విప్లవం.. వర్ధిల్లాలి!

ABN , First Publish Date - 2021-06-20T08:14:29+05:30 IST

‘గ్రూప్‌ 1, 2 కలిపి 36 పోస్టులు భర్తీ చేస్తారా? దీనిని ఉద్యోగాల విప్లవం అని అంటారా? జాబ్‌ క్యాలెండర్‌ ఇదేనా?’.. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న లక్షలాదిమంది యువత సంధిస్తున్న సూటి ప్రశ్నలు ఇవి! నిరుద్యోగుల దృష్టిలో

విప్లవం.. వర్ధిల్లాలి!

జాబ్‌ క్యాలెండర్‌పై నిరుద్యోగుల విస్మయం

నిజంగానే కనీవినీ ఎరుగని ఖాళీలని ఎద్దేవా

2.3 లక్షల పోస్టులు భర్తీ చేస్తామని నాడు హామీ

ఇప్పుడు 10 వేల పోస్టులతో జాబ్‌ క్యాలెండర్‌

అందులో... ఐదు వేలు వైద్య ఆరోగ్య శాఖవే

గ్రూప్‌ 1, 2 సర్వీసులకు కలిపి 36 పోస్టులు

టీచర్‌, కానిస్టేబుల్‌ నియామకాల ఊసే లేదు

టీడీపీ హయాంలో 15 వేల టీచర్‌ పోస్టులు భర్తీ

2 విడతల్లో 6,748 పోలీసుల నియామకాలు

ఇప్పుడు అవేవీ లేకున్నా ‘విప్లవం’ అంటూ గొప్పలు


నిజంగా... ‘విప్లవమే’!

గ్రూప్‌ 1, 2 నోటిఫికేషన్లకు సంబంధించి నిజంగా... ఇది కనీవినీ ఎరుగని విప్లవమే! ఎందుకంటే... ఎప్పుడూ ఇంత తక్కువ పోస్టులతో నోటిఫికేషన్లు రాలేదు. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్లను మచ్చుకు కొన్నింటిని పరిశీలిస్తే... 2008లో 198 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వెలువడింది. 2011లో 312, 2016లో 78, 2018లో 169 పోస్టులను నోటిఫై చేశారు. ఇప్పుడు జగన్‌ సర్కారు 16 గ్రూప్‌-1 ఖాళీలు నింపుతామంటోంది.


చెప్పింది..

‘‘అధికారంలోకి వచ్చిన తర్వాత మనం చేయబోయే మొట్టమొదటి పని.. ఈ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడం. 1.42 లక్షలు చంద్రబాబు సీఎం అయ్యే నాటికి ఖాళీగా ఉన్నాయని కమలనాథన్‌ కమిటీ చెప్పింది. ఈ ఐదు సంవత్సరాల్లో రిటైర్‌ అయిన వాళ్లు 90 వేల మంది. మొత్తంగా 2.30 లక్షల ఖాళీ ఉద్యోగాలను అధికారంలోకి వచ్చిన వెంటనే భర్తీ చేయడానికి శ్రీకారం చుడతామని హామీ ఇస్తున్నా! అంతే కాదు ప్రతి సంవత్సరం జనవరి ఒకటో తారీఖు వచ్చే సరికి ప్రభుత్వ ఉద్యోగాల క్యాలెండర్‌ను కూడా ఇస్తాం!’’

- అసెంబ్లీ ఎన్నికల ముందు జగన్‌ చేసిన ప్రకటన


చేసింది..

రెండేళ్లపాటు జాబ్‌ క్యాలెండర్‌ ఊసే లేదు. శుక్రవారం కేవలం 10,143 ఖాళీలకు... దశల వారీగా 9 నెలల్లో నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పారు. మరి...మిగిలిన 2.20 లక్షల ఖాళీ పోస్టులు ఎన్నేళ్లలో నింపుతారో!


(అమరావతి - ఆంధ్రజ్యోతి)

