గుణపాఠం

ABN , First Publish Date - 2021-07-18T05:41:48+05:30 IST

విజయనగర సామాజ్య్రం లో తాతాచార్యులు అని రాజగురువు ఉండేవాడు. ఆయన కొందరి ముఖం చూడటం ఇష్టం లేక తన ముఖం చుట్టూ తువ్వాలును చుట్టుకుని తిరిగేవాడు.

గుణపాఠం

విజయనగర సామాజ్య్రం లో తాతాచార్యులు అని రాజగురువు ఉండేవాడు. ఆయన కొందరి ముఖం చూడటం ఇష్టం లేక తన ముఖం చుట్టూ తువ్వాలును చుట్టుకుని తిరిగేవాడు. అతని ప్రవర్తన చాలా మందికి నచ్చేది కాదు. కానీ అతనిపై ఫిర్యాదు చేసే ధైర్యం ఎవరికీ లేదు. ఒకరోజు అందరూ కలిసి తెనాలి రామకృష్ణను కలిసి పరిస్థితిని వివరించారు. ఎలాగైనా మీరే ఒక పరిష్కారాన్ని చూపించండి అని అడిగారు. ‘‘తాతాచార్యుల ప్రవర్తన గురించి నాక్కూడా తెలిసింది. ఈ సమస్యను నేను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను’’ అని వారికి చెప్పి పంపించాడు. మరుసటి రోజు శ్రీకృష్ణదేవరాయలు తెనాలి రామకృష్ణతో ప్రజలు చెప్పిన విషయమే చెప్పాడు. తాతాచార్యులు పండితులు కాబట్టి సమస్యను తెలివిగా పరిష్కరించమని సూచించాడు. అందుకు సరే అన్న తెనాలి రామకృష్ణ మరుసటి రోజు తాతాచార్యుల ఇంటికి వెళ్లాడు. 


రామకృష్ణ గేటును సమీపిస్తున్న సమయంలోనే తాతాచార్యులు ముఖంను పూర్తిగా కప్పుకుని ఇంటి నుంచి బయటకు వస్తున్నారు. ‘‘గురువు గారికి నమస్కారం. నేను తెనాలి రామకృష్ణను. ఎందుకలా ముఖాన్ని కప్పుకుంటున్నారు?’’ అని అడిగాడు. ఆ మాటలు విన్న తాతాచార్యులు ‘‘నువ్వా రామకృష్ణా! అడిగావు కాబట్టి నీకు ఒక రహస్యం చెబుతాను’’ అన్నాడు. ‘‘ఏంటది?’’ అని కుతూహులంగా అడిగాడు రామకృష్ణ. ఆ వర్గానికి చెందిన ప్రజలు పాపులు. ఒకవేళ వాళ్ల ముఖం చూస్తే వచ్చే జన్మలో గాడిదలా పుడతారు. అందుకే వాళ్లను చూడకుండా ఉండటం కోసం ముఖాన్ని కప్పుకుంటున్నాను’’ అన్నాడు తాతాచార్యులు. ఆ తరువాత రామకృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొన్నిరోజుల తరువాత శ్రీకృష్ణదేవరాయలు పరివారగణంతో తోటకు వచ్చాడు. వెంట తెనాలి, తాతాచార్యులు ఉన్నారు. అక్కడ కొన్ని గాడిదలు అరుస్తుండటాన్ని తెనాలి రామకృష్ణ గమనించాడు. రాజగురువుకు గుణపాఠం నేర్పడానికి ఇదే తగిన సమయం అనుకున్నాడు. వెంటనే గాడిదల ముందుకెళ్లి సెల్యూట్‌ చేయడం మొదలుపెట్టాడు. అది చూసిన మహారాజు ఎందుకలా చేస్తున్నావు? అని అడిగాడు. 


‘‘హారాజా! ఇవి మామూలు గాడిదలు కావు. గురువు తాతాచార్యుల కుటుంబం ఇది. ఈ గాడిద తాతాచార్యుల సోదరుడు. ఇది వాళ్ల తాత’’ అని అన్నాడు రామకృష్ణ. ఆ మాటలు విన్న తాతాచార్యులు కోపంతో ‘‘రామా నీకు ఎంత ధైర్యం ఉంటే మా కుటుంబసభ్యులను గాడిదలంటావు. ఇది క్షమించరాని నేరం’’ అన్నాడు. అప్పుడు రామకృష్ణ ‘‘క్షమించండి గురువు గారు. మిమ్మల్ని అవమానించడం నా ఉద్దేశం కాదు. ఒకరోజు మీ ఇంటికి వచ్చినప్పుడు మీరే చెప్పారు. వాళ్ల ముఖాలను చూస్తే వచ్చే జన్మలో గాడిదలుగా పుడతారని. ఈ గాడిదల్లో మీ కుటుంబసభ్యులు ఉండే అవకాశం ఉంది కదా! అందుకే అన్నాను’’ అని వివరణ ఇచ్చుకున్నాడు. అది విన్న మహారాజు ‘‘ఏంటి? నిజమా? మీరు అలా అన్నారా?’’ అని అడిగాడు. దాంతో తలదించుకుని ‘‘అవును’’ అని సమాధానం ఇచ్చాడు తాతాచార్యులు. ‘‘నా రాజ్యంలో ప్రజలందరూ సమానమే. ఎవరిపట్ల తేడా చూపించినా నేను సహించను’’ అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు. జరిగిన దానికి క్షమించమని కోరాడు తాతాచార్యులు. 

Updated Date - 2021-07-18T05:41:48+05:30 IST