గ‘లీజుదారులు’

ABN , First Publish Date - 2022-05-21T06:15:02+05:30 IST

రావులపాలెం పంచాయతీకి సంబంధించి పంచాయతీ కాంప్లెక్స్‌లో మొత్తం 81 షాపులున్నాయి. వీటిలో మెగా షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 20, పాత మార్కెట్‌లో 61 ఉన్నాయి. 2008 సంవత్సరంలో 20 షాపులతో మెగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించారు.

గ‘లీజుదారులు’
పంచాయతీ మెగా కాంప్లెక్స్‌

  • బహిరంగ వేలం నిర్వహిస్తే షాపుల ద్వారా రూ.50 లక్షలకు పైగా ఆదాయం
  • నిబంధనలు అతిక్రమించి లీజుదారులు షాపులను సబ్‌ లీజుకు ఇచ్చిన వైనం
  • ఈసారి కూడా షాపులు పాత ధరకు దక్కించుకునేలా అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు!
  • రావులపాలెం పంచాయతీ ఆదాయానికి భారీగా గండి పడే పరిస్థితి

పంచాయతీ పరిధిలో ఉన్న షాపులకు బహిరంగ వేలం నిర్వహించకుండా పాత పద్ధతిలో షాపులు దక్కించుకునే యత్నంలో భాగంగా ఆ పంచాయతీ సంవత్సర ఆదా యానికి రూ.50 లక్షలకు పైగా గండిపడే పరిస్థితి ఏర్పడింది. లీజుదారులు షాపులను వారే నిర్వహించుకోవాలే తప్ప సబ్‌ లీజుకు ఇవ్వడానికి వీలు లేదన్న నిబంధనలున్నా వాటిని అతిక్రమించారు. తక్కువ ధరకు షాపులను దక్కించుకున్న పాటదారులు షాపులను సబ్‌ లీజుకు ఇచ్చి  లక్షలాది రూపాయలు ఆర్జిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. 

రావులపాలెం రూరల్‌, మే 20: రావులపాలెం పంచాయతీకి సంబంధించి పంచాయతీ కాంప్లెక్స్‌లో మొత్తం 81 షాపులున్నాయి. వీటిలో మెగా షాపింగ్‌ కాంప్లెక్స్‌లో 20, పాత మార్కెట్‌లో 61 ఉన్నాయి. 2008 సంవత్సరంలో 20 షాపులతో మెగా షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మించారు. ఆ సమయంలో గుడ్‌విల్‌ ఆక్షన్‌ ద్వారా పాట పెట్టడంతో పాటదారులు  నిర్మాణానికి సొమ్ములిచ్చారు. షాపుల నిర్మాణం పూర్తయిన తర్వాత కలెక్టర్‌ ఆదేశాల మేరకు నెలకు కింద షాపు రూ.801, పై షాపు రూ.501 అద్దె నిర్ణయించారు. మిగిలిన 61 షాపులకు వేలం నిర్వహించారు. 1-8-2008 నుంచి 31-7-2017 తొమ్మిది సంవత్సరాల కాలానికి షాపులవారు ఆ సమయంలో నిర్ణయించిన ధర చెల్లించేందుకు అధికారులు నిర్ణయించారు. 1-8-2017 నుంచి ఆరు సంవత్సరాల కాలానికి పైన సూచించిన అద్దెపై 30శాతం పెంచి ఇవ్వాలంటూ పాటదారులు రిజిస్టర్‌ లీజు అగ్రిమెంట్లు రాసి ఇచ్చారు. దీంతో అధికారులు ఆ విధంగా వారికి షాపులు ఇచ్చారు. లీజు గడువు దగ్గర పడుతుండడంతో అదే ధరకు షాపులు దక్కించుకునేందుకు పాటదారులు ప్రయత్నాలు ప్రారంభించినట్టు సమాచారం. దీనికోసం అధికారులపై రాజకీయ ఒత్తిళ్లు తెస్తున్నట్టు పలువురు చెప్తున్నారు. మరో విషయం ఏమిటంటే... అతి తక్కువ ధరకు లీజు దక్కించుకున్న పాటదారులు కింద షాపులను రూ.20 వేల నుంచి రూ.25వేల వరకు, పై షాపులను రూ.15 వేల నుంచి రూ.18వేల వరకు అద్దెకు ఇచ్చి నిబంధనలను అతిక్రమించారు. రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అధికారులు పట్టించుకోవట్లేదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. పాట ద్వారా ప్రస్తుతం సంవత్సరానికి మొత్తం 81 షాపులకు రూ.11లక్షలు మాత్రమే  పంచాయతీకి సమకూరుతోంది. అదే  బహిరంగ వేలం నిర్వహిస్తే రూ.50 లక్షలు పైబడి ఆదాయం వస్తుందని పలువురు చెప్తున్నారు. ఈసారైనా బహిరంగ వేలం నిర్వహిస్తారా, పాత పద్ధతిలో వారికే కట్టబెడతారా అనేది చర్చనీయాంశంగా మారింది. 


Updated Date - 2022-05-21T06:15:02+05:30 IST