వదిలేయండి అందర్నీ!

ABN , First Publish Date - 2021-05-11T07:51:16+05:30 IST

ఒకప్రాణాంతకమైన అంటువ్యాధి ప్రపంచాన్నంతా చుట్టుముట్టినప్పుడు, అదొక విషాదం, సంక్షోభం, పోరాటం. మనుషులలో మానవీయత శిఖరాయమానంగా...

వదిలేయండి అందర్నీ!

ఒకప్రాణాంతకమైన అంటువ్యాధి ప్రపంచాన్నంతా చుట్టుముట్టినప్పుడు, అదొక విషాదం, సంక్షోభం, పోరాటం. మనుషులలో మానవీయత శిఖరాయమానంగా వెలుగుతున్న దృశ్యాలూ కనిపిస్తాయి, ఈ సమయంలో కూడా స్వార్థంతో అల్లాడిపోతూ మృత్యువ్యాపారం చేసే సన్నివేశాలూ కనిపిస్తాయి. శ్వాసల ఎగపోతలతో ఆస్పత్రి గుమ్మాలు ఎక్కీ దిగే రోగులు, ఆదుకొమ్మని ఆర్తనాదాలు పెడుతూ కనిపించే బంధువులూ, అకస్మాత్తుగా అనాథలయ్యే పిల్లలు, ప్లాస్టిక్ సంచులలో సీల్ చేసిన మృతదేహాల వరుసలు, ఒకే ప్రాణవాయు శయ్యను పంచుకునే ఇద్దరు రోగులు, ఒకే చితిలో మండిపోయే అనేకానేక దేహాలు..... మరణంలో కూడా కాస్త గౌరవానికి ఆస్కారం లేని కాలం. ఉన్న వ్యవస్థే అనేక అసమానతల, అనేక దుర్మార్గాల వేదిక. దానికి తోడు మరొక తీవ్రసందర్భం తోడయినప్పుడు, వ్యవస్థకు ఉన్న సమస్త వికృత ముఖాలూ మరింత భీకరంగా కనిపిస్తాయి.


నటాషా నర్వాల్. ఒక రాజ్య బాధితురాలు. కొవిడ్ బాధితురాలు కూడా. ఆమెకు కరోనా సోకలేదు. కానీ, ఒక ప్రాకృతిక వైపరీత్యమూ ఒక మానవ దుర్మార్గమూ తల్లిలేని నటాషాకు తండ్రి కూడా లేకుండా చేశాయి. ఆ తండ్రి మామూలు తండ్రి కాదు, కుమార్తె పోరాటానికి గర్వించే తండ్రి. కూతురి విడుదల కోసం పోరాడే తండ్రి. మహావీర్ నర్వాల్. అతనికి కొవిడ్ సోకి అవసాన దశలో ఉన్నాడని, కూతురును చూడాలనుకుంటున్నాడని తెలిసినా నటాషాకు బెయిల్ దొరకలేదు. ఆమె చేసిన నేరమల్లా, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో పాల్గొనడం. అనుమతి లేకుండా జరిగిన ఒక జనసమీకరణలో ఆమె అభ్యంతరకరంగా ప్రసంగించిందని అభియోగం. పోయిన ఏడాది మే నెల నుంచి ఇప్పటిదాకా పధ్నాలుగు నెలలుగా నటాషా నిర్బంధంలో ఉన్నది. ఇప్పుడు తండ్రి చనిపోయాడు. అతనికి అంత్యక్రియలు చేయాలి. సోదరుడు కూడా కొవిడ్ బాధితుడై జనానికి దూరంగా ఉంటున్నాడు. అందువల్ల, న్యాయం చేయడం కోసం ఢిల్లీ హైకోర్టు ఆమెకు మూడు వారాల తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఈ స్వేచ్ఛాకాలంలో ఆమె తన నిర్బంధం గురించి, కేసు గురించి మాట్లాడకూడదు.


జైళ్లలో కొవిడ్ ప్రబలడానికి ఆస్కారం ఉన్నది కాబట్టి, పోయిన ఏడాది బెయిల్ ఇచ్చినవారందరికీ మళ్లీ బెయిల్ ఇవ్వమని అత్యున్నత న్యాయస్థానం ఈ మధ్యనే సూచించింది. జైళ్లలోని వారికే కాదు, బయట ఉన్న వారి కుటుంబసభ్యులకు కూడా కొవిడ్ సోకుతుంది. మరణాలు జరుగుతాయి. కొన్ని కేసుల విషయంలో ప్రాసిక్యూషన్ మాత్రమే కాదు, న్యాయవ్యవస్థే మొత్తంగా అన్యాయంగా ప్రవర్తిస్తుందేమో అనిపిస్తుంది. వ్యవస్థకు ఉన్న కక్ష ఏదో వారి విషయంలో వ్యక్తం అవుతూ ఉంటుంది. 90 శాతం వికలాంగుడైన అధ్యాపకుడు సాయిబాబాకు అంతటి తీవ్రమైన శిక్ష విధించడం దగ్గర నుంచి, ఆయన ఆరోగ్య రీత్యా పెరోల్ ఇవ్వడం దాకా అభ్యర్థనలకు తగిన స్పందనే దొరకలేదు. పోనీ, దీర్ఘకాలికమైన వెసులుబాటు ఇవ్వకపోవడం న్యాయస్థానాల విచక్షణ అనుకుందాం. కానీ, ఆ బందీ తల్లి చనిపోయినప్పుడు అంత్యక్రియలకు కూడా వెళ్లలేకపోయారు. ఎన్నో న్యాయపోరాటాల తరువాత విప్లవకవి వరవరరావుకు ఎంతో కొంత వెసులుబాటు లభించింది. ఆయన సహ ముద్దాయి, హక్కుల కార్యకర్త సుధా భరధ్వాజ్ అనారోగ్యంతో బాధపడుతూ, న్యాయపరమైన ఊరట కోసం ఎదురుచూస్తున్నారు. కొవిడ్ ఉత్పాత కాలంలో కూడా వీరందరినీ అత్యంత ప్రమాదకారులుగా రాజ్యం పరిగణిస్తోంది. ఈ పరిగణన కారణంగా, వ్యవస్థకు, కనీసం న్యాయవ్యవస్థకు ఉంటాయని భావిస్తున్న మానవీయ కోణం కూడా మృగ్యమై పోతున్నది. ఉరితీసే ఖైదీని చివరి కోరిక ఏమిటి అని అడుగుతారట. ఇంకా శిక్ష పడని, విచారణలో మాత్రమే ఉన్న ఖైదీ, తన దగ్గరి కుటుంబసభ్యులను వారి లేదా తమ అవసానకాలంలో కూడా చూడలేకపోవడమేమిటి? 


పౌరసత్వ చట్టం మీద జరిగిన ఆందోళనను కేంద్రప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. శిబిరాలు ఏర్పాటు చేసి, ఢిల్లీలోని విద్యార్థి యువజనులు ఇతర పౌరసమాజం అండతో ప్రధానంగా ముస్లిం మహిళలు ఆందోళన చేశారు. ప్రభుత్వం ఎటువంటి స్పందనా చూపకుండా ఉన్నది. ఇంతలో, ఆశ్చర్యకరంగా ఆ ఉద్యమం స్ఫూర్తికి భిన్నంగా మతఘర్షణలు జరిగాయి. అటువంటి హింసాకాండలో బాధితులు ఎవరు అధికంగా ఉంటారో తెలిసిందే. ఇంతలో కరోనా వైరస్ దేశంలో ప్రవేశించింది. కొవిడ్‌ను భారత ప్రభుత్వం ఉపయోగించుకున్నంత సృజనాత్మకంగా మరెవరూ ఉపయోగించుకుని ఉండరు. ఉద్యమంతో సంబంధం ఉన్నవారందరినీ అరెస్టు చేశారు. అధికంగా ‘ఊపా’ కేసులు నమోదు చేశారు. జెఎన్‌యు, జామియా మిలియా, ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థి నేతలు అనేకులు ‘ఊపా’ నిందితులయ్యారు. గర్భవతి అయిన విద్యార్థిని బెయిల్ కోసం దీర్ఘకాలం ప్రయత్నించాక, నెలలు నిండడం సమీపించిన తరువాతనే వెసులుబాటు లభించడం తెలిసిందే. దేశరాజధానిలో విద్యార్థినులకు కానీ, ఉద్యోగినులకు కానీ సేవలందించే హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ వసతులలో సదుపాయాల కోసం, నిర్బంధం లేని నిబంధనల కోసం ఏర్పడ్డ సంస్థ 


‘పింజ్రా టాడ్’ కార్యకర్త నటాషా. ఆమె కూడా పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నడచిన ఉద్యమంలో పాల్గొన్నది. మార్క్సిస్టు పార్టీని అభిమానించే ఆమె తండ్రి తన కూతురును ప్రోత్సహించారు కూడా.


దేశంలో విచారణలో ఉన్న ఖైదీలందరినీ, రాజకీయ కారణాలతో నిర్బంధించినవారితో సహా, ఈ కరోనా కల్లోల కాలంలో బెయిల్ మీద విడుదల చేయడం జాతీయ విధానం కావాలి. అందరూ కుటుంబాలకు దగ్గరగా ఉండవలసిన రోజులు ఇవి. ప్రజారోగ్యాన్నీ ఖాతరుచేయక, కుటుంబం ద్వారా లభించే ఊరటను అనుమతించక, ప్రభుత్వాలు ఇంత అమానవీయంగా ఉండనక్కరలేదు. ఒకరికొకరు అస్పృశ్యంగా, ఇళ్లే జైళ్లుగా మారిన కాలంలో, బంధించి సాధించేది మాత్రం ఏమున్నది?

Updated Date - 2021-05-11T07:51:16+05:30 IST