దొంగలు బాబోయ్ దొంగలు.. 60 కిలోల లెమన్ చోరీ

ABN , First Publish Date - 2022-04-13T03:48:02+05:30 IST

లక్నో: కాదేదీ దొంగలకు, దొంగతనానికి అనర్హం. చిల్లర దొంగలకు ప్రతి వస్తువూ విలువైనదే. అందులోనూ బాగా గిరాకీ ఉంటే వస్తువులు కంటబడితే ఇక చేతులు ఊరుకుంటాయా?.

దొంగలు బాబోయ్ దొంగలు.. 60 కిలోల లెమన్ చోరీ

లక్నో: కాదేదీ దొంగలకు, దొంగతనానికి అనర్హం. చిల్లర దొంగలకు ప్రతి వస్తువూ విలువైనదే. అందులోనూ బాగా గిరాకీ ఉంటే వస్తువులు కంటబడితే ఇక చేతులు ఊరుకుంటాయా?. అవి పళ్లు అయినా, కాయగూరలైనా, చివరకు ఆకుకూరలైనా 'హస్త'గతం చేసుకుంటే కానీ నిద్రపట్టదు. ఎండలు మండుతుండటంతో మార్కెట్‌లో కూరగాయలతో పాటు నిమ్మకాయల ధరలు ఒక్కసారిగా కొండెక్కి కూర్చున్నాయి. దీంతో దొంగలు చేతివాటం చూపిస్తున్నారు. తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని షహరాన్‌పూర్‌లో ఒక గోదాములో 'ఖరీదైన' దొంగతనమే జరిగింది. 60 కిలోల నిమ్మపండ్లను దొంగలు ఎత్తుకుపోయారు. బాగా రేటు పలుకుతున్న మరికొన్ని కాయగూరలను కూడా సంచుల్లో సద్దేసుకుని ఉడాయించారు. దీంతో ఆ గోదాములో సరుకు ఉంచిన విజిటబుల్ ట్రేడర్ మనోజ్ కశ్యప్ లబోదిబోమన్నాడు. 60 కిలోల నిమ్మకాయలు, 40 కిలోల ఉల్లిగడ్డ, 38 కిలోల వెల్లుల్లి తన గోదాము నుంచి దొంగలు ఎత్తుకెళ్లారంటూ వాపోయాడు.


ఆదివారం ఉదయం కూరగాయల మార్కెట్లోని తన గోదాముకు వెళ్లగానే, తాళం విరగ్గొటి కనిపించిందని, కూరగాయలన్నీ రోడ్లపైకి చెల్లాచెదురుగా పడున్నాయని మనోజ్ కశ్యప్ చెప్పాడు. సమాచారం తెలియగానే పక్క దుకాణాల్లోని వర్తకులు కూడా అక్కడకు చేరుకుని అతన్ని ఓదార్చారు. దొంగలెవరో కనిపెట్టి సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసు అధికారులు తెలిపారు.


కాగా, ఇటీవల కాలంలో దేశంలోని చాలా ప్రాంతాల్లో నిమ్మకాయల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. లక్నోలో కేజీ నిమ్మకాయల ధర రూ.325 పలుకుతోంది. చిల్లర ధర రూ.13 వరకూ ఉంది. ఇతర పండ్ల ధరలతో పోలిస్తే ఇది ఎక్కువే. నిమ్మకాయల ధరలు ఆకాశాన్ని అంటుతుండటంతో రోడ్లపై నుండే దాబాలలోనూ వీటిని కస్టమర్లకు సరఫరా చేయడం నిలిపేశారు. లగ్జరీ రెస్టారెంట్లలోనూ ఇదే పరిస్థితి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం, నిమ్మకాయల సాగు తగ్గడం కూడా ధరల పెరుగుదలకు కారణమని, చిన్న హోటళ్ల అయితే లెమెన్ వాడకం పూర్తిగా నిలిపేశారని హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ అధ్యక్షుడు గిరీష్ ఒబెరాయ్ తెలిపారు.

Updated Date - 2022-04-13T03:48:02+05:30 IST