నారుమడిని సిద్ధం చేయండిలా..

ABN , First Publish Date - 2021-07-22T05:30:00+05:30 IST

ఖరీ్‌ఫ సీజన్‌ కోసం రైతులు పెద్ద ఎత్తున వరి నారుమళ్లు సాగు చేస్తున్నారు.

నారుమడిని సిద్ధం చేయండిలా..
రైతులు సాగు చేసిన వరి నారుమడి

  1. యాజమాన్య పద్ధతులతోనే అధిక దిగుబడులు  


 శిరివెళ్ల, జూలై 22:  ఖరీ్‌ఫ సీజన్‌ కోసం రైతులు పెద్ద ఎత్తున వరి నారుమళ్లు సాగు చేస్తున్నారు. అయితే వరి నారుమళ్లలో రైతులు    కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించాలి. ఎకరా పొలంలో వరి నాట్లు వేయడానికి ఐదు సెంట్ల నారుమడి సరిపోతుంది. నారుమడిని 10 నుంచి 12 రోజుల వ్యవధిలో రెండు నుంచి మూడు సార్లు దమ్ము చేసి చదును చేయాలి. నారుమడికి నీరు పెట్టేందుకు, నీరు బయటకు వెళ్లేందుకు వీలుగా చిన్న చిన్న కాల్వలు ఏర్పాటు చేసుకోవాలి. ఐదు సెంట్ల నారుమడికి రెండు కిలోల నత్రజని, కిలో పొటాష్‌, కిలో భాస్వరం చొప్పున ఎరువులను దుక్కిలో వేయాలి. ఎంపిక చేసుకున్న నాణ్యమైన విత్తనాలను 24 గంటల పాటు నీళ్లలో నానబెట్టి బయటకు తీసి మరో 24 గంటల పాటు మండె కట్టి ఉంచాలి. ఆ తర్వాత మొలకలు వచ్చిన విత్తనాలను ఒక సెంటుకు 5 నుంచి 6 కిలోల చొప్పున మడిలో చల్లుకోవాలి. నారు మొలకెత్తే సమయంలో అరుతడులు ఇచ్చి తర్వాత నీరు పలుచగా కట్టుకోవాలి. మడిలో నీరు ఎక్కువైతే నారు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. 


నారుమడిలో సస్యరక్షణ 

 మొదటగా విత్తనశుద్ధి తప్పనిసరిగా చేయించాలి.  కిలో వరి విత్తనాలకు మూడు గ్రాముల కార్బండైజిమ్‌ను కలిపి 24 గంటల తర్వాత మడిలో చల్లుకోవాలి. నారుమడిలో జింకు లోపాన్ని గుర్తిస్తే లీటరు నీటికి రెండు గ్రాముల జింక్‌ సల్ఫేట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయాలి. జింక్‌ను ఇతర మందులతో కలుపకూడదు. మడిలో అగ్గి తెగులు నివారణకు లీటరు నీటికి 0.6 గ్రాముల ట్రైసైక్లోజోల్‌ లేదా రెండు మిల్లీ లీటర్ల కాసుగామైసిన్‌ కలిపి పిచికారీ చేయాలి. నారు తీయడానికి వారం రోజుల ముందు కార్బోఫ్యూరాన్‌ గుళికలు ఒక సెంటుకు 160 గ్రాముల చొప్పున వేయాలి. నారు నాటే ముందు వేర్లను 50 లీటర్ల నీటిలో 100 ఎంఎల్‌ క్లోరిఫైరిఫాస్‌, 2.5 కిలోల యూరియాను కలిపిన ద్రావణంలో దాదాపు అరగంట సేపు ఉంచి నాటుకుంటే పంటలో చీడపీడలు నివారించబడతాయి.


వరి సాగులో నారుమడి కీలకం 

నాణ్యమైన నారుతో మంచి దిగుబడులు వస్తాయి. మోతాదుకు మించి ఎరువులు, పురుగుమందులు వినియోగిస్తే దిగుబడులపై ప్రభావం చూపుతుంది. నారుమడి యాజమాన్య పద్ధతులపై వ్యవసాయ శాఖ సిబ్బంది ద్వారా  రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. 

- అబ్దుల్‌హక్‌, వ్యవసాయాధికారి, శిరివెళ్ల 



Updated Date - 2021-07-22T05:30:00+05:30 IST