వీడిన హత్య మిస్టరీ

ABN , First Publish Date - 2021-09-18T05:56:14+05:30 IST

తలమడుగు మండలం దేవాపూర్‌ గ్రామశివారులో కాల్చివేసి వదిలేసిన మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించారు.

వీడిన హత్య మిస్టరీ
నిందితులను చూపుతున్న పోలీసులు

వివాహేతర సంబంధమే కారణం

దారుణంగా హత్యచేసి పెట్రోల్‌తో కాల్చివేత ఫఏడుగురు నిందితుల అరెస్టు 

ఆదిలాబాద్‌, సెప్టెంబరు17 (ఆంధ్రజ్యోతి) : తలమడుగు మండలం దేవాపూర్‌ గ్రామశివారులో కాల్చివేసి వదిలేసిన మృతదేహం మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా ఎస్పీ రాజేశ్‌చంద్ర హత్యకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. జైనథ్‌ మండలం మాకోడ గ్రామానికి చెందిన బుత్కర్‌చైతన్య (22) అనే యువకుడు జిల్లాకేంద్రంలోని రాంనగర్‌కాలనీకి చెందిన కృష్ణవేణి, 2018లో ఆదిలాబాద్‌ పట్టణంలో ప్రధానమంత్రి కౌసల్‌ వికాస్‌యోజన పథకంలో శిక్షణ తీసుకున్నారు. అదే సమయంలో కృష్ణవేణిని చైతన్య ప్రేమ, పెళ్లి పేరుతో తరుచువేదిస్తుండేవాడని ఆమెకు ఇష్టం లేకున్న వెంటపడి లైంగికంగా వేధింపులకు గురి చేయడంతో రాంనగర్‌కు చెందిన మావురపు రాజశేఖర్‌తో కృష్ణవేణికి వివాహం జరిపించారు. అనంతరం కూడా చైతన్య ఆమెను వేధించడంతో  భర్తతో పాటు కుటుంబ సభ్యులకు విషయాన్ని తెలియజేసింది. దీంతో ఓ ప్రణాళిక ప్రకారం ఈ నెల 9న కృష్ణవేణితో ఫోన్‌ చేయించి ఇంటికి రావాలని కోరడంతో ద్విచక్రవాహనంపై చైతన్య ఇంటిలోకి రాగానే ఇంట్లోనే మాటువేసి ఉన్న ఏడుగురు నిందితులు ఒక్కసారిగా ఇనుపపారా, కట్టెలతో కొట్టిహత్య చేశారు. అనంతరం చైతన్య మృతదేహాన్ని చాపలో చుట్టి ఆటోట్రాలీ (ఏపీ25డబ్ల్యు6087)లో తీసుకెళ్లి ఎవరికీ అనుమానం రాకుండా తలమడుగు మండలం దేవాపూర్‌ తంగిడిపిప్పిరి శివారులోని అటవీప్రాంతంలో క్వారీవద్ద మృతదేహం పై  పెట్రోల్‌పోసి నిప్పంటించారు. ఆ తర్వాత ఏమి తెలియనట్లు వారి వారి పనుల్లో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో మృతుని కుటుంబసభ్యులు చైతన్య కనబడడం లేదని ఆదిలాబాద్‌ ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయగా ఈ నెల 14న కాలిపోయిన శవం తలమడుగు పోలీసుస్టేషన్‌ పరిధిలో గుర్తించారు. వెంటనే దర్యాప్తు చేసి మావురపు రాజశేఖర్‌, మావురపు కృష్ణవేణి, మావురపు చంద్రశేఖర్‌, రోడ్డసాయికిరణ్‌, మావురపు శైలజ, మరో ఇద్దరు మైనర్‌ నిందితులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. అరె స్టు చేసిన వారిని కోర్టులో హాజరుపరుస్తామని జిల్లా ఎస్పీ తెలిపారు. రెండురోజుల్లోనే హత్యకేసు మిస్టరీని ఛేదించిన పోలీసు సిబ్బందికి నగదు రివార్డును అందజేశారు. డీఎస్పీ వెంకటేశ్వర్‌రావు, గ్రామీణ సీఐ పురుషోత్తంచారి, పట్టణ సీఐ ఎస్‌.రామకృష్ణ, తలమడుగు ఎస్సై పి.దివ్యభారతి, మావల ఎస్సై ఎ.హరిబాబు, పట్టణ ఎస్సై జి.అప్పారావ్‌ తదితరులను ఎస్పీ అభినందించారు.


Updated Date - 2021-09-18T05:56:14+05:30 IST