మేడ్చల్‌ జిల్లాను నెంబర్‌వన్‌గా నిలుపుదాం

ABN , First Publish Date - 2022-08-16T06:02:33+05:30 IST

మేడ్చల్‌ జిల్లాను నెంబర్‌వన్‌గా నిలుపుదాం

మేడ్చల్‌ జిల్లాను నెంబర్‌వన్‌గా నిలుపుదాం
మేడ్చల్‌ కలెక్టరేట్‌లో జాతీయ జెండాకు వందనం చేస్తున్న మంత్రి మల్లారెడ్డి

  •    కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి
  •   ఉత్తమ అధికారులకు ప్రశంసాపత్రాల అందజేత
  •   అలరించిన విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు
  •   17న నూతన కలెక్టరేట్‌ భవనం ప్రారంభోత్సవం

మేడ్చల్‌ అర్బన్‌, ఆగస్టు 15: అన్ని రంగాల్లో  మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాను అభివృద్ది చేసి నెంబర్‌వన్‌గా నిలిపేందుకు అందరు సమన్వయంతో పనిచేయాలని కార్మిక, ఉపాధికల్పనశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపు నిచ్చారు. స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా సోమవారం కలెక్టరేట్‌ పరేడ్‌ మైదానంలో కలెక్టర్‌ హరీష్‌, రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌తో కలిసి మంత్రి త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఎ్‌సఐపాస్‌ ద్వారా 8,976 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇప్పించడం జరిగిందన్నారు. జిల్లాలో 2.13 లక్షల మందికి ఉపాధి చూపుతున్నామని చెప్పారు. ఘట్‌కేసర్‌ మండలం మాదారంలో పరిశ్రమలు నెలకొల్పేందుకు సర్వే నెంబర్‌ 171.09 ఎకరాలను సేకరించి టీఎ్‌సఐఐసీకి అప్పగించడం జరిగిందన్నాన్నారు. కార్మిక శాఖ ద్వారా 1,397 మంది కార్మికులకు లబ్ధి చేకూరుతోందన్నారు.  2022-23లో 63 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నామని, ఇప్పటి వరకు 27 లక్షల మొక్కలను నాటామన్నారు. అల్వాల్‌లో టీఐఎంఎస్‌ ను వేయి కోట్లతో ఏర్పాటు చేసేందుకు కేసీఆర్‌ శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. మేడ్చల్‌, శామీర్‌పేట పీహెచ్‌సీలను ఉన్నతస్థాయి ఆస్పత్రులుగా మార్చేందుకు పనులు జరుగతున్నాయన్నారు. ఈనెల 17న శామీర్‌పేట మండలం అంతాయిపల్లిలో నిర్మించిన నూతన కలెక్టరేట్‌ భవనాన్ని సీఎం కేసీఆర్‌ ప్రారంభించనున్నారని తెలిపారు.  సీఎం  తెలంగాణ సంపూర్ణ అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నారని వివరించారు.  కాగా పరేడ్‌ మైదానంలో నిర్వహించిన పంద్రాగస్టు వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. జెండావిష్కరణ అనంతరం ఓపెన్‌టా్‌ప జీప్‌లో  కలెక్టర్‌ హరీష్‌, మహేష్‌ భగవత్‌తో కలిసి మంత్రి పోలీసుల గౌరవవందనం స్వీకరించారు.  తర్వాత స్వాతంత్య్ర సమరయోధులు కాశీవిశ్వనాథ్‌, జానాబాయిలను సత్కరించారు. జిల్లా ఉత్తమ అధికారులకు ప్రశంసాపత్రాలను అందించారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కళాప్రదర్శనలు ఆహూతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, అదనపు కలెక్టర్లు జాన్‌ శ్యాంసన్‌, లింగ్యానాయక్‌, మల్కాజిగిరి డీసీపీ రక్షితామూర్తి, కుషాయిగూడ ఏసీపీ రష్మితపెరుమల్లు, కలెక్టరేట్‌ ఏవో వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. 


Updated Date - 2022-08-16T06:02:33+05:30 IST