పొలంలోనే వదిలేశారు

ABN , First Publish Date - 2021-05-11T05:44:25+05:30 IST

జిల్లాలో చిన్నమండెం, సంబేపల్లె, గాలివీడు మండలాల్లో అత్యధికంగా టమోటా సాగు చేస్తున్నారు.

పొలంలోనే వదిలేశారు
గాలివీడులో పొలంలోనే వదిలేసిన టమోటా

పతనమైన టమోటా ధరలు 

రైతుకు దక్కేది కిలో 35 పైసలు నుంచి 70పైసలు

మార్కెట్‌లో వినియోగదారుడికి విక్రయించేది రూ.10 

జొన్న ధరలూ పతనమై రైతుల ఆందోళన


రైతుల పరిస్థితి దారుణంగా మారింది. కరోనా వ్యాప్తితో రవాణా స్తంభించి పంట ఉత్పత్తుల ధరలు పతనమయ్యాయి. లాభాల సంగతి అటుంచితే పెట్టుబడి కూడా రావడం లేదు. పంట కోత కూలీలు కూడా గిట్టుబాటు కావడం లేదు. టమోటా రైతుల పరిస్థితి మరీ దారుణం. లక్షలు పెట్టుబడి పెడితే కిలో 35 పైసల నుంచి 70 పైసలు కూడా అందడం లేదు. దీంతో రైతులు పొలంలోనే వదిలేస్తున్నారు. రబీలో జొన్న సాగు చేసిన రైతులు ధర లేక పంట అమ్ముకోలేక కన్నీళ్లు పెడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేపట్టినా క్వింటా రూ.1850 మించి ఇవ్వడం లేదు.


(కడప, ఆంధ్రజ్యోతి): జిల్లాలో చిన్నమండెం, సంబేపల్లె, గాలివీడు మండలాల్లో అత్యధికంగా టమోటా సాగు చేస్తున్నారు. ఉద్యానవనశాఖ అధికారుల లెక్క ల ప్రకారం జిల్లాలో 24,724 హెక్టార్లలో టమోటా పంట సాగవుతోంది. ప్రస్తుతం రెండెకరాలు టమోటా సాగుకు రూ.3 లక్షల వరకు ఖర్చు వస్తోంది. హైబ్రిడ్‌ వెరైటీ టమోటాను అత్యధికంగా సాగుచేస్తున్నారు. ప్రస్తుతం టమోటా ధరలు పూర్తిగా పతనమయ్యాయి. రాయచోటి మార్కెట్‌లో నాణ్యతను బట్టి 28 కిలోల కిరీటి (బాక్సు) రూ.10 నుంచి రూ.50 మించి పలకడం లేదు. అంటే రైతుకు గిట్టుబాటు అయ్యేది కిలోకు 35 పైసల నుంచి 75 పైసలు మాత్రమే. అదే మదనపల్లె మార్కెట్‌లో కిరీటి రూ.20 నుంచి రూ.60 పలుకుతోంది. అంతదూరం పోవా లంటూ రవాణా ఖర్చులు అంతకు రెండితలు అవుతాయి. ధరలు లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మండల కేంద్ర మైన గాలివీడులో ఓ రైతు రెండెకరాల్లో టమోటా సాగు చేశారు. పంట చేతికొచ్చింది. కోతకోసి మార్కెట్‌కు తీసుకెళదామన్న సమయంలో ధరలు కుప్పకూలాయి. టమోటాను చూస్తే ఆపిల్‌లాగా నిగనిగలాడుతున్నాయి. అలాంటి పంటకు ధర లేక కనీ సం కోత కూలి కూడా గిట్టుబాటు కాక రైతు పొలంలోనే వదిలేశారు. పంటను చూసి కన్నీళ్లు పెడుతున్నారు. ప్రతి రైతుది ఇదే పరిస్థితి. రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు విన్నవిస్తున్నారు.


