Chiru, Pawan విఫలం కాకూడదు.. కాపులమంతా కలిసి నడుద్దాం!

ABN , First Publish Date - 2021-12-31T07:43:38+05:30 IST

అధికార సాధనే లక్ష్యంగా అడుగులు వేయాలని.. దీనికోసం కలిసికట్టుగా నడవాలని కాపు నాయకులు తీర్మానించుకున్నారు. ఆ వర్గానికి...

Chiru, Pawan విఫలం కాకూడదు.. కాపులమంతా కలిసి నడుద్దాం!

  • అధికారమే లక్ష్యంగా పనిచేద్దాం
  • పార్టీలు వేరైనా మన వర్గానికి
  • ప్రాధాన్యం ఉండేలా చూసుకోవాలి
  • కాపు ముఖ్య నాయకుల నిర్ణయం
  • ఇటీవల హైదరాబాద్‌ హోటల్లో భేటీ
  • భావి ప్రణాళిక కోసం కోర్‌ కమిటీ

(గుంటూరు-ఆంధ్రజ్యోతి)

అధికార సాధనే లక్ష్యంగా అడుగులు వేయాలని.. దీనికోసం కలిసికట్టుగా నడవాలని కాపు నాయకులు తీర్మానించుకున్నారు. ఆ వర్గానికి చెందిన కొంత మంది ముఖ్య నేతలు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లోని హోటల్‌ దస్‌పల్లాలో సమావేశమయ్యారు. భవిష్యత్‌ కార్యాచరణపై చర్చించారు. ఇందులో టీడీపీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు, వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధాకృష్ణ, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, గత ఎన్నికల్లో జనసేన తరపున పోటీ చేసి పరాజయం చేందిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ, తోట చంద్రశేఖర్‌తో పాటు తమిళనాడు ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి రామ్మోహనరావు, కాపు రిజర్వేషన్‌ పోరాట సాధన సమితి కన్వీనర్‌ ఆరేటి ప్రకాశ్‌, కాపు సంఘం నేతలు కేవీ రావు, ఎంహెచ్‌ రావు తదితరులు పాల్గొన్నారు.


విశ్వసనీయ సమాచారం ప్రకారం.. అధికారమే లక్ష్యంగా గతంలో అడుగులు వేసిన మెగాస్టార్‌ చిరంజీవి, పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌లా విఫలం కాకుండా.. ఈసారి పక్కా వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. గెలుపోటములను ప్రభావితం చేసేంత బలం ఉన్నప్పటికీ.. వేరొకరు పీఠం ఎక్కేందుకు ఉపయోగపడుతున్నామే గానీ.. సొంతగా అధికారాన్ని దక్కించుకులోకపోతున్నామనే భావన వ్యక్తీకరించారు. ప్రస్తుతం ఎవరు ఏ పార్టీలో ప్రయాణిస్తున్నా ఆయా పార్టీల్లో తమ సామాజిక వర్గానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చేలా చూసుకోవాలని నిర్ణయానికి వచ్చారు.


కన్నా మాట్లాడుతూ.. జాతీయపార్టీ అయినప్పటికీ బీజేపీ కాపుల బలాన్ని గుర్తించి గతంలో తనకు అధ్యక్ష పదవి ఇవ్వడమే కాకుండా ప్రస్తుతం జాతీయ కమిటీలో ఏపీ నుంచి తనకొక్కడికే అవకాశం కల్పించిన విషయాన్ని గుర్తుచేశారు. మిగతా వారు కూడా తమ పార్టీల్లో తమకున్న ప్రాధాన్యం గురించి చెప్పుకొన్నట్లు తెలిసింది. ఇదే తొలి భేటీ కావడంతో ప్రాథమిక చర్చలతోనే ముగించారు. అయితే భవిష్యత్‌ కార్యాచరణను రూపొందించేందుకు నలుగురితో కోర్‌ కమిటీని నియమించారు. ఏ పార్టీకి సంబంధం లేనివారే ఇందులో ఉన్నారు. తామెవరికీ వ్యతిరేకం కాదని, కాపులంతా ఏ పార్టీలో ఉన్నా సామరస్యంగా వ్యవహరించాలని.. అధికారమే లక్ష్యంగా పనిచేయాలనేది తమ ఆకాంక్ష అని సమావేశంలో పాల్గొన్న నేతలు పదే పదే వక్కాణించినట్లు తెలిసింది. ఇందులో వైసీపీకి చెందిన కాపు నేతలెవరూ పాల్గొనలేదు. వారం, పది రోజుల్లో కొత్త సంవత్సరంలో జరిగే రెండో భేటీలో పూర్తి స్థాయి చర్చలు నిర్వహించే అవకాశముంది.

Updated Date - 2021-12-31T07:43:38+05:30 IST