‘కౌలు’కు అందని కార్డులివీ!

ABN , First Publish Date - 2021-06-18T05:09:27+05:30 IST

-జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 2.38 లక్షల హెక్టార్లలో పంటలు పండిస్తున్నారు. అందులో 85 వేల హెక్టార్లలో కౌలు రైతులు సాగు చేస్తున్నారు. సుమారు 38 వేల మంది కౌలుదారులు ఉన్నారు.

‘కౌలు’కు అందని కార్డులివీ!


(ఆంధ్రజ్యోతి-శ్రీకాకుళం/ఇచ్ఛాపురం రూరల్‌) 

ఖరీఫ్‌ పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు. గత నెలలో జారీ చేయాల్సిన కౌలు కార్డులను అధికారులు ఆలస్యంగా పంపిణీ చేస్తున్నారు. మరోవైపు వ్యవసాయాధికారులు పచ్చిరొట్ట విత్తనాల పంపిణీ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో కౌలుకార్డులు అందరికీ అందుతాయో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. కౌలు కార్డులు ఉంటేనే.. 50 శాతం రాయితీతో పచ్చిరొట్ట విత్తనాలు లభిస్తాయి. పంట రుణాలు, రాయితీపై సాగు యంత్ర పరికరాలు లభ్యమవుతాయి. ఈ నేపథ్యంలో తమకు కార్డులు అందకపోతే.. ఈ ప్రయోజనాలకు దూరమవుతామేమోనని కౌలు రైతులు ఆందోళన చెందుతున్నారు. 

-జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌లో 2.38 లక్షల హెక్టార్లలో పంటలు పండిస్తున్నారు. అందులో 85 వేల హెక్టార్లలో కౌలు రైతులు సాగు చేస్తున్నారు. సుమారు 38 వేల మంది కౌలుదారులు ఉన్నారు. వారిని గుర్తించి రుణ అర్హత కార్డులు(ఎల్‌ఈసీ) ఇచ్చేందుకు జిల్లా అధికారులు చర్యలు చేపట్టారు. వాస్తవానికి ఈ ప్రక్రియ మే నెలలో ప్రారంభించి.. జూన్‌ నెల మొదటి వారానికి కార్డులు అందించడం అనవాయితీగా వస్తోంది. రెవెన్యూ, వ్యవసాయ శాఖ సమన్వయంతో ఎల్‌ఈసీ కార్డులు మంజూరు చేయాలి. కానీ ప్రభుత్వం ఈ నెల 10 నుంచి ఈ ప్రక్రియ మొదలుపెట్టింది. గ్రామ సభలు నిర్వహించి.. భూ యజమానులకు అవగాహన కల్పిస్తున్నారు. పొలం సాగుదారులకు రుణ అర్హత కార్డులు ఇవ్వడానికి వారిని ఒప్పించడంతో పాటు అర్హులను గుర్తించే పనిలో వ్యవసాయ, రెవెన్యూ అధికారులు ఉన్నారు. అర్హుల జాబితా సిద్ధమైన తరువాత మండల స్థాయి కమిటీ సమావేశమై చర్చించి కార్డులు మంజూరు చేస్తామని చెబుతున్నారు. కౌలు కార్డులు మంజూరైన తరువాత వారందరికీ సంబంధిత ప్రాంతానికి చెందిన బ్యాంకుల్లో రుణాలు ఇచ్చేలా రెవెన్యూ, వ్యవసాయ, బ్యాంకు అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. కౌలుదారులకు మంజూరు చేసే కార్డులు ఏడాది కాలవ్యవధికి ఇస్తారు. ఈ కాలంలో బ్యాంకుల నుంచి రుణాలు పొందే వెసులుబాటు రైతులకు ఉంటుంది. ఏటా కార్డులు మంజూరు చేస్తున్నా, బ్యాంకులు కౌలురైతులకు రుణాలు ఇవ్వడంలో లక్ష్యాన్ని చేరుకోలేకపోతు న్నాయి. ఈ ఏడాదైనా తమకు సక్రమంగా కార్డులు అందజేయాలని, రుణాలు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.  


సీవోసీల రెన్యువల్‌లో జాప్యం

 గత ఏడాది జిల్లాలో 10 వేల మందికిపైగా రైతులు సీవోసీలు పొందారు. అందులో కేవలం 1,245 మాత్రమే రెన్యువల్‌ చేశారు. మిగిలిన వారికి సంబంధించి ఎప్పటిలోగా రెన్యువల్‌ చేస్తారో తెలియని దుస్థితి. రెవెన్యూశాఖ ద్వారా ఈ ఏడాది వేలాదిమందికి ఎల్‌ఈసీలు జారీ చేయాల్సివుంది. ఆ లక్ష్యాన్ని మండల రెవెన్యూ అధికారులు చేరుకోలేకపోయారు. కేవలం 1,580 మందికి మాత్రమే అందాయి. నరసన్నపేట నియోజకవర్గంలో మాత్రమే కొంతవరకూ కౌలు రైతులకు రుణ అర్హత కార్డులు జారీ అయ్యాయి. మిగిలిన మండలాల్లో రుణ అర్హత లేదని తిరస్కరణకు గురయ్యాయి. కౌలు రైతుకు రెండెకరాలకు వడ్డీ లేని రుణం రూ.15 వేలు బ్యాంకుల ద్వారా అందించాల్సి ఉంది. కానీ సకాలంలో రుణ అర్హత పత్రాలు అందించలేని పరిస్థితిలో అధికారులు ఉన్నారని రైతు సంఘాల నేతలు పెదవివిరుస్తున్నారు. అధికారుల తీరుతో ఈ ఏడాది ఖరీఫ్‌ సాగుకు ఉపక్రమించిన కౌలు రైతులు విత్తనాలు, ఎరువులు కొనుగోలుకు అప్పులు చేయాల్సి వస్తోందని ఆవేదన చెందుతున్నారు. 


ప్రక్రియ ప్రారంభం

కరోనా నియంత్రణ చర్యలపై అధికారులంతా దృష్టి సారించడంతో గత నెలలో కౌలు కార్డుల మంజూరు ప్రక్రియ ప్రారంభించలేదు. ప్రస్తుతం జిల్లాలో కౌలు రైతులను గుర్తించే పనిలో అధికా రులు ఉన్నారు. అర్హులైన కౌలు రైతులందరికీ కార్డులు జారీ చేసి సాగు ఉత్పాదకాలు అందేలా చూస్తాం. అర్హులైన కౌలురైతులందరికీ కార్డులు అందిస్తాం. ఈ విషయంలో ఎటువంటి ఆందోళన చెందాల్సిన పనిలేదు.

- కె.శ్రీధర్‌, జేడీ, వ్యవసాయశాఖ, శ్రీకాకుళం



Updated Date - 2021-06-18T05:09:27+05:30 IST