తండ్రి కళ్ల ముందే కూతురిని చంపిన చిరుత

ABN , First Publish Date - 2021-10-17T22:04:23+05:30 IST

మధ్యప్రదేశ్‌లోని శివనీ జిల్లాలో పశువుల మేత కోసం అడవుల్లోకి వెళ్లిన తండ్రీకూతుళ్లపై..

తండ్రి కళ్ల ముందే కూతురిని చంపిన చిరుత

శివనీ: మధ్యప్రదేశ్‌లోని శివనీ జిల్లాలో పశువుల మేత కోసం అడవుల్లోకి వెళ్లిన తండ్రీకూతుళ్లపై ఒక చిరుత దాడి చేసింది. తండ్రి కళ్ల ముందే కూతురుని చిరుతపులి పొట్టన పెట్టుకుంది. పాండివాడ గ్రామం సమీపంలోని కన్వివాడ అటవీ ప్రాంతంలో శనివారం ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్టు ఫారెస్ట్ రేంజర్ యోగేష్ పటేల్ తెలిపారు. సంఘటన వివరాల ప్రకారం, 16 ఏళ్ల బాలిక రవీనా యాదవ్, ఆమె తండ్రి పశువుల మేత కోసం అటవీ ప్రాంతానికి వెళ్లారు. పొదల్లో పొంచి ఉన్న చిరుత వెనుక వైపు నుంచి బాలిక వైపు దూకి మెడ పట్టుకుంది. తన కుమార్తెను కాపాడేందుకు కర్రలతో తండ్రి తిరగబడినప్పటికీ అతనిపై కూడా చిరుత దాడి చేసింది. చుట్టుపక్కల జనం ఆ అలికిడికి అక్కడకు చేరుకోవడంతో బాలిక మృతదేహాన్ని విడిచిపెట్టి చిరుత పరారైంది.


కాగా, మృతురాలి కుటుంబానికి రూ.10,000 తక్షణ సాయం అందించినట్టు యోగేష్ పటేల్ తెలిపారు. రూ.4 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ఆ కుటుంబానికి ఇవ్వనున్నారు. చిరుతపులిని పట్టుకునేందుకు అడవిలో బోను ఏర్పాటు చేసినట్టు అటవీ అధికారులు తెలిపారు. ఇదే తరహా ఘటన గత సెప్టెంబర్ 15న కూడా చోటుచేసుకుంది. శివనీ జిల్లా కియోలరి బ్లాక్ పరిధిలోని మొహగావ్ గ్రామం సమీపంలో 50 ఏళ్ల మహిళపై చిరుతపులి దాడి చేసి చంపింది.

Updated Date - 2021-10-17T22:04:23+05:30 IST