మన్యంలో ‘మండలి’ కమిటీ పర్యటన

ABN , First Publish Date - 2021-01-22T05:42:49+05:30 IST

అరకులోయ వచ్చిన శాసన మండలి పేపర్‌ లెయిడ్‌ కమిటీ గురువారం పెదలబుడు, ఎండపల్లివలస పంచాయతీల్లో పర్యటించింది.

మన్యంలో ‘మండలి’ కమిటీ పర్యటన
అరకులోయ: గిరిజన గ్రామదర్శినిలో ఊయల ఊగుతున్న మండల కమిటీ చైర్మన్‌ రాజేంద్రప్రసాద్‌


‘గిరిజన గ్రామదర్శిని’, విద్యాలయాల సందర్శన

పలు సమస్యలపై వినతిపత్రాలు అందజేసిన టీడీపీ, గిరిజన, ఉపాధ్యాయ సంఘాలు


అరకులోయ టౌన్‌/ రూరల్‌ జనవరి 21: అరకులోయ వచ్చిన శాసన మండలి పేపర్‌ లెయిడ్‌ కమిటీ గురువారం పెదలబుడు, ఎండపల్లివలస పంచాయతీల్లో పర్యటించింది. ఏపీటీడీసీ అతిథిగృహంలో బస చేసిన కమిటీ చైర్మన్‌ వై.వి.బాబూరాజేంద్రప్రసాద్‌, సభ్యులు చిక్కాల రామచంద్రరావు, ఐ.వెంకటేశ్వరరావులను తెలుగుదేశం, గిరిజన సంఘం, ఉపాధ్యాయ సంఘం నాయకులు కలిసి, వివిధ సమస్యలపై వినతిపత్రాలు అందజేశారు. పెదలబుడు పంచాయతీ గంజాయిగుడ సమీపంలో ‘గిరిజన గ్రామదర్శిని’ని శాసన మండలి కమిటీ సందర్శించింది. గిరిజన జీవనశైలిని, ఆచార వ్యవహారాలు, సంప్రదాయాల గురించి తెలుసుకున్నారు. ఇక్కడ ఉన్న ఊయలో కూర్చుని కొద్దిసేపు ఊగారు. అనంతరం యండపల్లివలస కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని, అరకులోయలో టీడబ్ల్యూ పాఠశాలను సందర్శించి బాలికలతో మాట్లాడారు. 



‘మండలి’ కమిటీకి వినతులు

ఏజెన్సీలో ఉద్యోగాలకు సంబంధించి జీవో నంబర్‌-3 పునరుద్ధరణ, బెస్ట్‌ అవైలబుల్‌ స్కూల్స్‌ పథకం కొనసాగింపు, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలపై శాసన మండలి కమిటీకి తెలుగుదేశం నాయకులు సివేరి అబ్రహం, బొర్రా నాగరాజు, నాగేశ్వరరావు, సుబ్బారావు, షేక్‌ అబ్దుల్‌ రహమాన్‌ వినతిపత్రాలు అందజేశారు. కాగా గిరిజన సంఘం నాయకులు కె.సుర్రేంద, రామారావు, రామన్న, ఉమామహేశ్వరరావు తదితరులు... కొల్లాపుట్టు పంచాయతీలో ఒడిశాతో సరిహద్దు వివాదం, జాతీయ రహదారి డిజైన్‌ మార్పు, తదితర అంశాల గురించి వివరించి వినతిపత్రం ఇచ్చారు. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, టీడబ్ల్యూలో బదిలీలపై యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి వి.మహేశ్వరావు, జిల్లా కార్యదర్శి కిల్లో రఘునాథ్‌, నాయకులు ఎస్‌.నారాయణ, టి.చిట్టిబాబు, తదితరులు వినతిపత్రాన్ని అందజేశారు. కమిటీ వెంట గిరిజన సంక్షేమ శాఖ ఉప కార్యదర్శి ఎం.విజయరాజు, డిప్యూటీ డైరెక్టర్‌ టి.విజయకుమార్‌, స్థానిక అధికారులు వున్నారు.


శాసన మండలి కమిటీకి వినతులు వెల్లువ

అనంతగిరి: శాసన మండలి గురువారం మధ్యాహ్నం మండలంలో పర్యటించింది. ఉద్యోగ, ఉపాధ్యాయ, గిరిజన, ప్రజాసంఘాల నాయకులు పలు సమస్యలపై కమిటీ చైర్మన్‌ బాబూరాజేంద్రప్రసాద్‌కు వినతిప్రతాలు అందజేశారు. భాషా పండితుల పోస్టులను అప్‌గ్రేడ్‌ చేయాలని, గిరిజన ప్రాంతంలో బీఈడీ, డీఈడీ కళాశాలలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. .వినతిపత్రాలు అందజేసిన వారిలో ఎల్‌బీవెంకటరావు, మండి నాగేశ్వరరావు, భాస్కరరావు, పడాల్‌, రఘురాజుకుమార్‌, రామచందర్‌, మల్లేశ్వరరావు, గంగరాజు, మోసియా, నాగులు, శెట్టి రాంబాబు వున్నారు.


Updated Date - 2021-01-22T05:42:49+05:30 IST