‘గ్రూప్‌ 1, 2 కలిపి 36 పోస్టులు భర్తీ చేస్తారా? దీనిని ఉద్యోగాల విప్లవం అని అంటారా? జాబ్‌ క్యాలెండర్‌ ఇదేనా?’.. ఉద్యోగాల నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న లక్షలాదిమంది యువత సంధిస్తున్న సూటి ప్రశ్నలు ఇవి! నిరుద్యోగుల దృష్టిలో ‘రిక్రూట్‌మెంట్‌’ అంటే... గ్రూప్‌ 1, 2, టీచర్‌ పోస్టులు, పోలీస్‌ కొలువులు! గతంలో వేలకొద్దీ టీచర్‌ పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్లు వెలువడ్డాయి. వందల ఖాళీలతో గ్రూప్‌- 1, 2 నోటిఫికేషన్లు వచ్చాయి. ఇంకా భారీ సంఖ్యలో పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ నోటిఫికేషన్లు విడుదల చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ... ‘ఉద్యోగాల విప్లవం’ అంటూ శుక్రవారం ముఖ్యమంత్రి జగన్‌ విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లోని అంకెలు చూసి నవ్వాలో, ఏడవాలో తెలియడంలేదని నిరుద్యోగులు వాపోతున్నారు. గ్రూప్‌ 1, 2 పోస్టులకు ఐదారు లక్షల మంది సిద్ధమవుతున్నట్లు అంచనా. కానీ... జాబ్‌ క్యాలెండర్‌లో రెండు సర్వీ్‌సలకు కలిపి 36 పోస్టులు భర్తీ చేస్తామని గొప్పగా చెప్పారు. టీచర్‌ పోస్టుల ఊసే లేదు. ఇక... పోలీసు శాఖలో కేవలం 450 పోస్టులు భర్తీ చేసారట! ఇతర అన్ని శాఖలు కలిపి 36 ఖాళీలు నింపుతామని చెప్పారు. జాబ్‌ క్యాలెండర్‌లో చూపిన 10,143 పోస్టుల్లో...  ప్రత్యేకమైన అర్హతలు అవసరమైన పారా మెడికల్‌, ఫార్మసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్ల ఖాళీలే 5251 ఉండటం గమనార్హం. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నట్లు అంచనా. వీరిలో సుమారు 15 లక్షల మంది వరకు సాధారణ డిగ్రీ, పీజీ చదువు పూర్తిచేసిన వారే ఉంటారు. ఎలాంటి టెక్నికల్‌ క్వాలిఫికేషన్లు లేని వీరంతా గ్రూప్‌-1, 2, పోలీస్‌ రిక్రూట్‌మెంట్ల కోసం ఎదురుచూస్తున్నారు.  వీరందరి ఆశలపై  జగన్‌ సర్కారు నీళ్లు చల్లింది.


పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ ఇలా...

రాష్ట్ర విభజన తర్వాత... 2016 జూలైలో చంద్రబాబు ప్రభుత్వం ఒకేసారి 4548 మంది పోలీసుల నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఎంపికైన వారంతా శిక్షణ పూర్తి చేసుకుని 2017 నుంచి ఉద్యోగాలు చేస్తున్నారు. 2018లో మరోసారి చంద్రబాబు ప్రభుత్వమే 2200 మంది పోలీసుల నియామకానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. వీరంతా 2020లో కొలువుల్లో చేరారు. అంటే... గత ప్రభుత్వం 6748 మందికి పోలీసు ఉద్యోగాలు ఇచ్చింది. ఇప్పుడు... జగన్‌ సర్కారు పోలీసు శాఖలో 460 ఖాళీలు నింపుతామని జాబ్‌ క్యాలెండర్‌లో తెలిపింది. ఇందులో... కానిస్టేబుల్‌ పోస్టు ఒక్కటీ లేదు. నిజానికి... పోలీసు శాఖలో ఇప్పుడు 7740 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.


టీచర్‌ పోస్టుల భర్తీ ఇలా... 

రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం 2014లో ఒకేసారి 9061 టీచర్‌ పోస్టులతో డీఎస్సీ నిర్వహించింది. ఆ తర్వాత... 2018లో మరో 5743 మంది ఉపాధ్యాయులను నియమించింది. జగన్‌ సర్కారు హయాంలో ఇప్పటిదాకా... నిల్‌!


ఖాళీలతో దాగుడు మూతలు

ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టుల గుర్తింపు, వాటి భర్తీ విషయంలో జగన్‌ సర్కారు వాస్తవాలను కప్పిపుచ్చుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అసలు జాబ్‌ క్యాలెండర్‌ ఎలా ఉండాలన్న విషయంపైనే స్పష్టతలేదు. శాఖల వారీగా మంజూరైన పోస్టులు ఎన్ని? అందులో ఎంత మంది పనిచేస్తున్నారు? ప్రస్తుతం ఖాళీలు ఎన్ని ఉన్నాయి? వీటిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎన్ని, ఎప్పుడు భర్తీ చేస్తారనే వివరాలు జాబ్‌ క్యాలెండర్‌లో స్పష్టం చేయాలి. కానీ... కేవలం భర్తీ చేయనున్న పోస్టులను మాత్రమే పేర్కొనడాన్ని తప్పుపడుతున్నారు.


అక్కడ ఇచ్చి... ఇక్కడ తీసేసి!

కొన్ని ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా పోస్టులను సృష్టించడం వల్ల ఇప్పటి వరకు వరకు ఉన్న పోస్టులను ఖాళీల కింద చూపించడం లేదని సమాచారం. అంటే ఆ మేరకు రెగ్యులర్‌ ఖాళీలను తగ్గిస్తున్నారు. ఉదాహరణకు పంచాయతీరాజ్‌శాఖను తీసుకుంటే... ప్రభుత్వం కొత్తగా గ్రామ సచివాలయాలను నియమించింది. వీటికోసం వేలాది పోస్టులను సృష్టించింది. ఆ మేరకు ప్రభుత్వంలో ఉన్న పోస్టులను తీసేయాలన్నది ఆర్థికశాఖ ఆలోచన. ఈ పరిస్థితుల్లో వాస్తవంగా ఉన్న పోస్టులు నోటిఫికేషన్లలో చూపించటం లేదని తెలుస్తోంది.


