ఉచ్చు నుంచి బయటపడదాం

ABN , First Publish Date - 2022-05-20T05:30:00+05:30 IST

మూతి సన్నగా ఉన్న ఒక మట్టి కూజాలో కొన్ని గింజలు ఉన్నాయి. దానిలో కోతి పిడికిలి పూర్తిగా సరిపోదు.

ఉచ్చు నుంచి బయటపడదాం

‘నీకు నువ్వే స్నేహితుడివి, అలాగే నీకునువ్వే శత్రువు’’ అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు. కూజాలో చిక్కుకున్న కోతి కథ ఈ విషయాన్ని చక్కగా వివరిస్తుంది. 


మూతి సన్నగా ఉన్న ఒక మట్టి కూజాలో కొన్ని గింజలు ఉన్నాయి. దానిలో కోతి పిడికిలి పూర్తిగా సరిపోదు. కోతి ఆ కూజాలో చేతిని పెట్టి, పిడికిలితో గింజలు తీసుకుంది. గింజలతో నిండిన పిడికిలిని కూజా నుంచి బయటకు తియ్యాలని అది ప్రయత్నించింది. కానీ రాలేదు. నిండుగా ఉన్న పిడికిలిని పైకి తియ్యడం కోసం కోతి ఎన్నో విధాలుగా ప్రయత్నించింది. కూజాలో ఎవరో ఉచ్చు పన్నారనీ, దానిలో తను చిక్కుకుపోయాననీ అది అనుకుంది. కానీ తనకుతానుగా దాంట్లో ఇరుక్కున్నానని అది గ్రహించడం లేదు. ఎన్ని వివరణలు ఇచ్చినా ఆ గింజలను కోతి వదిలేలా ఒప్పించలేం. ఎందుకంటే ఆ గింజల్ని కాజెయ్యడానికి మనం ప్రయత్నిస్తున్నామని అది అనుకుంటుంది. బయటినుంచి చూసేవారికి... ఆ కోతి తన పిడికిలి వదులు చెయ్యడం కోసం కొన్ని గింజల్ని వదిలేస్తే... దాని చెయ్యి బయటకు వస్తుందనే సంగతి స్పష్టంగా తెలుస్తుంది. మూసి ఉన్న పిడికిలి మన శత్రువు. తెరచి ఉన్న చెయ్యి మన స్నేహితుడు. తెరవాలా, మూయాలా అనేది మనమే ఎంచుకోవాలి. అంటే మనల్ని మనకు శత్రువుగా చేసుకోవాలా, స్నేహితుడిగా మార్చుకోవాలా అనే నిర్ణయం మన దే. జీవితంలో మనం ఇలాంటి అనేక ఉచ్చుల్ని ఎదుర్కొంటూ ఉంటాం. ఆ గింజలంటే మరేవో కావు... ‘నా, నేను, నాది, నావి’ అనేవి; అహంకారం మన చేతుల్ని వాటితో కట్టేస్తుంది. అహంకారాన్ని వదుల్చుకోవాలని భగవద్గీత పదేపదే, అనేక విధాలుగా మనకి చెప్పింది. అవి వదుల్చుకుంటేనే మనం ఈ ఉచ్చుల నుంచి బయటపడతాం. అది అంతిమమైన స్వేచ్ఛ వైపు మనకి దారి చూపుతుంది.

కె.శివప్రసాద్‌, 

ఐఎఎస్‌

Updated Date - 2022-05-20T05:30:00+05:30 IST