వీడని గ్రహణం

ABN , First Publish Date - 2021-11-01T06:33:47+05:30 IST

కరోనా ఉధృతి తగ్గిన తర్వాత అన్ని విద్యా సంస్థలూ, వాటి అనుబంధ వసతి గృహాలు ప్రారంభించినా జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్‌ కళాశాల హాస్టల్‌ను మాత్రం పునఃప్రారంభించలేదు.

వీడని గ్రహణం
అనంతపురంలోని ఆర్స్ట్‌ కళాశాల హాస్టల్‌ భవనం

కరోనా తగ్గినా పునఃప్రారంభంకాని ఆర్ట్స్‌ కాలేజ్‌ హాస్టల్‌ 

కళాశాల, హాస్టల్లో అధికారుల మధ్య కోల్డ్‌వార్‌

ఆర్థికపరమైన వ్యవహారాలతో వర్గపోరు

గ్రూప్‌ రాజకీయాలకు విద్యార్థులు బలి

ప్రైవేట్‌ హాస్టళ్లు, గదుల అద్దెలు భరించలేక అవస్థలు

పట్టించుకోని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు

అనంతపురం విద్య, అక్టోబరు 31: కరోనా ఉధృతి తగ్గిన తర్వాత అన్ని విద్యా సంస్థలూ, వాటి అనుబంధ వసతి గృహాలు ప్రారంభించినా జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్‌ కళాశాల హాస్టల్‌ను మాత్రం పునఃప్రారంభించలేదు. 1,600 నుంచి 1,800 మందికి పైగా విద్యార్థుల చదువులకు ఆసరాగా నిలిచిన హాస్టల్‌ పునఃప్రారంభానికి కొన్ని శక్తులు ధనాశతో అడ్డుపడుతున్నాయి. కళాశాలలోని కోల్డ్‌ వార్‌, స్కాలర్‌ షిప్పులు, ఇతర ఆదాయ మార్గాలను సొమ్ము చేసుకోవాలన్న కొందరి దురాశే కళాశాల హాస్టల్‌ పునఃప్రారంభానికి శాపంగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. ఏడాదిన్నరగా హాస్టల్‌ తెరవకపోవటంతో వందలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 


70 శాతం విద్యార్థులకు హాస్టలే ఆవాసం..

బీఏ, బీకాం, బీఎస్సీ కోర్సులతోపాటు, పీజీ కోర్సులను సైతం కళాశాలలో అందిస్తున్నారు. 40 వరకూ కోర్సులు అందిస్తుంటే సుమారు 2010 సీట్లు అందుబాటులో ఉంటాయి. కళాశాలలో చదువుకోవడానికి వచ్చిన విద్యార్థుల్లో జిల్లా నలుమూలల నుంచే కాకుండా ఇతర జిల్లాల విద్యార్థులు సైతం వచ్చి ఇక్కడ చదువుకుంటుంటారు.  అడ్మిషన్లు పొందిన విద్యార్థుల్లో సుమా రు 60 శాతం నుంచి 70 శాతం మంది విద్యార్థులకు కళాశాల హాస్టలే ఆవాసంగా నిలుస్తోంది. హాస్టల్‌లో చేరే విద్యార్థుల నుంచి కొంత మొత్తం(కాషన్‌ డిపాజిట్‌) సేకరించి, వసతి సదుపాయం కల్పిస్తారు. కళాశాలకు సమీపంలోనే ఉండటం, జిల్లా కేం ద్రం నడిబొడ్డున ఉండటం, తక్కువ ఖర్చుతో నడుస్తుండటం ఇలా అన్ని రకాలుగా ఉపయోగంగా ఉండటంతో అనేక మంది విద్యార్థులు హాస్టల్లో ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. కానీ నేడు దాన్ని పునఃప్రారంభించక పోవడంతో వందలాది మంది ఇబ్బందులు పడుతున్నారు. 


ఎందరు విన్నవించినా...పట్టించుకోరా..?

ఆర్ట్స్‌ కళాశాల హాస్టల్‌ తెరవకపోవటంతో విద్యార్థులు చాలా మంది ప్రైవేట్‌ హాస్టళ్లలో, అద్దె గదుల్లో ఉంటూ డబ్బులు కట్టలేక పడరానిపాట్లు పడుతున్నారు. కొందరు బస్‌పాసులు తీసుకుని అప్‌ అండ్‌ డౌన్‌చేస్తూ చదువుకుంటున్నారు. విద్యార్థుల సమస్యలు చూసి ఎస్‌ఎ్‌ఫఐ, ఏఐఎ్‌సఎఫ్‌, బీసీ,ఎస్సీ,ఎస్టీ మైనార్టీ సమాఖ్య ఇలా పలు సంఘాలు ప్రిన్సిపాల్‌ను సమస్యను కలిసి విన్నవించారు. ఐదారు మాసాల కిందటే పదుల సంఖ్యలో వినతులు ఇచ్చినా నేటికీ సమస్య పరిష్కారం కాలేదు. 


