రెండు సంగీత వాయిద్యాలు ప్రధాన స్రవంతికి తెలిశాయి. పక్షులు నీళ్ల జాడ వెతికినట్లు... తిరుమల రావు మరుగునపడిన, మనదైన ఆదిమానవుల సంగీత, సాహిత్యపు అడుగుజాడలు పట్టుకుంటూ వెళ్లి వాళ్లను ప్రధాన స్రవంతికి పరిచయం చేసిన నిత్య జీవిత సాహిత్య, సాంస్కృతిక సంచారి. అంటరాని కులాల సంగీత, సాహిత్యాల, ఆదివాసీ అక్షరాల మూలాల గురించి జయధీర్‌ తిరుమల్‌రావు నిరంతర పరిశోధనలో మొగులయ్య, రాంచంద్రయ్య వెలుగులోకి వచ్చారు. పద్మ అవార్డుల ఎంపికలో మూస ధోరణి బద్దలు కొట్టిన ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికీ కృతజ్ఞత చెప్పాలి. ప్రధాన స్రవంతి అంతగా పట్టించుకోని సంగీత, సాహిత్యాలకు యావత్ దేశ గుర్తింపు దక్కడం కొత్తమార్గం చూపిస్తున్నట్లు అన్పిస్తున్నది.

గోర్ల బుచ్చన్న (సీనియర్ జర్నలిస్ట్)

Updated Date - 2022-01-27T06:01:06+05:30 IST