బీ.వెల్లెంలలో చిరుత కలకలం

ABN , First Publish Date - 2021-02-27T05:58:05+05:30 IST

మండలంలోని బీ.వెల్లెంల గ్రామంలో చిరుత సంచరిస్తోందని శుక్రవారం కలకలం రేగింది.

బీ.వెల్లెంలలో చిరుత కలకలం
జంతువు పాదముద్రలను పరిశీలిస్తున్న అటవీ సిబ్బంది

 గ్రామ శివారులో చూశానని రైతు వెల్లడి
 పాదముద్రలను పరిశీలించిన అటవీ సిబ్బంది
 ట్రాపింగ్‌ కెమెరాల ఏర్పాటు చేసిన అధికారులు

నార్కట్‌పల్లి, ఫిబ్రవరి 26: మండలంలోని బీ.వెల్లెంల గ్రామంలో చిరుత సంచరిస్తోందని శుక్రవారం కలకలం రేగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రైతు గుత్తా వెంకట్‌రెడ్డి తన వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా సమీపంలోని ఓ కుంటలో గు బురుగా ఉన్న పొదల నుంచి చిరుతను పోలిన జంతువు బయటికి పరుగెత్తింది. చిరుతపులిగా భావించి భయపడిన రైతు ఈ విషయాన్ని ఫోన్‌ ద్వారా గ్రామస్థులకు తెలిపాడు. దీంతో గ్రామస్థులు అటవీశాఖ అధికారులతో పాటు డయల్‌ 100కు సమాచారం అందించారు. ఫారెస్ట్‌ డిప్యూటీ రేంజ్‌ ఆఫీసర్‌ శ్రీను, నార్కట్‌పల్లి, కట్టంగూరు, చిట్యాల ఎఫ్‌బీవోలు నర్మద, రజిత, నర్సింహలు బి.వెల్లెంలకు చేరుకుని జంతువు సంచరించిన ప్రదేశంలో పాదముద్రలను పరిశీలించారు. రెండున్నర ఫీట్ల పొడవుతో జంతువు ఉందని రైతు చెప్పిన ఆనవాళ్లను బట్టి  పాదముద్రలను పరిశీలిస్తే అది చిరుత పులేనని నిర్ధారించలేమని ఎఫ్‌బీవో నర్మద తెలిపారు. అనుమానిత ప్రదేశాల వద్ద ట్రాపింగ్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు. అయితే ఈనెల 25వ తేదీ సాయంత్రమే ఈ జంతువును చూశానని గ్రామానికి చెందిన ఓ గీతకార్మికుడు చెప్పినా తాము నమ్మలేదని గ్రామస్థులు తెలిపారు.

Updated Date - 2021-02-27T05:58:05+05:30 IST