పోలీసు త్యాగాన్ని స్మరించుకుందాం

ABN , First Publish Date - 2020-10-21T08:48:47+05:30 IST

అక్టోబర్‌ 21, పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఆ సందర్భంగా వారిని స్మరించుకుంటూనే పోలీసు వ్యవస్థ మన దేశంలో నాలుగు రోడ్ల...

పోలీసు త్యాగాన్ని స్మరించుకుందాం

రాజకీయ ఒత్తిడిని అధిగమించి తన విధులను నిర్వర్తించే ఏ పోలీసు అధికారినైనా ప్రజలూ ప్రభుత్వాలూ నెత్తిమీద పెట్టుకుంటాయి! పోలీసులు తమ విధులను చట్టం చెప్పిన విధంగా నిర్వర్తించటం మొదలు పెడితే, ప్రజలకు వారి పక్షాన నిలిచే వెసులుబాటు కలుగుతుంది. 


అక్టోబర్‌ 21, పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఆ సందర్భంగా వారిని స్మరించుకుంటూనే పోలీసు వ్యవస్థ మన దేశంలో నాలుగు రోడ్ల కూడలి (క్రాస్ రోడ్స్) లో ఉందని పలువురు అనే మాటను ఇక్కడ ప్రస్తావించుకుందాం. నిజంగానే పోలీసులు ఏ మార్గం దిశగా తమ వ్యవస్థను తీసుకొని వెళ్ళాలనే మీమాంసను ప్రస్తుత పరిస్థితులు కల్పించాయా అని ఎవరైనా సూటిగా ప్రశ్నిస్తే ‘అవును’ అని సమాధానం ఇవ్వక తప్పదు! 


‘పోలీసు సంస్కరణల’ గురించి ఇబ్బడి ముబ్బడిగా కమిషన్లు నివేదికలు ఇచ్చాయి గానీ, వాటి అమలు మాత్రం అరకొరగానే జరిగింది. నిజాయితీగా సంస్కరణలు తలపెట్టిన పరిస్థితులు లేవు. ‘సంస్కరణలు తలపెట్టండి’ అంటూ న్యాయ స్థానాలు సూచించినప్పుడు, గత్యంతరం లేక ‘ఏవో కొన్ని చేశాం, చేస్తున్నాం’ అని చెప్పటమే గాని చాలా సంస్కరణలు, సూచనలు పక్కన పడేసిన దాఖాలాలే ఎక్కువ కనపడతాయి. 


పోలీసు శాఖలో సంస్కరణలు ఎవరి కోసం? ప్రజల కోసం. ప్రజలు ప్రభుత్వాలను ఎన్నుకోవాలనే ధ్యాసలోనే నిరంతరం వుంటున్నారు గానీ, పోలీసు పనిలో మార్పు తీసుకొనిరావటం ప్రభుత్వ బాధ్యత అని నిలదీయటం లేదు. పోలీసులు తమంతట తామే చట్టపరంగా తమకున్న అధికారాలను వినియోగించుకొని శాఖాపరంగా గణనీయ మైన మార్పు తీసుకొని వచ్చే ప్రయత్నం చేయొచ్చు. కానీ అలాంటి పోలీసు నాయకత్వం దేశంలోనే కరువైన విచిత్ర పరిస్థితి! ఒక చిన్న మార్గదర్శక సూత్రం ద్వారా మొత్తం పోలీసు శాఖను ప్రజలకు జవాబుదారీగా, సహాయకారిగా మార్చటమే గాదు, చట్టాన్ని గౌరవించే దిశగా వ్యవస్థను నడిపించవచ్చు. 


