money-habits: ఈ 4 అలవాట్లు మానుకోకపోతే మీ దగ్గర డబ్బే నిలవదు!.. మీకూ ఉన్నాయా ఆ అలవాట్లు?

ABN , First Publish Date - 2022-09-16T01:47:40+05:30 IST

సమాజంలో కొందరు వ్యక్తులు బాగానే డబ్బు సంపాదిస్తుంటారు. కానీ సగం నెల గడిచేసరికి ఇతరుల వద్ద చేతులు చాస్తుంటారు.

money-habits: ఈ 4 అలవాట్లు మానుకోకపోతే మీ దగ్గర డబ్బే నిలవదు!..  మీకూ ఉన్నాయా ఆ అలవాట్లు?

మాజంలో కొందరు వ్యక్తులు బాగానే డబ్బు(Money) సంపాదిస్తుంటారు. కానీ సగం నెల గడిచేసరికి ఇతరుల వద్ద చేతులు చాస్తుంటారు. కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల వద్ద అప్పులు చేస్తుంటారు. ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనేవారి సంఖ్య గట్టిగానే ఉంటుంది. అయితే అలాంటివారివద్ద డబ్బులు మిగలకపోవడానికి ప్రధానంగా 4 చెడు అలవాట్లు కారణమవుతున్నాయి. జాగ్రత్తగా వ్యవహరించి ఈ అలవాట్లను మార్చుకుంటే కొంతలో కొంతైనా డబ్బును సేవ్ చేసుకోవచ్చు. ఆ అలవాట్లు ఏంటి, మీరు పాటిస్తున్నారో లేదో ఒక్కసారి చూసుకోండి..





స్నేహితులతో పార్టీలా?

అందరూ కాదు కానీ కొందరు వ్యక్తులు ప్రత్యేక సందర్భం ఏమీ లేకపోయినా  తమ ఫ్రెండ్స్ సర్కిల్స్‌లో పార్టీలు చేసుకుంటుంటారు. వారంలో రెండుమూడు సార్లైనా ఈవెంట్స్ ప్లాన్ చేస్తుంటారు. చాలామంది పైకి  ఒప్పుకోకపోయినా ఇది నిజం. ఈ చెడు అలవాటు కారణంగా ప్రతిసారి కనీసం రూ.500 నుంచి రూ.1000-1500 వరకు ఖర్చవుతుంటుంది. ఇలాంటి పార్టీలు నెలకు రెండు జరిగినా ఎంత నష్టమో ఒక్కసారి ఆలోచిస్తే ఇట్టే అర్థమైపోతుంది. ప్రతి నెలా రూ.2000 - రూ.3000 తమ కుటుంబానికి ఎలా ఉపయోగపడతాయో  పరిశీలించుకోవడం మంచిది. కాబట్టి సాధ్యమైతే ఇలాంటి చెడు అలవాట్లను మానుకోవడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా యువత ఈ అలవాటుకు ఎంతదూరంగా ఉంటే అంత లాభం.


మీ సంపాదన ఎంత? ఖర్చు ఎంత?

‘ఆదాయం మూరెడు.. ఖర్చు బారెడు’ భారతీయ సమాజంలో బాగా వినిపించే మాట ఇది. ఆదాయానికి మించిన ఖర్చులను సూచిస్తున్న ఈ సత్యాన్ని చాలా మంది చాలా ఆలస్యంగా గుర్తిస్తుంటారు. రాబడి కంటే ఎక్కువ ఖర్చుపెట్టేసి ఇతరుల వద్ద అప్పులు చేస్తూ.. వడ్డీలు చెల్లిస్తూ ఉంటారు. ఈ అలవాటు దీర్ఘకాలంలో ఆర్థికంగా చాలా దెబ్బతీస్తుంది. జీవితంలో ఎప్పటికీ ఎదగనీయకుండా అడ్డుపడుతుంది. ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆదాయానికి మించిన వ్యయాలు ఏమాత్రం శ్రేయస్కరం కాదనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. కానీ ఆదాయానికి మించి ఖర్చు చేసే అలవాటును ఎంతత్వరగా మానుకుంటే అంతమంచిది.





గొప్పలకు పోతే తిప్పలు తప్పవు..

గొప్ప అనిపించుకోవడం కోసం కొంతమంది అతికి పోతుంటారు. ఇలాంటివారు మీ చుట్టూనే కనిపిస్తుంటారు. స్నేహితులు, బంధువులను మెప్పించడం కోసం విలువైన వస్తువులు కొంటుంటారు. అలాంటి వ్యక్తులు వస్తువులు లేదా ఇంకేదో కొనేటప్పుడు కనీసం బేరాలు కూడా ఆడరు. వస్తువు నాణ్యతను కూడా పెద్దగా పరిశీలించుకోరు. పెద్ద పెద్ద మాల్స్‌లో వేలాది రూపాయలు విలువ చేసే దుస్తులను కొనుగోలు చేస్తుంటారు. ఇలాంటి కొనుగోళ్లు నెలలో రెండుసార్లు చేసినా చాలు చేతిలో డబ్బు ఖాళ్లీ అవ్వడం, స్నేహితుల వద్ద చేతులు చాచడం ఖాయం. కాబట్టి విలాసాలు, గొప్పలకు పోయి అతిగా డబ్బు పెట్టడం అనర్థం. ఈ చెడు అలవాటును ఎంతత్వరగా మానుకుంటే అంతమేలు జరుగుతుంది. స్థోమత ఎంతో ఆలోచించుకుని పరిధి మేరకు ఖర్చుపెట్టుకోవడం ఉత్తమమని గుర్తుంచుకోవడం మంచిది.


అనవసరంగా షాపింగ్ చేయవద్దు..

జనాలు సాధారణంగా అవసరమైన వస్తువులను కొంటారు. కానీ కొందరు మాత్రం అవసరం లేకపోయినా కొనుగోలు చేస్తుంటారు. వారానికోసారో లేదా నెలకోసారో షాపింగ్ చేస్తుంటారు. అలాంటివాళ్లు కొనే వస్తువుల్లో ఉపయోగపడనివే ఎక్కువగా ఉంటాయి. అలాంటి సందర్భాల్లో డబ్బు వృథా తప్ప పెద్దగా ప్రయోజనం ఉండదు. ఏదైనా వస్తువు కొన్నామంటే ఉపయోగపడేలానే ఉండాలి. లేదంటే డబ్బును కోల్పోవాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుంచుకుంటే మంచిది. ఈ అలవాటును వీలైనంత త్వరగా అలవరచుకుంటే చాలా మంచిది.

Updated Date - 2022-09-16T01:47:40+05:30 IST