Leena Manimekalai: ‘తగ్గేదే లే’ అంటున్న లీనా మణిమేఖలై.. ట్విట్టర్‌లో మరో ఫొటో షేర్ చేసిన దర్శకురాలు

ABN , First Publish Date - 2022-07-07T22:26:46+05:30 IST

‘కాళీ’ మాత సిగరెట్ కాల్చుతున్నట్టుగా పోస్టర్ విడుదల చేసి వివాదానికి తెర లేపిన దర్శకురాలు లీనా మణిమేఖలై ఈ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. హిందూ సంఘాలు భగ్గుమంటున్నా..

Leena Manimekalai: ‘తగ్గేదే లే’ అంటున్న లీనా మణిమేఖలై.. ట్విట్టర్‌లో మరో ఫొటో షేర్ చేసిన దర్శకురాలు

‘కాళీ’ మాత సిగరెట్ కాల్చుతున్నట్టుగా పోస్టర్ విడుదల చేసి వివాదానికి తెర లేపిన దర్శకురాలు లీనా మణిమేఖలై ఈ విషయంలో వెనక్కి తగ్గేలా కనిపించడం లేదు. హిందూ సంఘాలు భగ్గుమంటున్నా, పలు పోలీస్ స్టేషన్లలో ఆమెపై కేసులు నమోదవుతున్నా లీనా మాత్రం ‘తగ్గేదే లే’ అన్నట్టుగా తాజాగా మరో ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. శివపార్వతుల వేషధారణలో ఉన్న ఇద్దరు వ్యక్తులు పొగ తాగుతున్న ఫొటోలను లీనా పోస్ట్ చేసింది. ఆ ఫొటోను పోస్ట్ చేసి Elsewhere... అని ట్వీట్ చేసింది. ఇదిలా ఉంటే.. ఈ ఫొటో చూసిన కొందరు ఆమె వాదనకు బలం చేకూర్చుతూ ‘జర్నీ’ సినిమాలో సీన్‌ను పోస్ట్ చేస్తున్నారు. ‘జర్నీ’ సినిమాలో హనుమంతుడి వేషధారణలో ఉన్న ఒక వ్యక్తి సిగరెట్ తాగుతూ కనిపిస్తాడు. ఆ సీన్‌ను పోస్ట్ చేసి ఆమె పెట్టిన ఫొటోను, ఆమె వాదనను కొందరు బలపరుస్తుండటం గమనార్హం.



లీనా మణిమేఖలై పోస్ట్‌ చేసిన కాళీ మాత పోస్టర్‌ ట్వీట్‌ను.. ట్విటర్‌ భారత్‌లో కనపడకుండా చేసింది. స్వలింగ సంపర్కుల జెండా నేపథ్యంలో కాళీ మాత పాత్రలో లీనా ధూమపానం చేస్తున్నట్లుగా ఉన్న ఈ పోస్టర్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చిన లీగల్‌ డిమాండ్‌ మేరకు ఆ పోస్టును భారత్‌లో కనపడకుండా చేసినట్లుగా ట్విటర్‌ పేర్కొంది. మరోవైపు.. కెనడాలోని హిందూ సంఘాల నాయకుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో ఈ చిత్రానికి సంబంధించి రెచ్చగొట్టే విధంగా ఉన్న అన్ని రకాల సమాచారాన్నీ తొలగించాల్సిందిగా భారత హై కమిషన్‌ కెనడా అధికారులను కోరింది. దీంతో ఈ డాక్యుమెంటరీ ప్రదర్శనను నిలిపివేసినట్లు కెనాలోని ఆగాఖాన్‌ మ్యూజియం ప్రకటించింది. హిందువుల మనోభావాలను కించపరిచినందుకు తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

Updated Date - 2022-07-07T22:26:46+05:30 IST