Advertisement

పారిశుధ్య సిబ్బందికి నెలనెలా జీతాలిద్దాం!

Nov 29 2020 @ 00:08AM
మున్సిపల్‌ సమావేశంలో మాట్లాడుతున్న చైర్మన్‌ మల్లయ్య యాదవ్‌

ఆందోలు-జోగిపేట మున్సిపల్‌ పాలకవర్గం తీర్మానం

బల్దియాలో సిటిజన్‌ ఛార్టర్‌ కచ్చితంగా అమలు 

మున్సిపల్‌ చైర్మన్‌ గూడెం మల్లయ్యయాదవ్‌

పట్టణ ప్రగతిలో చేపట్టిన పనులకు బిల్లులు చెల్లించాలి

కమిషనర్‌ను కోరిన కౌన్సిలర్లు 

జోగిపేట, నవంబరు 28 : అందోలు-జోగిపేట మున్సిపల్‌ పరిధిలో పనిచేస్తున్న పారిశుధ్య సిబ్బందికి ఇక నుంచి ప్రతీనెలా జీతాలు చెల్లిద్దామని మున్సిపల్‌ చైర్మన్‌ గూడెం మల్లయ్యయాదవ్‌ చేసిన ప్రతిపాదనకు కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. శనివారం స్థానిక బల్దియా కార్యాలయంలో ఆయన అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ జంట పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ జరగడం లేదని కౌన్సిల్‌ దృష్టికి తీసుకుపోగా.. పారిశుధ్యాన్ని తప్పకుండా అమలు చేద్దామని చైర్మన్‌ హామీనిచ్చారు. అయితే పారిశుధ్య సిబ్బందికి నెలనెలా జీతాలు చెల్లించకపోవడంతో వారిపై ఒత్తిడి తేలేకపోతున్నామని ఆయన అభిప్రాయపడ్డారు. అందుకోసం ప్రతీనెలా జీతాలు చెల్లిద్దామంటూ, తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సభ్యులంతా ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. అనంతరం మున్సిపాలిటీలో సిటిజన్‌ ఛార్టర్‌ లేదని, దీనివల్ల ప్రజలకు ఏ పని ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని చైర్మన్‌ అన్నారు. ఇక నుంచి బల్దియాలో సిటిజన్‌ ఛార్టర్‌ను ఏర్పాటు చేసి కచ్చితంగా అమలయ్యేలా చర్యలు తీసుకుందామని ప్రకటించారు. గతంలో పట్టణ ప్రగతిలో భాగంగా తమ వార్డుల్లో తాము స్వయంగా కొంత మొత్తాలను చెల్లించి పనులు చేపట్టామని, ఆ బిల్లులను చెల్లించాలని కాంగ్రెస్‌ కౌన్సిలర్లు చిట్టిబాబు, డాకూరి శంకర్‌, హరికృష్ణాగౌడ్‌, రంగ సురేశ్‌గుప్తా, టీఆర్‌ఎ్‌సకు చెందిన దుర్గేశ్‌ కోరారు. అయితే ఆ సమయంలో ఉన్న కమిషనర్‌, ఏఈలు వాటికి సంబంధించిన ఎంబీలను రికార్డు చేయనందున తానేమీ చేయలేనని కమిషనర్‌ కేశూరాంనాయక్‌ సమాధానిమచ్చారు. అయితే జనరల్‌ నిధుల్లోంచి ఆ బిల్లులను చెల్లించాలంటూ కో ఆప్షన్‌ సభ్యుడు అల్లె శ్రీకాంత్‌ సూచించగా, నిబంధనలకు విరుద్ధంగా చెల్లించలేమని కమిషనర్‌ అన్నారు. ఇదిలా ఉంటే పట్టణ ప్రజల సౌకర్యార్థం కొనుగోలు చేసిన మొబైల్‌ టాయిలెట్‌కు సంబంధించి రూ.4.70 లక్షలు, దీనికి అదనంగా వివిధ పనుల కోసం ఖర్చుచేసిన మరో రూ.4 లక్షలను చెల్లించేందుకు కౌన్సిల్‌ ఆమోదం తెలిపింది. అలాగే జంట పట్టణాల్లో పారిశుధ్య నిర్వహణ కోసం రూ.3 లక్షల నిధులు కేటాయించి వివిధ సామగ్రి కొనేందుకు సమావేశం తీర్మానించింది. పారిశుధ్య నిర్వహణ కోసం ఒక ఎక్స్‌కవేటర్‌ డ్రైవర్‌, ఒక ఎలక్ట్రీషియన్‌తో పాటు మరో 12 మంది పారిశుధ్య కార్మికులు మొత్త కలిపి 14 మంది నూతన సిబ్బందిని ఔట్‌ సోర్సింగ్‌ పద్ధతిని తీసుకునేందుకు కౌన్సిల్‌ పచ్చజెండా ఊపింది. దోమల బెడద తగ్గించేందుకు నూతనంగా ఫాగింగ్‌ మిషన్‌ కొనుగోలుకు కూడా కౌన్సిల్‌ ఆమోద ముద్ర వేసింది. అలాగే మిషన్‌ భగీరథ సంస్థ బల్దియాకు నీటి సరఫరాను అప్పగించిన పిదప, ప్రతీనెలా నల్లా బిల్లును రూ.100 చొప్పున ఒక కనెక్షన్‌కు ప్రతీయేటా రూ.1200 వసూలు చేయాలని తీర్మానించింది. బల్దియా పరిధిలో మ్యుటేషన్‌ (ఆస్తి పేర్ల బదలాయింపు)నకు గానూ ప్రస్తుతం వసూలు చేస్తున్న రూ.500 నుంచి ఒకశాతం అదనంగా వసూలు చేసేందుకు ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో వైస్‌ చైర్మన్‌ డేవిడ్‌ (ప్రవీణ్‌), కమిషనర్‌ కేశూరాంనాయక్‌, అకౌంటెంట్‌ రాందాస్‌, కౌన్సిలర్లు డాకూరి శంకర్‌, భాగ్యలక్ష్మి, వీ.మాధవి, హరికృష్ణాగౌడ్‌, పుర్ర ప్రవీణ, ఝకియాసుల్తానా, భవానీ రత్నంగౌడ్‌, గాజుల ధనలక్ష్మి, రంగ సురేశ్‌, పైతర దుర్గేశ్‌, పడిగె సుమిత్ర, ఆకుల సత్యనారాయణ (చిట్టిబాబు), గడిండ్ల భారతీగౌడ్‌, రమావత్‌ చందర్‌నాయక్‌, కోఆప్టెడ్‌ సభ్యులు ఫైజల్‌, అల్లె శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement