పట్నం వదిలి పల్లె బాట

ABN , First Publish Date - 2022-07-06T09:01:21+05:30 IST

‘‘సాఝే సప్నే’... రెండేళ్ల కిందట నేను నెలకొల్పిన స్వచ్ఛంద సంస్థ ఇది. అణగారిన వర్గాలకు చెందిన గ్రామీణ మహిళల కలలను నిజం చేసే ఉద్దేశంతో ప్రారంభించాను.

పట్నం వదిలి పల్లె బాట

ఓ గిరిజన యువతి నుంచి వచ్చిన అభ్యర్థన... సురభి యాదవ్‌ ఆలోచనల్ని మార్చేసింది. తన చదువు తన చుట్టూ ఉన్నవారికి కూడా ఉపయోగపడాలనే సంకల్పం... ఆమెను సామాజిక చైతన్యం వైపు నడిపించింది.  అట్టడుగు వర్గాల మహిళలకు నైపుణ్య శిక్షణలిచ్చి... ఉన్నత ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్న సురభి  ప్రయాణం ఇది...


‘‘సాఝే సప్నే’... రెండేళ్ల కిందట నేను నెలకొల్పిన స్వచ్ఛంద సంస్థ ఇది. అణగారిన వర్గాలకు చెందిన గ్రామీణ మహిళల కలలను నిజం చేసే ఉద్దేశంతో ప్రారంభించాను. ముందు నుంచి నాకు సామాజిక సేవ చేయాలని ఉన్నా... ఈ సంస్థకు రూపం ఇవ్వడానికి కారణం మాత్రం ఒక మారుమూల పల్లెటూరి గిరిజన అమ్మాయి. పేరు ఫూలా కుమారి. బిహార్‌లోని కత్రాసిన్‌ ప్రాంతం తనది. రెండేళ్ల కిందట... కరోనా విజృంభిస్తున్న సమయం... కొవిడ్‌ సహాయక చర్యల్లో భాగంగా నేను ఆ ప్రాంతానికి వెళ్లాను. అప్పుడు నాకు ఒక యువతి తారసపడింది. ‘అక్కా... ఫోన్‌ ద్వారా అయినా పర్లేదు... నాకు చదువు చెప్పండి. ఎలా చెప్పినా నేను నేర్చుకొంటా’ అంటూ ఆ యువతి నన్ను అభ్యర్థించింది. ఏదో సాయం చేయమనేవారే తప్ప అలా నన్ను ఎవరూ చుదువు చెప్పమని అడగలేదు. ఆశ్చర్యం అనిపించింది. తన అభ్యర్థన నా ఆలోచనా విధానాన్నే మార్చేసింది. నేను పయనించాల్సిన మార్గమేమిటో చూపించింది. 


ఒక్క శాతం కన్నా తక్కువ... 

అధ్యయనంలో మాకు తెలిసిందేమిటంటే... పూలా కుమారి కమ్యూనిటీలో అక్షరాస్యతా శాతం ఒకటి కన్నా తక్కువ. అలాంటి నేపథ్యం నుంచి వచ్చిన తనకు సాధించాల్సిన కలలు ఎన్నో ఉన్నాయి. ఆ కలలు నెరవేరవని తెలిసి... వాటిని అణచిపెట్టుకుంది. పన్నెండో తరగతి తరువాత చదువు కొనసాగించలేదన్న బాధ తనను వేధించింది. కానీ భవిష్యత్తును ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలన్న తపన తన కళ్లల్లో స్పష్టంగా కనిపించింది. అదే నన్ను బాగా ఆకట్టుకుంది. ఎందు కంటే ఫూలా కుమారిని చూసినప్పుడు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది. ముఖ్యంగా చనిపోయిన మా అమ్మ గుర్తుకువచ్చింది. నన్ను చదివించడానికి మా అమ్మానాన్న ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. మా నలుగురు సంతానాన్నీ అమ్మ విద్యావంతులను చేసింది. అమ్మలో నాడు కనిపించిన ఉత్సాహం మళ్లీ ఫూలా కుమారిలోనే చూశాను. ఆమెను కలిశాకే ‘సాఝే స్వప్నే’ స్వచ్ఛంద సంస్థ ఆలోచన వచ్చింది.  


ఉపాధి శిక్షణ... 

మారుమూల ప్రాంతాల్లోని మహిళలకు కూడా మా కార్యక్రమాలు చేరేలా కృషి చేస్తున్నాం. బడి మానేసిన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి, సరైన మార్గంలో పెడుతున్నాం. వెబ్‌ డెవల్‌పమెంట్‌, మేనేజ్‌మెంట్‌ లాంటి ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్న అంశాల్లో శిక్షణనిస్తున్నాం. కేవలం బోధనే కాకుండా సంబంధిత విషయాలపై చర్చలు పెట్టి, ఆసక్తిని, విజ్ఞానాన్ని పెంపొందించేలా కోర్సులు రూపొందించాం. అవసరాన్ని బట్టి తొమ్మిది నెలల రెసిడెన్షియల్‌ ట్రైనింగ్‌ కూడా అందిస్తున్నాం. తరువాత రూ.15 వేల నుంచి 25 వేల జీతంతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం. ప్రస్తుతం మా సంస్థలో శిక్షణ తీసుకొంటున్నవారిలో బిహార్‌ మహిళలే కాదు... ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు. అంతా సామాజికంగా, ఆర్థికంగా వెనకబడిన వర్గాలవారు. నేర్చుకోవాలన్న బలమైన కోరిక, ఒకరిపై ఆధారపడకుండా స్వయంకృషిని నమ్ముకుని జీవించాలన్న ఆలోచన ఉన్న వాళ్లను చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. ఇలాంటి వాళ్ల కోసం ‘సప్న సెంటర్స్‌’ నెలకొల్పాను. వారిని మరింత ఉన్నతంగా నిలపాలని పట్నం వదిలి పల్లె మార్గం ఎంచుకున్నా. దాని కోసం నేను సంపాదించిన విజ్ఞానాన్నే కాదు, నా జీవితకాలాన్ని కూడా వెచ్చిస్తాను. 


వారికి తొలి ప్రాధాన్యం... 

సంస్థ ప్రారంభించాక తొలి ప్రాధాన్యం... పన్నెండో తరగతి తరువాత కూడా చదువు కొనసాగించి, ఉన్నతమైన లక్ష్యాలు అధిగమించాలనుకొనే అమ్మాయిలకు ఇచ్చాం. గ్రామాల్లో అలాంటి ‘సప్నేవాలీ’లను గుర్తించి, అవసరమైన శిక్షణ అందిస్తూ వచ్చాం. ఆశ్చర్యమేమంటే... చదువు మధ్యలో ఆపేసిన అమ్మాయిలే కాదు... పెళ్లి చేసుకుని, సంసార భారాన్ని మోస్తున్న మహిళలు కూడా ముందుకు వచ్చారు. ‘మీ కార్యాలయంలో మమ్మల్ని ఏదోఒక పనికి పెట్టుకోండి. కనీసం మిమ్మల్ని చూసైనా మేమూ ఎంతో కొంత నేర్చుకొంటాం’ అన్నారు. తమ కాళ్లపై తాము నిలబడాలన్న వాళ్ల తపన నా బాధ్యతను మరింత పెంచింది. 

Updated Date - 2022-07-06T09:01:21+05:30 IST