పాఠ్యపుస్తకాల్లో తప్పులు సరిదిద్దండి

ABN , First Publish Date - 2022-06-01T17:19:15+05:30 IST

పాఠ్యపుస్తకాల్లో తప్పులను సరిదిద్దాలని ప్రత్యేకించి లింగాయత ధర్మంపై తప్పుడు అభిప్రాయాలు తలెత్తేలా పాఠ్యాంశాలు ఉన్నాయని పలువురు మఠాధిపతులు ఆక్రోశం వ్యక్తం

పాఠ్యపుస్తకాల్లో తప్పులు సరిదిద్దండి

                   - Cmకు మఠాధిపతుల లేఖ 


బెంగళూరు: పాఠ్యపుస్తకాల్లో తప్పులను సరిదిద్దాలని ప్రత్యేకించి లింగాయత ధర్మంపై తప్పుడు అభిప్రాయాలు తలెత్తేలా పాఠ్యాంశాలు ఉన్నాయని పలువురు మఠాధిపతులు ఆక్రోశం వ్యక్తం చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైకు లేఖ రాశారు. సాణేహళ్ళి తరళబాళు మఠాధిపతి పండితారాధ్య శివాచార్య ఈ విషయాన్ని మంగళవారం మీడియాకు తెలిపారు. 9వ తరగతి సోషియల్‌ సైన్స్‌ పుస్తకంలో బసవణ్ణ ప్రతిపాదించిన సిద్ధాంతాలను ఇష్టం వచ్చినట్టు ముద్రించారన్నారు. పాఠ్యపుస్తకాల పరిశీలనా కమిటీ ఇలాంటి తప్పుల విషయంలో సీరియ్‌సగా ఉండాలన్నారు. ఇప్పటికే పాఠశాలలు ప్రారంభమై పక్షం రోజులు గడిచాయని ఇంతవరకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం విద్యార్థులకు ఇంకా అందలేదని లేఖలో స్వామీజీ ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. పసిమనస్సులను కల్మషం చేసేలా, వాస్తవాలను దాచేలా పాఠ్యపుస్తకాలు ఉండరాదన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో స్పందిస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మరోవైపు పాఠ్యపుస్తకాల పరిశీలనా కమిటీ చైర్మన్‌గా ఉన్న రోహిత్‌ చక్రతీర్థను తక్షణం తొలగించాలని కోరుతూ కర్ణాటక రక్షణా వేదిక కార్యకర్తలు ఫ్రీడంపార్కులో మంగళవారం భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. వేదిక అధ్యక్షుడు టీఏ నారాయణగౌడ మాట్లాడుతూ జాతీయ కవి కువెంపు రచించిన నాడగీతను, రాష్ట్రధ్వజాన్ని అవమానించేలా వ్యవహరించిన చక్రతీర్థను ఈ పదవిలో నియమించడమే ఘోరమైన తప్పిదమన్నారు. తన రాజకీయ పబ్బాన్ని గడుపుకొనేందుకు ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడడం సరికాదని, పాఠ్యపుస్తకాల రూపకల్పన సమయంలో అన్ని మతాలు, కులాల ప్రజలను విశ్వాసంలోకి తీసుకోవాలన్నారు. కాగా జాతీయకవి కువెంపుపై అవహేళనకరమైన పోస్టింగ్‌లకు సంబంధించి సైబర్‌ క్రైం చట్టాలకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని ఆదిచుంచనగిరి మఠం ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈమేరకు మఠాధిపతి డాక్టర్‌ నిర్మలానందనాథస్వామిజీతో అత్యవసరంగా మంత్రి బీసీ నాగేశ్‌ సమావేశమయ్యారు. కువెంపును అవహేళన చేసేవారిని వదిలిపెట్టే ప్రశ్నే లేదని స్వామీజీకి మంత్రి నాగేశ్‌ వివరించారు.

Updated Date - 2022-06-01T17:19:15+05:30 IST