అక్రమ ప్రమోషన్లతో...

వివిధ ప్రభుత్వ శాఖల్లో అక్రమ పదోన్నతులు ఇస్తూ... డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కోటాలో నింపాల్సిన పోస్టుల్లో కోత పెడుతున్నట్లు తెలుస్తోంది. రూల్‌ ప్రకారం ప్రభుత్వ విభాగాల్లోని పోస్టులను 50 శాతం డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా, 50 శాతం ప్రమోషన్‌ ద్వారా భర్తీ చేయాలి. కానీ చాలా విభాగాల్లో ఖాళీ పోస్టుల్లో 70 శాతం వరకు ప్రమోషన్‌ మీదనే భర్తీ చేస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ కోటాకు కోత పడుతోంది. చాలా క్యాడర్లలో అసలు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌  లేనేలేదు. పోస్టులన్నీ ప్రమోషన్‌ కోటాకే వెళ్తున్నాయి. 


ఖాళీ పోస్టులు ఉన్నా..

  • గ్రూప్‌-1 ఖాళీ పోస్టులు 93 ఉండగా.. క్యాలెండర్‌లో కేవలం 16 పోస్టులే చూపించారు. గ్రూప్‌-2లో 814 ఖాళీల భర్తీకి అవకాశముంది. కానీ... 20 పోస్టులను భర్తీచేయనున్నట్లు పేర్కొన్నారు.
  • రెవెన్యూ డిపార్ట్‌మెంట్‌లో 1148 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని భర్తీచేయాలని ఆ శాఖ ప్రభుత్వాన్ని కోరింది. ఇందులో 17 డిప్యూటీ కలెక్టర్‌ (గ్రూప్‌-1),  67 డిప్యూటీ తహసిల్దార్‌ (గ్రూప్‌-2) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిని అత్యంత ప్రాధాన్యతగా భావించాలని రెవెన్యూ శాఖ కోరింది. కానీ, ఈ 84 పోస్టులల్లో ఏడు మాత్రమే జాబ్‌ క్యాలెండర్‌లో చూపించారు.
  • ఏపీపీఎస్సీ ద్వారా భర్తీచేసే 768 ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌ పోస్టులు ఖాళీ ఉండగా... ఒక్కటీ క్యాలెండర్‌లో చూపించలేదు. 339 గ్రూప్‌-3 పోస్టులు, 639 గ్రూప్‌-4 పోస్టులనూ దాచేశారు.


నిరుద్యోగుల మాట

  • గ్రూప్స్‌ కోసం ఇంటి నుంచి దూరంగా సంవత్సరాల నుంచి చదువుతున్న వారి పరిస్థితి దారుణం. వెనక్కి వచ్చి వేరే ఉద్యోగం చేసుకోలేరు. ఏజ్‌ గ్యాప్‌ వస్తుంది. అలా అని ఏమీ చేయకుండా ఉండలేం. ఇంట్లో వాళ్లకు భారం అనే ఆలోచనతో ఇబ్బంది పడే వాళ్లు చాలామంది ఉంటారు. 
  • అమ్మో... ఈ విప్లవం తట్టుకోవడం చాలా కష్టం సార్‌!
  • చాలా ఘోరం సార్‌. రెండు సంవత్సరాలుగా జాబ్‌ మానేసి, గ్రూప్‌ 2కు ప్రిపేర్‌ అవుతున్నా. ఇప్పుడేమో 36 పోస్టులు ఇస్తున్నారంట. అందులో... గ్రూప్‌ 2 ఉద్యోగాలు పన్నెండే. ఏం చేసుకోవాలి. అప్పట్లోనే నయం. 2016 గ్రూప్‌2లో 960, 2018 గ్రూప్‌ 2లో 440 జాబ్స్‌ ఇచ్చారు. నిన్నటి నుంచి ఏమి చేయాలో, ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావడంలేదు.
  • ప్రభుత్వం కనీసం 1200 గ్రూప్‌-2 పోస్టులు ఇస్తుందని ఎక్స్‌పెక్ట్‌ చేశాను. కానీ... ఇంత ఘోరమా! 1956 నుంచి ఆంధ్రప్రదేశ్‌లో ఒక్క ముఖ్యమంత్రి కూడా ఇంతదారుణమైన ప్రకటన చేయలేదు. ఈ క్యాలెండర్‌ చూసిన తర్వాత... ఇక ఎందుకు చదవాలనిపిస్తోంది! 

Updated Date - 2021-06-20T08:14:29+05:30 IST