కౌలు రైతుకు లేదు ‘భరోసా!’

ABN , First Publish Date - 2021-05-14T04:36:07+05:30 IST

ప్రభుత్వాలు మారుతున్నా కౌలు రైతులకు భరోసా దొరకడం లేదు. రైతు సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని పాలక పెద్దలు పదేపదే చెబుతున్నా, ఆచరణలో మాత్రం కానరావడం లేదు. తాజాగా.. మూడో విడత వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ యోజన కల్పనలో కౌలు రైతుకు మళ్లీ మొండిచేయే మిగిలింది.

కౌలు రైతుకు లేదు ‘భరోసా!’
రైతులకు చెక్కును అందిస్తున్న మంత్రులు కృష్ణదాస్‌, అప్పలరాజు, కలెక్టర్‌ నివాస్‌ తదితరులు

 కొందరికే లబ్ధి

 వేల సంఖ్యలో ఉన్నా గుర్తించని అధికారులు

(శ్రీకాకుళం-ఆంధ్రజ్యోతి)

ప్రభుత్వాలు మారుతున్నా కౌలు రైతులకు భరోసా దొరకడం లేదు. రైతు సంక్షేమమే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని పాలక పెద్దలు పదేపదే చెబుతున్నా, ఆచరణలో మాత్రం కానరావడం లేదు. తాజాగా.. మూడో విడత వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ యోజన కల్పనలో కౌలు రైతుకు మళ్లీ మొండిచేయే మిగిలింది. రైతు భరోసా పథకం ద్వారా అర్హత కలిగిన ప్రతి కౌలు రైతుకు ప్రతి ఏడాది రూ.13,500 చొప్పున నగదు బదిలీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది.   సాధారణ రైతుల మాదిరిగానే ప్రతి ఏడాది ఖరీఫ్‌ పంట వేసేముందు మే నెలలో రూ.7,500, పంట కోత, రబీ సాగు అవసరాలకు అక్టోబరులో రూ.4 వేలు, ధాన్యం ఇంటికి చేరే వేళ, సంక్రాంతి పండుగ సందర్భంగా రూ.2వేలు కౌలు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని వెల్లడించింది. ఈ లెక్కన ఐదేళ్లలో ప్రతి కౌలు రైతుకు రూ.67,500 చెల్లించాల్సి ఉంది. కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. గత రెండేళ్లలో కౌలు రైతుల గుర్తింపు ప్రక్రియ సక్రమంగా జరగలేదు. దీంతో జిల్లాలో వేలల్లో కౌలు రైతులు ఉంటే... వందల్లో మాత్రమే అర్హులున్నారని వ్యవసాయ శాఖ తేల్చేసింది. గతంలో అధికారుల సర్వే ప్రకారం జిల్లాలో కౌలు రైతులు దాదాపు 45 వేల నుంచి 60 వేల మంది వరకు ఉన్నారని అంచనా వేశారు. అలాంటిది ఇప్పుడు జిల్లాలో కేవలం 340 మంది మాత్రమే ఉన్నట్లు తేల్చినట్లు సమాచారం.   


అసలు ఎంతమందికి జమ చేశారో?

 జిల్లాలో అసలు ఎంతమంది కౌలు రైతులకు రైతు భరోసా సాయం అందిస్తున్నారనే గణాంకాలను అధికారులు  వెల్లడించడం లేదు. మూడోవిడత  వైఎస్‌ఆర్‌ రైతు భరోసా, పీఎం కిసాన్‌ పథకం కింద జిల్లాలో 3,90,988 రైతు కుటుంబాలకు రూ.293.24 కోట్లు అందజేస్తున్నామని అధికారులు చెబు తున్నారు. ఇందులో ఎంతమంది కౌలు రైతులు ఉన్నారో చెప్పడం లేదు. వాస్తవానికి కౌలు రైతులకు ఆర్థిక సాయం అందాలంటే అసలు భూ యజమాని పాసుపుస్తకం, ఆధార్‌ కార్డు జిరాక్స్‌ను అధికారులకు అందజేయాలి. దీనిని బట్టీ రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు కౌలు రైతులకు సాగు ధ్రువీకరణ పత్రాలు అందజేస్తారు. అయితే, కౌలుకు తీసుకున్న రైతుకు ఎక్కడ హక్కులు వెళ్లిపోతాయోనని భయంతో భూయజమానులు పత్రాలు ఇవ్వకుండా తాత్సారం చేస్తున్నారు. దీంతో కౌలు రైతులకు ప్రభుత్వ సాయం అందని దుస్థితి నెలకొంది. జిల్లాలో కౌలు రైతులకు ఎంతమందికి లబ్ధి చేకూర్చారో ప్రకటించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం మండల స్థాయిలో కౌలు రైతులను గుర్తించి ఆర్థిక భరోసా కల్పించాలని కోరుతున్నారు.



రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

 ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్‌

కలెక్టరేట్‌, మే 13 :  రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని  ముఖ్యమంత్రి వై.ఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి అన్నారు. గురువారం రైతుభరోసా పథకం కింద ఆర్థిక సహాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన  వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడుతూ..  కరోనా కష్టాలు వెంటాడుతున్నా... ఇచ్చిన మాట ప్రకారం ‘రైతుభరోసా’ అందజేశామన్నారు. రాష్ట్రంలో వరుసగా మూడో ఏడాది తొలివిడతగా 52.38 లక్షల మంది రైతులకు రూ.3,928,88 కోట్లను జమ చేశామని తెలిపారు. ఈ పథకానికి సంబంధించి సమస్యలు ఉంటే.. 155251 నెంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు. అనంతరం కలెక్టర్‌ నివాస్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది తొలివిడతలో ఈ పథకం కింద జిల్లాలో 3,90,988 మంది రైతుల కుటుంబాలకు రూ.293.24 కోట్లు  జమ చేశామని తెలిపారు. వైఎస్సార్‌ రైతుభరోసా కింద రూ. 216.87కోట్లు, పీఎం. కిసాన్‌ పథకం కింద రూ.76.37 కోట్లు, జమ చేశామన్నారు. వీడియో కాన్ఫరెన్సులో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌,  మత్స్య, పశుసంవర్ధక శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాసరావు, పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి, అగ్రిమిషన్‌ సభ్యులు రఘురామ్‌, కళింగ వైశ్య కార్పొరేషన్‌ ఛైర్మన్‌ అందవరపు సూరిబాబు, పలాస మునిసిపల్‌ ఛైర్మన్‌  గిరిబాబు, వ్యవసాయ శాఖ ఇన్‌ఛార్జి జేఈ కె.రాబర్ట్‌పల్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-14T04:36:07+05:30 IST