ముట్టుకోండి చూద్దాం..!

ABN , First Publish Date - 2021-11-15T06:15:44+05:30 IST

నగరంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రతరం అవుతోంది. రెండేళ్లుగా విస్తరణ ప్రతిపాదనలు నగర పాలక సంస్థ కార్యాలయంలో మగ్గుతున్నాయి.

ముట్టుకోండి చూద్దాం..!
బస్టాండ్‌ ఎదుట ఫుట్‌పాత్‌పై వ్యాపారాలు

  1. నగరంలో పెరిగిన ఆక్రమణలు
  2. ఫుట్‌పాత్‌లు, రోడ్లపై వ్యాపారాలు
  3. రాజకీయ నాయకులు, యూనియన్ల అండ
  4. తొలగించేందుకు అడుగడుగునా అడ్డంకులు
  5. జంకుతున్న నగరపాలిక అధికారులు, పోలీసులు
  6. పెరిగిన రద్దీతో వాహనదారులు, ప్రజలకు నరకం


కర్నూలు(అర్బన్‌), నవంబరు 14: నగరంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్రతరం అవుతోంది. రెండేళ్లుగా విస్తరణ ప్రతిపాదనలు నగర పాలక సంస్థ కార్యాలయంలో మగ్గుతున్నాయి. గత పాలక మండలి సమీక్షలో ఈ అంశంపై కార్పొరేటర్లు ప్రశ్నించారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన అధికారులు, అంతా సిద్ధంగా ఉందని, త్వరలో పనులు ప్రారంభిస్తామని అన్నారు. మేయర్‌, ఎమ్మెల్యేలు కూడా వెంటనే పనులను చేపడతారని అధికారులకు వంతపాడారు. కానీ ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఫలితంగా నగరంలో ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఆక్రమణలను తొలగించేందుకు పోలీసులు, నగర పాలక సంస్థ ఉద్యోగులు పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు. నగరంలోని ప్రధాన రహదారుల్లో రూ.కోట్లు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన ఫుట్‌పాత్‌లను చిరు వ్యాపారులు ఆక్రమించారు. దీంతో వాహనాలు వెళ్లే దారిపైనే పాదచారులు నడవాల్సి వస్తోంది. చిరు వ్యాపారుల కారణంగా రోడ్లు కుచించుకుపోయాయి. వారికి కొందరు ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల అండ ఉంది. దీంతో ఎవరూ కదిలించలేకపోతున్నారు. పోలీసులకు సైతం సాధ్యం కావడం లేదు. నగరపాలక సంస్థ అధికారులు కూడా చర్యలకు వెనకాడుతున్నారు. 


నగరం అంతటా ఆక్రమణలే..


ట్రాఫిక్‌ నియంత్రణకు పోలీసు, నగర పాలక సంస్థ అధికారులు ఐదేళ్ల క్రితమే ప్రణాళికలు రూపొందించారు. కానీ చర్యలు ప్రారంభించలేదు.

కర్నూలు మార్కెట్‌యార్డు వద్ద రోడ్డు పక్కనే కొంత మంది తోపుడు బండ్లు, చిన్న హోటళ్లు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో అక్కడ ట్రాఫిక్‌ సమస్య తీవ్రంగా మారింది. మార్కెట్‌ యార్డు నుంచి వచ్చి వెళ్లే వాహనాలు, ఎద్దుల బండ్లతోపాటు బస్టాండ్‌ నుంచి వచ్చి వెళ్లే వాహనాలతో ఆ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడి వ్యాపారులు సీఐటీయూ అనుబంధ సంస్థలో సభ్యులుగా ఉన్నారు. నగరపాలిక అధికారులు దుకాణాలను తొలగించేందుకు ప్రయత్నిస్తే ఆయా సంఘాల నాయకులు అడ్డుపడుతున్నారు.

రైల్వే స్టేషన్‌ ప్రాంతంలో రోడ్ల విస్తరణలో భాగంగా బంకులు, చిన్న చిన్న దుకాణాలను అధికారులు రాత్రికి రాత్రి తొలగించారు. కానీ నాయకుల అండతో కొద్ది రోజుల్లోనే రోడ్లను ఆక్రమించి బంకులు, దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. 

ప్రభుత్వ కంటి వైద్యశాల నుంచి ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా మెడికల్‌ కళాశాల గేటు వరకు లక్షలు వెచ్చించి ఫుట్‌పాత్‌లు ఏర్పాటు చేశారు. అప్పటి  నాయకుల అండదండలతో కొద్ది రోజుల్లోనే ఫుట్‌పాత్‌లు ఆక్రమించి కొందరు పర్మినెంట్‌ దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. ఈ ప్రాంతంలోని వ్యాపారులంతా కొన్ని సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. ఈ కారణంగా దుకాణాలు తొలగించేందుకు అధికారులు జంకుతున్నారు. 