గ్రూప్‌ పాలిటిక్స్‌....ఆదాయమే నడిపిస్తోందా..?

కళాశాలలో కోటరీలు ఉన్నాయి. గ్రూప్‌ రాజకీయాలు నడుస్తున్నాయి. గతంలో పనిచేసిన హాస్టల్‌ వార్డెన్లు, ప్రస్తుతం ఉన్నవారి మధ్య, కళాశాలలో ఓ కీలక అధికారి మధ్య కోల్డ్‌ వార్‌ నడుస్తోందన్న విమర్శలు ఉన్నాయి. పైగా లక్షల్లో మిగిలిన హాస ల్‌ డబ్బులు, ఇతర ఆర్థిక పరమైన వ్యవహారాల వల్లే ఇక్కడ వర్గపోరు నడుస్తోందన్న విమర్శలు వస్తున్నాయి. ఫలితంగా తమ ఆధిపత్యం నిలబెట్టుకోవాలన్న పంతంతో ఇటీవల హాస్టల్‌లో ఒక అధికారి మరో అధికారిపై దాడికి  దిగిన వైనం సోష ల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.  మొత్తానికి కళాశాలను, హాస్టల్‌ను నేడు గ్రూప్‌ రాజకీయాలు శాసిస్తున్నాయడానికి ఈ దాడే ఓ ఉదాహరణ. హాస్టల్‌ పునఃప్రారంభాన్ని జిల్లా కేంద్రం లో ఉండే ఎంపీలు, ఎమ్మెల్యేలు కానీ, కలెక్టర్‌, జేసీ వంటి ఉన్నతాధికారులు కానీ పట్టించుకోకపోవడం విద్యార్థులకు శాపంగా మారింది.


అవసరం వచ్చినప్పుడే ఎమ్మెల్యే, ఎంపీలకు గుర్తుకొస్తుంది

జిల్లా కేంద్రంలో భారీ ఎత్తున ఏ అధికారిక కార్యక్రమం చేయాలన్నా ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారులకు ఆర్ట్స్‌ కాలేజ్‌ గుర్తుకొస్తుంది. కానీ నేడు అక్కడ 2 వేల మందికి పైగా విద్యార్థులు వసతి లేక ఇబ్బందులు పడుతున్నారు. అయినా కళాశాల గుర్తుకు రాదు. హాస్టల్‌ పునఃప్రారంభించాలని పలుమార్లు ప్రిన్సిపాల్‌కు విన్నవించాం. కానీ రీ ఓపెన్‌ చేయలేదు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు చొరవ చూపాలి. 

-  సూర్యచంద్రయాదవ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, జిల్లా ప్రధాన కార్యదర్శి


హాస్టల్‌ ఓపెన్‌ చేయాలి 

జిల్లాకేంద్రంలోని ఆర్ట్స్‌ కాలేజ్‌ హాస్టల్‌ బడుగు, బలహీన వర్గాల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడేది. 100, 120 కిలోమీటర్ల దూరంలో సొంతూళ్లు ఉండే వారికి, బస్సు సౌకర్యం లేని ఎందరో విద్యార్థులు ఈ హాస్టల్‌లో ఉంటూ చదువుకొనేవారు. పేద విద్యార్థులకు ఇది ఓపెన్‌ చేస్తే కానీ చదువుకోలేని పరిస్థితి. ఇప్పటికైనా విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా పునఃప్రారంభించాలి.

- బండి పరశురాం, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకుడు


విన్నవించినా... పెడచెవిన పెడితే ఎలా ?

జిల్లాలో సుమారు 2 వేల మందికి షెల్డర్‌ ఇచ్చే హాస్టల్‌ను నేడు ఓపెన్‌ చేయలేదు. అనేకమార్లు హాస్టల్‌ పునః ప్రారంభించమని ప్రిన్సిపాల్‌ దృష్టికి తీసుకెళ్లాం. అయిన ప్పటికీ పట్టించుకోవడం లేదు. పేద విద్యార్థులు ఆకలితో అలమటిస్తున్నారు. రీ ఓపెన్‌ చేయకుంటే విద్యార్థుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం.

- సాకే నరేష్‌,  బీసీ,ఎస్సీ,ఎస్టీ విద్యార్థి సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి

Updated Date - 2021-11-01T06:33:47+05:30 IST