దమ్మాలపాటిపై కఠిన చర్యలు తీసుకోం

ABN , First Publish Date - 2021-03-06T08:27:49+05:30 IST

అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివా్‌సతోపాటు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న ఇతరులపై కఠిన చర్యలు తీసుకోబోమని రాష్ట్రప్రభుత్వం తరఫున

దమ్మాలపాటిపై కఠిన చర్యలు తీసుకోం

దర్యాప్తు కొనసాగనివ్వండి

సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వ వినతి


న్యూఢిల్లీ, మార్చి 5(ఆంధ్రజ్యోతి): అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోళ్లపై మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివా్‌సతోపాటు ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో ఉన్న ఇతరులపై కఠిన చర్యలు తీసుకోబోమని రాష్ట్రప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ సుప్రీంకోర్టుకు తెలిపారు. దర్యాప్తును కొనసాగనివ్వాలని.. హైకోర్టు విధించిన స్టేను ఎత్తివేయాలని కోరారు. దమ్మాలపాటిపై నమోదైన ఏసీబీ కేసుపై తదుపరి దర్యాప్తు చేయవద్దని ఆదేశిస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులతో పాటు టీడీపీ నేత వర్ల రామయ్య హైకోర్టు ధర్మాసనాన్ని ఆశ్రయించగా.. గత ప్రభుత్వ నిర్ణయాలపై సమీక్షకు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉప సంఘం, సిట్‌ దర్యాప్తుపై స్టే విధించడం, ఆ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ రాష్ట్రప్రభుత్వం వేర్వేరుగా సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయడం తెలిసిందే. వాటిపై శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌, జస్టిస్‌ ఆర్‌.సుభా్‌షరెడ్డితో కూడిన ద్విసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.


సీనియర్‌ న్యాయవాది రాజీవ్‌ ధవన్‌ వాదనలు ప్రారంభిస్తూ.. ‘నిందితులపై కఠిన చర్యలు తీసుకోబోం. కోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు చేసినా మాకు అంగీకారమే. కోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తుకు ఆదేశించినా స్వాగతిస్తాం. కానీ దర్యాప్తు మాత్రం కొనసాగనివ్వండి’ అని విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలను తదుపరి విచారణలో పరిశీలిస్తామని, విచారణను ఏప్రిల్‌ 7కు వాయిదా వేసింది. మరోవైపు.. వర్ల రామయ్య కేసులో సిట్‌తోపాటు మంత్రివర్గ ఉప సంఘం దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించిందని, దాన్ని ఎత్తివేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే విజ్ఞప్తి చేశారు. అయితే.. దమ్మాలపాటి కేసుతో కలిపి తమ పిటిషన్‌పై విచారణ జరపవద్దని.. రెండింటిని వేర్వేరుగా చూడాలని వర్ల రామయ్య తరఫున సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా కోరారు. కేసు విచారణకు వర్ల రామయ్య తరఫున అడ్వకేట్‌ ఆన్‌ రికార్డు గుంటూరు ప్రమోద్‌ కుమార్‌ హాజరయ్యారు.

Updated Date - 2021-03-06T08:27:49+05:30 IST