కల్లూరు జంక్షన్‌, బిర్లా జంక్షన్‌ ప్రాంతాల్లో వ్యాపారులు ఎక్కడ పడితే అక్కడే దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతోంది. తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. 

పాత కంట్రోల్‌ రూం నుంచి పాత బస్టాండ్‌ వరకు రోడ్డు సైడ్‌ వ్యాపారులు ఫుట్‌పాత్‌లను పూర్తిగా ఆక్రమించారు. పాత బస్టాండ్‌ వద్ద డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ విగ్రహం నుంచి కింగ్‌ మార్కెట్‌ వరకు రోడ్డుకు ఇరువైపులా దుకాణాలు ఏర్పాటు చేశారు. దీంతో రోడ్డు ఇరుకుగా మారిపోయింది.

సి.క్యాంప్‌ రైతు బజార్‌ నుంచి తెలుగుదేశం పార్టీ కార్యాలయం వరకు రోడ్లను ఆక్రమించి దుకాణాలను ఏర్పాటు చేసుకున్నారు. దీంతో ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం లేకుండా పోయింది. 

నిత్యం జనాలతో కిటకిటలాడే జిల్లా పరిషత్‌ గేటు నుంచి అటు గాంధీ నగర్‌ వరకు, ఇటు రాజ్‌విహార్‌ సెంటర్‌ వరకు రోడ్లకు ఇరువైపులా పండ్లు, పూలు, చెరుకు రసం వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేశారు. వీరికితోడు తోపుడు బండ్లు రోడ్లపై ఆపి వ్యాపారాలు సాగిస్తున్నారు. దీంతో ట్రాఫిక్‌ సమస్య తీవ్రమౌతోంది. 

గుత్తి పెట్రోల్‌ బంక్‌ సమీపంలోని సూర్య దేవాలయం వద్ద రోడ్డుకు అడ్డుగా ఆటోలు, ఇతర వాహనాలు నిలుపుతుండడంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. ఇక్కడ ట్రాఫిక్‌ పోలీసులను కేటాయించినా ఏమీ చేయలేని పరిస్థితి. 

ఆనంద్‌ టాకీస్‌ నుంచి కొత్త బస్టాండ్‌, బళ్లారి చౌరస్తా వరకు రోడ్డుకు ఇరువైపులా వ్యాపారులు దుకాణాలను ఏర్పాటు చేశారు. వినాయక ఘాట్‌ నుంచి విశ్వేశ్వరయ్య సర్కిల్‌ వరకు రోడ్డుకు ఒక వైపు మాత్రమే విస్తరణ పనులు చేపట్టారు. ఆ తరువాత ఏ కారణాల వల్లో పనులు నిలిపివేశారు. విశ్వేశ్వరయ్య సర్కిల్‌ నుంచి సి.క్యాంప్‌ రాజీవ్‌ గాంధీ విగ్రహం వరకు రోడ్డుకు ఇరువైపులా విస్తరణ పనులు చేపడితే కొంత మేర ట్రాఫిక్‌ సమస్య పరిష్కారమౌతుందని నగర ప్రజలు అంటున్నారు.


పెరుగుతున్న రద్దీ


నగరంలో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. కొన్ని ప్రాంతాల్లో కి.మీ. దూరం వాహనం నడిపేందుకు అరగంట పడుతోందంటే అతిశయోక్తి కాదు. వర్షాలు, మండుటెండల్లో గంటల తరబడి ట్రాఫిక్‌లో ఉండి పోవాల్సి వస్తోందని ద్విచక్ర వాహనదారులు అంటున్నారు. దీనికి తోడు రోజు రోజుకూ నగరంలో వాహనాల సంఖ్య పెరుగుతోంది.  ప్రమాదాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. సి.క్యాంప్‌ సెంటర్‌ నుంచి బైక్‌పై బయలుదేరిన వ్యక్తి కొత్త బస్టాండ్‌ చేరుకోవడానికి అరగంట పడుతోంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్ర సమయాల్లో సమస్య మరీ తీవ్రంగా ఉంటోంది. మధ్యాహ్నం సమయాల్లో ఎండలో ద్విచక్ర వాహనదారులు పడుతున్న బాధలు వర్ణనాతీతం.


విస్తరణ ప్రతిపాదన లేదు


నగరంలో రోడ్ల విస్తరణ ప్రతిపాదన ప్రత్యేకించి ఏమీ లేదు. పాత బస్టాండ్‌ నుంచి కింగ్‌ మార్కెట్‌, కిడ్స్‌ వరల్డ్‌ పార్కు నుంచి జోహరాపురం రోడ్డు వరకు రోడ్లకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను మాత్రమే తొలగిస్తాం. దీనివల్ల కొంత వరకు నగరంలో ట్రాఫిక్‌ సమస్య తీరుతుందని అనుకుంటున్నాం. 


- శ్రీనివాస్‌ చైతన్య, ఏసీపీ, నగర పాలక సంస్థ  

Updated Date - 2021-11-15T06:15:44+05:30 IST