కల సాకారమవ్వాలంటే...!

ABN , First Publish Date - 2020-02-19T05:59:06+05:30 IST

రెండేళ్ల క్రితం సోషియాలజీలో పీజీ పూర్తి చేశాను. మాది కాస్త సంపన్న కుటుంబం కావడం వల్ల బతుకుదెరువు కోసం ఉద్యోగం చేయాల్సినంత అవసరమైతే లేదు. అయితే సమాజానికి ఏదైనా చేయనాలనేది నా ఆలోచన. వాస్తవానికి ఐదేళ్ల క్రితమే ఒక ఎన్జీవో ...

కల సాకారమవ్వాలంటే...!

రెండేళ్ల క్రితం సోషియాలజీలో పీజీ పూర్తి చేశాను. మాది కాస్త సంపన్న కుటుంబం కావడం వల్ల బతుకుదెరువు కోసం ఉద్యోగం చేయాల్సినంత అవసరమైతే లేదు. అయితే సమాజానికి ఏదైనా చేయనాలనేది నా ఆలోచన. వాస్తవానికి ఐదేళ్ల క్రితమే ఒక ఎన్జీవో స్థాపించాలనే ఆలోచన వచ్చింది. దాని ద్వారా రాష్ట్రంలోని ఊరూరూ తిరుగుతూ... ఆరోగ్యం, ప్రకృతి వ్యవసాయం తదితర అంశాలపైన  రైతులకు అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలనేది నా కోరిక. ఇదే విషయమై వివరాల కోసం కొందరిని సంప్రదించాను. అయితే వాళ్లంతా నన్ను నిరుత్సాహపరిచారు. ఒకప్పటిలా విదేశాల నుంచి  ఫండ్స్‌ ఏమీ రావడం లేదని, ప్రజలు కూడా ఎన్జీవో సంస్థలను పాజిటివ్‌గా చూడటం లేదని చెబుతున్నారు. అటవీ ప్రాంతాల్లోకి అంటే గిరిజనుల దాకా వెళితే... ఇతర సమస్యలు చుట్టుకుంటాయంటూ భయపెడుతున్నారు. వాళ్ల మాటల్లో నిజమెంతో తెలియదు. ఈ పరిస్థితుల్లో నేను ఎన్జీవో నడిపే మార్గాలు లేవా? నా కల సాకారమవ్వాలంటే ఏం చేయాలి? 

         - పి.రజిత, ములుగు



మీది సంపన్న కుటుంబం కాబట్టి జీవితాన్ని ఏదో సరదాగా గడిపేద్దాం అనుకోకుండా, సమాజానికి ఏదైనా చేయాలని ఆలోచించడం అభినందనీయం. కాకపోతే ఎన్జీవోల పరిస్థితి ప్రస్తుతం అంత బాగా ఏమీ లేదు. అరుదుగా తప్ప వాటికి మునుపటిలా ఫండ్స్‌ అందడం లేదు. అందువల్ల ఎవరికి వారు తమదైన ఆదాయపు వనరుతో ఆ దిశగా అడుగులు వేయాలే తప్ప, ఇతరుల సహకారం మీదో ఆధారపడటం అర్థం లేనిది. ఆదాయ వనరుల కోసం, తమవైన కొన్ని వ్యాపార వ్యవస్థలను నిర్మించుకుని వాటితో వచ్చే లాభాలతో నడపాలనుకుంటే ఫరవాలేదు. అలాకాకుండా సంకల్ప బలమే సమస్తం అనుకుని ఎన్జీవోను ప్రారంభిస్తే ఒరిగేదేమీ ఉండదు. ముందూ వెనకా చూడకుండా అలా ప్రారంభించినా, కొంతకాలనికే మూతపడే అవకాశాలే ఎక్కువ. పైగా ఎన్జీవో అంటే ఏకవ్యక్తి వ్యవహారం కాదు కదా! అదొక టీమ్‌ వర్క్‌. బృందంలోని సభ్యులంతా జీవనోపాధి కోసం ఎన్జీవో పైనే ఆధారపడటంలో అర్థం లేదు. అందువల్ల సభ్యులంతా స్వయం పోషక ఆధారాన్ని కలిగి ఉండాలి. 

ఎన్జీవోను స్థాపించడానికి ముందే సభ్యులంతా పలుదఫాలుగా సమాలోచనలు చేయాలి. ఆదాయ వనరుకు ఉపయోగపడే ఒక స్పష్టమైన మార్గాన్ని రూపొందించుకోవాలి. అలా వచ్చే ఆదాయంతో మీరు అనుకుంటున్న అవగాహన కార్యక్రమాలు నిర్వహించవచ్చు. అయితే ప్రారంభంలో చిన్న పనులతో మొదలెట్టాలి. అనుభవం పెరిగి, ఆదాయపు వనరులు పెరిగే క్రమంలో విస్తరించొచ్చు. ఆల్‌ ది బెస్ట్‌.  

-డాక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ చింతపంటి

కన్సల్టెంట్‌ సైకియాట్రిస్ట్‌, హైదరాబాద్‌ 


Updated Date - 2020-02-19T05:59:06+05:30 IST