జొన్నకు మద్దతు ధర నిర్ణయించినా..

జొన్న రైతుల పరిస్థితీ ఇంతే. జిల్లాలో బద్వేల్‌, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాల్లో జొన్న అత్యధికంగా సాగు చేస్తున్నారు. రబీ సీజన్‌లో దాదాపు 35 వేల హెక్టార్లలో జొన్న సాగు చేశారు. ఒక ఎకరాకు సాగు పెట్టుబడి సరాసరి రూ.15వేల నుంచి రూ.20 వేలు వస్తుందని రైతులు తెలుపుతున్నారు. సాధారణ దిగుబడి 7 నుంచి 10 క్వింటాళ్లు వస్తుంది. గత ఏడాది మనుషులు తినేందుకు వినియోగించే మేలు రకం జొన్నలు క్వింటా రూ.3500 వరకు పలికాయి. పశువుల దాణా, పారిశ్రామిక అవసరాలకు వాడే జొన్నలు రూ.2 వేల నుంచి రూ.2500 వరకు అమ్ముడుపోయాయి. ఈ ఏడాది ధరలు పతనం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం మార్క్‌ఫెడ్‌ ద్వారా కొనుగోలుకు శ్రీకా రం చుట్టింది. మనుషులు ఆహారంగా వాడే మహేం ద్ర, రాయచూరి రకం గ్రేడ్‌-1 జొన్నలకు క్వింటా రూ.2,620, పశువుల దాణా, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే మహాలక్ష్మి, హైటెక్‌ 3205, శ్రీనిధి వంటి హైబ్రిడ్‌ రకం జొన్న క్వింటా రూ.1850 మద్దతు ధర నిర్ణయించారు. అయితే మేలు రకం జొన్నలను రూ.2650 కొనుగోలు చేయడం లేదు. ఇదేమిటంటే ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు లేవని, కేవలం పశువుల దాణా, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే జొన్నలు క్వింటా రూ.1,850 చొప్పున కొనుగోలు చేయమని ప్రభుత్వ ఉత్తర్వులు ఉన్నాయని మార్క్‌ఫెడ్‌ అధికారులు అంటున్నారు. ఆ రేటుకు విక్రయిస్తే కనీ సం పెట్టుబడి కూడా రాదు. ప్రైవేటు మార్కెట్‌లో అమ్ముదామంటే ధర లేదు. గోదాములో నిల్వ చేస్తే పురుగు పట్టి అసలుకే మోసం వస్తుందని రైతులు అంటున్నారు. దీంతో పెట్టుబడిలో సగం కూడా వచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. ప్రభుత్వం స్పందించి క్వింటా రూ.2,620 లెక్కన కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు.


రూ.2,650కు ప్రభుత్వం కొనుగోలు చేయాలి


నేను, మా పెద్దనాన్న ఇద్దరం 20 ఎకరాల్లో జొన్న సాగు చేశాం. ఎకరాకు రూ.15 వేల వరకు పెట్టుబడి పెట్టాం. ప్రస్తుతం ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. అమ్ముదామంటే మార్కెట్‌లో ధర లేదు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రానికి వెళితే రూ.1,850కి మించి కొనుగోలు చేయమంటున్నారు. మేలురకం జొన్నలు మద్దతు ధర రూ.2,620 ప్రభుత్వమే నిర్ణయించింది. ఆ ధరకు కొనుగోలు చేయకుండా అన్ని రకాల జొన్నలు క్వింటా రూ.1,850కి కొనుగోలు చేస్తామనడం ఎంతవరకు న్యాయం. రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం అన్యాయం చేస్తోంది. జొన్నలు క్వింటా రూ.2,650కి కొనుగోలు చేయాలి. 

- శ్రీనివాసరెడ్డి, జొన్నరైతు, కామసముద్రం, 

అట్లూరు మండలం

Updated Date - 2021-05-11T05:44:25+05:30 IST