పోలీసులు చట్టానికి బాధ్యులు. అది రాజ్యాంగం దఖలు పర్చిన బాధ్యత. నేరం ఎవరు చేసినా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయటం పోలీసుల బాధ్యత. ఆ తర్వాత పరిశోధన మొదలవుతుంది. నేర నిరూపణ ఆ తర్వాత జరుగుతుంది. ఆదిలోనే హంసపాదు వేస్తున్నారు పోలీసులు. నేరాన్ని నమోదు చేసే పోలీసుల అధికారాన్ని ఏ రాజకీయ నాయకుడూ, ప్రభుత్వంలోని పెద్దలూ కాదనలేరు! కానీ వారు తమ పలుకుబడిని ఉపయోగించుకొని నయానో భయానో పోలీసు స్టేషన్‌ స్థాయిలో రాజకీయం నడిపి, అధికారం వినియోగించి అడ్డుకట్ట వేస్తున్నారు! తమ దృష్టికి వచ్చిన అలాంటి సంఘటనలను కూడా బాధ్యులైన ఉన్నతాధి కారులు నిలువరించలేకపోతున్నారు. 


ఈ విషయంలో కిందిస్థాయి వారిని తప్పుపట్టలేం! పైస్థాయి వారు, ఆలిండియా సర్వీసులో తమ పర బేధం లేకుండా ఉద్యోగ విధులను నిర్వర్తించటానికి ఎంపిక కాబడ్డవారు గూడా ఏ కారణం చేతనో ఆ పని చేయలేకపోతే ప్రజలు ఎవరిని తప్పు పట్టాలి? పోలీసులు తమ విధులను చట్టం చెప్పిన విధంగా నిర్వర్తించటం మొదలు పెడితే, ప్రజలకు వారి పక్షాన నిలిచే వెసులుబాటు కలుగుతుంది. 


రాజకీయ ఒత్తిడిని అధిగమించి తన విధులను నిర్వర్తించే ఏ పోలీసు అధికారినైనా ప్రజలూ, ప్రభుత్వాలూ నెత్తిమీద పెట్టుకుంటాయి. స్వలాభం కోసం ఒత్తిడి వుందని కుంటి సాకు చెప్పే ఉద్యోగులే ఎక్కువ అవుతున్నప్పుడు రాజకీయాలు నడుస్తూనే ఉంటాయి. రాజకీయాల్లో ఉన్న వారికి అయిదేళ్ళకు మించి అధికారం చాలా తక్కువసార్లు ప్రజలు ఇస్తారు. కానీ ఉద్యోగస్థులు తమ ఉద్యోగాల్లో కనీసం ఇరవై ఐదు ఏళ్ళ వరకు ఉండే వెసులుబాటు ఉంది! 


ఇతర దేశాల్లో పోలీసులను గౌరవించటానికి అనేక కారణాలు ఉన్నాయి. వాటిని ఏకరువుపెట్టి మన పోలీసులను తక్కువ చేయటం చాలా తప్పు. నిజానికి ఇతర దేశాల్లోని పోలీసులు మన పోలీసుల వృత్తి నైపుణ్యాన్ని చూసి అచ్చెరువొందిన సంఘటనలు ఉన్నాయి. అయితే ఇతర దేశాల్లో వృత్తి నిపుణత వ్యవస్థీకృతమైంది. ఇక్కడ వ్యక్తిగతమైంది. చట్టప్రకారం అధికారాలు, బాధ్యతలూ పోలీసులు నిర్వర్తిస్తేనే ఇక్కడ కూడా వృత్తి నైపుణ్యం వ్యవస్థీకృతమవుతుంది. ఆ దిశగా పోలీసు శాఖ పనిచేయాలని ఒక పౌరుడు ఆశించటంలో తప్పులేదు. నిజానికి పోలీసుల నిరంతర కృషికి వెలకట్టే షరాబు ఎవరూ లేరు. కనీసం ఈ సంస్మరణ దినోత్సవం సందర్భంగానైనా సరే వారి త్యాగాలను తలుచుకొనే ప్రయత్నం చేస్తున్నారంటే – పోలీసుల పట్ల ఇంకా నమ్మకం వుంది. ఆ నమ్మకం సడలకుండా వుండాలంటే ఎలాంటి అరమరికలు లేకుండా చట్టాలను అమలుపరిస్తే చాలు! ‘పోలీసు బాబాయి’ అని ప్రేమగా ఆదరిస్తారు. 

రావులపాటి సీతారాంరావు

నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం

Updated Date - 2020-10-21T08:48:47+05:30 IST