జింకలు, దుప్పులపై చిరుత పులుల దాడి

ABN , First Publish Date - 2022-07-02T06:35:35+05:30 IST

ఎస్వీ జూపార్కులోని మూగ జీవాలపై చిరుత పులులు పంజా విసురుతున్నాయి.

జింకలు, దుప్పులపై చిరుత పులుల దాడి

ఎస్వీ జూపార్కులోని ఎన్‌క్లోజర్‌ సిబ్బందిలో ఒకరికి కూడా తీవ్రగాయాలు


ఎస్వీ జూపార్కులోని మూగ జీవాలపై చిరుత పులులు పంజా విసురుతున్నాయి. అడ్డుకోవడానికి ప్రయత్నించిన ఎన్‌క్లోజర్‌ సిబ్బంది ఒకరిపై కూడా దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటనలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. వన్యప్రాణులను కాపాడడానికి ఏర్పాటు చేసిన జూ పార్కులోనూ వాటికి రక్షణ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. 


తిరుపతి అర్బన్‌, జూలై 1: ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన ఎస్వీ జూ పార్కు దాదాపు 1,254 హెక్టార్లలో విస్తరించి ఉంది. వివిధ రకాల జంతువుల కోసం 37 ఎన్‌క్లోజర్లను 289 హెక్టార్లలో ఏర్పాటు చేశారు. దీనికి క్యూరేటర్‌ పర్యవేక్షణలో ఓ రేంజ్‌ ఆఫీసర్‌, 170 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. పార్కుకు రెండు వైపులా ఏడు అడుగుల ఎత్తుతో సిమెంట్‌ గోడను నిర్మించారు. ఓవైపు ప్రవేశ ద్వారం ఉంటే.. ఇంకోవైపు  మాత్రం ఎలాంటి రక్షణ గోడ నిర్మించకుండా వదిలేశారు. శేషాచల కొండలకు ఆనుకుని ఉన్న ఈ అటవీ మార్గమే ఇప్పుడు ఎన్‌క్లోజర్స్‌లోని జంతువులకు మృత్యుమార్గంగా మారుతోంది. చిరుతపులులు ఈ దారినే రహదారిగా మార్చుకున్నాయి. పట్టపగలే వచ్చి ఎన్‌క్లోజర్‌లోని జంతువులపై దాడి చేస్తున్నాయి. ప్రధానంగా డీర్‌ సఫారీలోని కృష్ణ జింకలు, చుక్కల దుప్పులపైనే ఎక్కువగా దాడి చేస్తున్నాయి. డీర్‌ సఫారీ చుట్టూ దాదాపు 12 అడుగుల ఇనుప కంచె ఉంది. అయినా దాటేసి లోపలికి వచ్చేస్తున్నాయి. చిరుత పులుల పంజాకు రెండు, మూడు రోజులకు ఒకసారి ఒకటి, రెండు కృష్ణ జింకలు లేదా చుక్కల దుప్పులు బలై పోతున్నాయి.కళేబరాలను ఆలస్యంగా గుర్తిస్తున్న సిబ్బంది వాటిని రహస్యంగా ఖననం చేసేస్తున్నారు. గత నెల 24వ తేదీ ఉదయం దాదాపు 9.45 గంటల ప్రాంతంలో జూపార్కులోకి ఐదు చిరుత పులులు ప్రవేశించాయి. వీటిల్లో ఒకటి జూపార్కు సిబ్బందిలో ఒకరైన ఎ.శ్రీనివాస్‌ అనే వ్యక్తిపై దాడి చేసింది. పార్కులోకి ప్రవేశించిన చిరుత పులులను తరిమేందుకు దాదాపు 20 మంది సిబ్బంది అటవీ మార్గంలోకి ప్రవేశించారు. గుంపుగా కాకుండా ముగ్గురు, నలుగురుగా విడిపోయి పులులను తరిమేందుకు ప్రయత్నించారు. ఓ చిరుత పులి మాత్రం పొదలో నక్కి ఉండి.. అటుగా వచ్చిన ఎ.శ్రీనివా్‌సపై దాడి చేసింది. అతని కాలు తొడను నోటితో పట్టుకుంది. శ్రీనివాస్‌ వేసుకున్న ప్యాంటు లూజుగా ఉండటంతో పులి నోటికి చిక్కి అది పూర్తిగా చిరిగిపోయింది.అతడికి తొడపైనా, కాళ్లకూ గాయాలయ్యాయి. గమనించిన ఇతర సిబ్బంది కర్రలతో పులిని కొట్టడంతో అది శ్రీనివా్‌సను వదిలి అడవిలోకి పరుగులు తీసింది. గాయపడ్డ శ్రీనివా్‌సకు జూపార్కులోనే తాత్కాలికంగా వైద్యం ఇచ్చి పంపేశారు. ఆ తర్వాత ఆయన తనకు తెలిసిన వైద్యుల వద్ద ఇప్పటికీ చికిత్స తీసుకుంటున్నాడు. దీంతో జూ పార్కు సిబ్బంది ఇప్పుడు ఒంటరిగా ఉండాలంటే భయపడి పోతున్నారు.  చిరుతపులుల దాడి గురించి ఎస్వీ జూ పార్కు క్యూరేటర్‌ను వివరణ కోరితే.. అలాంటి సంఘటనలేవీ జరగలేదని చెప్పారు. 


రెస్క్యూ టీం ఎక్కడ?

జూపార్కులో ఉన్న వన్యప్రాణుల పరిరక్షణకు అత్యవసర సమయాల్లో రెస్క్యూ టీమ్‌ ఉండాలి. కానీ ఇక్కడ అది కనిపించడంలేదు. ఎన్‌క్లోజర్స్‌ సిబ్బందే రెస్క్యూ టీమ్‌గా పరిగణించబడుతున్నారు. అంతేకాదు అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు అవసరమైన పరికరాలు లేవని సమాచారం. ఇప్పటికైనా జూపార్కు అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


సందర్శకులపై దాడి చేస్తే..

కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే జూపార్కుకు సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. అటవీ ప్రాంతం నుంచి పార్కులోకి వస్తున్న చిరుతలు సఫారీల సందర్శనకు వచ్చే వారిపై దాడిచేసే ప్రమాదమూ ఉంది. పెద్దలపైన పులులు దాడి చేయడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కానీ చిన్న పిల్లలపై మాత్రం దాడికి అవకాశాలు ఎక్కువ. తిరుమల ఘాట్‌లో వెళుతున్న భక్తుల్లో చిన్నపిల్లలపై చిరుత పులులు దాడి చేసిన సంఘటనలు ఉన్నాయి. ఈ విషయంలో సందర్శకులకు కూడా సరైన అవగాహన కల్పించాల్సి ఉంది.  

Updated Date - 2022-07-02T06:35:35+05:30 IST