దాడి చేసిన వారిని వదిలేసి మాపై కేసులా!

Sep 22 2021 @ 01:07AM

డీజీపీకి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్లడం నేరమా

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌

అద్దంకి టౌన్‌, సెప్టెంబరు 21 : రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ ప్రజాస్వామ్య హక్కులను హరిస్తుందని ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇంటిపై దాడిచేసిన వారిని వదిలేసి, డీజీపీకి ఫిర్యాదు చేసేందుకు వెళ్లిన తమపై కేసులు నమోదు చేయడం దుర్మార్గం అన్నారు. ఇది రాష్ట్ర చరిత్రలోనే చీకటి రోజుగా అభివర్ణించారు. ఈ మేరకు మంగళ వారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రానికి 14ఏళ్లపాటు సీఎంగా పనిచేసిన చంద్రబాబుకు రక్షణ కల్పించడంలో పోలీసు వ్యవస్థ విఫలమైందని రవికుమార్‌ విమర్శించారు. అధికారపార్టీకి చెందిన ఒక ఎమ్మెల్యే, కొందరు దుండగులతో కలిసి చంద్రబాబు ఇంటిపై దాడిచేసి, అక్కడ ఉన్న నేతలను తీవ్రంగా కొట్టి గాయపరిచినా పోలీసులు పట్టించుకోలేదన్నారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు తనతోపాటు జిల్లా ఎమ్మెల్యేలు స్వామి, ఏలూరి సాంబశివరావు, సహచర ఎమ్మెల్యే రామానాయుడు, టీడీపీ ముఖ్య నేతలతో కలిసి డీజీపీ కార్యాలయానికి వెళ్లామని చెప్పారు. అక్కడ ఉన్న పోలీసులు గేట్లు మూసివేసి తమను నిలిపివేశారన్నారు. కనీసం గేట్ల వద్దకు కూడా చేరుకోని తమపై కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. తమకు జరిగిన నష్టాన్ని, అన్యాయాన్ని డీజీపీకి కాకుండా దేవుడికి చెప్పాలా అని ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులైన తమపైనే ఇలా కేసులు నమోదు చేస్తే ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చన్నారు. పోలీసు వ్యవస్థపై ఉన్న నమ్మకం సన్నగిల్లేలా కొందరు అధికారులు వ్యవహరించడం దారుణమన్నారు. మాజీ సీఎం ఇంటిపై దాడిఘటన రాష్ట్రానికి మాయని మచ్చ అన్నారు. అందుకు బాధ్యులైన దుండగులపై నాన్‌ బెయిలబుల్‌ కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని రవికుమార్‌ డిమాండ్‌ చేశారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.