తిరుపతిలో మనమే పోటీ చేద్దాం

ABN , First Publish Date - 2021-01-22T09:25:48+05:30 IST

తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థినే బరిలోకి దింపాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) అభిప్రాయపడింది.

తిరుపతిలో మనమే పోటీ చేద్దాం

  • రాష్ట్ర బీజేపీ మనల్ని పట్టించుకోవట్లేదు
  • జనసేన పీఏసీ భేటీలో సభ్యుల ఆవేదన
  • బీజేపీతో చర్చించి అభ్యర్థిని ప్రకటిస్తాం
  • వారం రోజుల్లో తేలిపోతుంది: పవన్‌


తిరుపతి, జనవరి 21(ఆంధ్రజ్యోతి): తిరుపతి ఉప ఎన్నికల్లో జనసేన అభ్యర్థినే బరిలోకి దింపాలని ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) అభిప్రాయపడింది. అంతేగాకుండా బీజేపీ కేంద్ర నాయకత్వం ఇచ్చిన గౌరవాన్ని రాష్ట్ర నాయకులు ఇవ్వడంలేదని పీఏసీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ అధ్యక్షతన పీఏసీ సమావేశం గురువారం తిరుపతిలో జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, తిరుపతి లోక్‌సభ ఉప ఎన్నికపై పీఏసీ సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగింది. తిరుపతి ఉప ఎన్నికల్లో పార్టీ అభ్యర్థినే బరిలోకి దించాలని సభ్యులు గట్టిగా డిమాండ్‌ చేశారు. దీనిపై పవన్‌ కల్యాణ్‌ స్పందిస్తూ బీజేపీ అధిష్ఠానంతో చర్చించి వారం రోజుల్లో ఈ అంశాన్ని తేల్చేద్దామని చెప్పారు.


అభ్యర్థి ఎవరైనా గెలుపు కోసం అంతా కలిసి పనిచేయాలని పార్టీ నేతలకు సూచించారు. జనసేన కార్యకర్తలపై అధికార వైసీపీ చేస్తున్న దాడులకు ఎవరూ భయపడవద్దని పవన్‌ కల్యాణ్‌ ధైర్యం చెప్పారు. దాడులపై ఎలా స్పందించాలో నాయకులతో చర్చించారు. రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమైన వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ‘చలో అసెంబ్లీ’ నిర్వహిద్దామని చెప్పినట్టు తెలిసింది. కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, సభ్యులు సమావేశంలో పాల్గొన్నారు. పీఏసీ సమావేశం అనంతరం శ్రీవారి దర్శనం కోసం పవన్‌ తిరుమల వెళ్లారు.

Updated Date - 2021-01-22T09:25:48+05:30 IST