తిరుపతిలో పక్కకు ఒరిగిన ఇల్లు..!

ABN , First Publish Date - 2021-11-28T07:24:09+05:30 IST

వరదల బీభత్సం నుంచి తిరుపతి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నేపథ్యంలో అనూహ్య ఘటనలు నగరవాసులను కలవరపెడుతున్నాయి.

తిరుపతిలో పక్కకు ఒరిగిన ఇల్లు..!
బాధితులకు రూ.95వేల చెక్‌ అందజేస్తున్న భూమన కరుణాకరరెడ్డి

ఇంటిని కూల్చేయాలన్న కార్పొరేషన్‌

బాధితులకు అండగా నిలిచిన టీడీపీ

కొత్త ఇల్లు కట్టిస్తామని ఎమ్మెల్యే హామీ


తిరుపతి, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): వరదల బీభత్సం నుంచి తిరుపతి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న నేపథ్యంలో అనూహ్య ఘటనలు నగరవాసులను కలవరపెడుతున్నాయి. ఎంఆర్‌పల్లె సమీపంలోని శ్రీకృష్ణనగర్‌లోని ఓ ఇంట్లో భూమిలో ఉన్న 11 వొరల నీటిసంపు పైకిరావడం చర్చనీయాంశమైంది. అది మరవకముందే ఇదే ప్రాంతంలో పలు ఇళ్లకు బీటలు వారాయి. ఇందులో ఇటీవల నిర్మించిన ఓ రెండంతస్తుల ఇల్లు రెండడుగుల  మేరకు ఓ పక్కకు ఒరిగింది. స్థానిక ఎమ్మెల్యే కరుణాకరరెడ్డితోపాటు మున్సిపల్‌ కమిషర్‌ గిరీష ఈ ప్రాంతాన్ని శనివారం పర్యటించారు. పక్కకు ఒరిగిపోయిన ఇంటిని కూల్చేయాలని కమిషనర్‌ నిర్ణయించారు. లేకుంటే ఆ ఇల్లు కూలిపోయి మరింత నష్టం జరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. దీంతో ఇంటి యజమానులు రాణెమ్మ, శేషయ్య దంపతులు కన్నీరుమున్నీరయ్యారు. రూ.45లక్షలు ఖర్చుపెట్టి ఇటీవలే ఇల్లు కట్టుకున్నామని, కొట్టేస్తే తాము ఎక్కడికి పోవాలని ఆవేదన చెందారు. ఇడ్లీలు అమ్మి జీవనం సాగిస్తున్నామని, ఇంటిపై తెచ్చిన రూ.20లక్షల అప్పును ఎలా తీర్చాలని ప్రశ్నించారు. 30 ఏళ్లుగా ఇలాంటి వరదలు శ్రీకృష్ణనగర్‌లో తాము చూడలేదని, నాలుగు రోజులుగా వరద నీరు తనఇంటి ద్వారానే వెళ్లాయన్నారు. తమకు న్యాయం చేశాకే ఇల్లు కూల్చాలని భీష్మించుకుని కూర్చున్నారు. అదేవిధంగా ఇదే వీధిలో వరద తాకిడికి దెబ్బతిన్న పలువురు ప్రభుత్వాన్ని తూర్పాన పట్టారు. తమ ఇళ్లు కూలిపోతే జగన్‌ జవాబు చెప్పాలని డిమాండు చేశారు. ఆయన హెలికాఫ్టర్‌లో తిరిగిపోతే ఏమి తెలుస్తుందని..? కిందకు దిగివస్తే తమ బాధలు అర్థమవుతాయన్నారు. ఇదిలావుంటే.. రాణెమ్మ దంపతులకు న్యాయం చేయాలంటూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ డిమాండ్‌ చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని, బాధితులకు న్యాయం చేయాలని నేలపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. నష్టపరిహారం చెల్లించాలని డిమాండు చేశారు. అయితే పోలీసు బలగాలతో పొక్లెయిన్‌ను అధికారులు ఆ ఇంటి వద్దకు తీసుకొచ్చారు. నష్టపరిహారం చెల్లించిన తర్వాతే ఇంటిని కూల్చేందుకు ఒప్పుకుంటామని బాధితులు తేల్చి చెప్పారు. లేకుంటే ఆ ఇంట్లోనే చనిపోతామని హెచ్చరించారు.  


బాధితులకు అండగా ఉంటాం: ఎమ్మెల్యే 

ఇల్లు కూల్చిన స్థలంలోనే ప్రభుత్వ హౌసింగ్‌ ద్వారా కొత్త ఇల్లు కట్టిస్తామని స్థానిక ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి హామీ ఇచ్చారు. ఇంటిని ఖాళీచేసి పునరావాస కేంద్రానికి వెళ్లడానికి తక్షణమే నష్టపరిహారం కింద రూ.95వేలను చెక్కు రూపంలో బాధితులకు ఎమ్మెల్యే అందజేశారు. కాగా.. ఉదయం నుంచి రాత్రి వరకు బాధితురాలికి అండగా నిలిచిన మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మతోపాటు కార్పొరేటర్‌ ఆర్సీ మునికృష్ణ, నేతలు చినబాబు, బుల్లెట్‌ రమణ, బ్యాంకు శాంతమ్మ, సింధూజ, రమణరాజు, దంపూరి భాస్కర్‌, హేమంత్‌ రాయల్‌, సందీస్‌, వెంకటేష్‌ తదితరులను కృష్ణానగర్‌ వాసులు అభినందించారు. 







Updated Date - 2021-11-28T07:24:09+05:30 IST