గంజాయి పీడ విరుగుడుకు కృషిచేద్దాం: డీఎస్పీ

ABN , First Publish Date - 2021-10-24T04:53:12+05:30 IST

గంజాయి పీడ విరుగుడుకు కృషిచేద్దాం: డీఎస్పీ

గంజాయి పీడ విరుగుడుకు కృషిచేద్దాం: డీఎస్పీ
కొడంగల్‌: సమావేశంలో మాట్లాడుతున్న డీఎస్పీ జీ.శ్రీనివాస్‌

కొడంగల్‌/తాండూరు రూరల్‌/ధారూరు/పెద్దేముల్‌/దోమ/మోమిన్‌పేట/వికారాబాద్‌/బషీరాబాద్‌: గంజాయి మహమ్మారి పీడ విరుగుడుకు కృషి చేద్దామని పరిగి డీఎస్పీ జి.శ్రీనివాస్‌ పిలుపునిచ్చారు. కొడంగల్‌ పట్టణంలోని కేఎస్‌వీ ఫంక్షన్‌హాల్‌లో శనివారం బొంరాస్‌పేట్‌, దౌల్తాబాద్‌, కొడంగల్‌ మండలాల ఎస్‌ఐల, పోలీసు సిబ్బందితో నిర్వహించిన సమావేశానికి ఎస్పీ హాజరై మాట్లాడారు. గంజాయి అత్యంత ప్రమాదకరమని, సాగు చేయడం, అమ్మడం, కొనుగోలు చేయడం నేరమని అన్నారు. గంజాయిని అరికట్టేందుకు ప్రభుత్వం సీరియస్‌గా ఉందని తెలిపారు. గంజాయి నిర్మూలనలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. గంజాయి సాగు, అమ్మకాలు, రవాణా లాంటి సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు. అనంతరం కొడంగల్‌లోని పలు దుకాణాల్లో, ఆర్టీసీ బస్టాండ్‌లో పోలీసులతో కలిసి సోదాలు నిర్వహించారు. సమావేశంలో కొడంగల్‌ సీఐ అప్పయ్య, ఎస్‌ఐ సామ్యానాయక్‌, బొంరాస్‌పేట్‌, దౌల్తాబాద్‌, కొడంగల్‌ మండలాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అదేవిధంగా తాండూరురూరల్‌ సర్కిల్‌ పరిధిలోని బషీరాబాద్‌, యాలాల, పెద్దేముల్‌, కరన్‌కోట్‌ పోలీసుస్టేషన్ల పరిధిలోని పాన్‌షాపులో, టీ కొట్టుల్లో గుట్కా, గంజాయి, మద్యం వంటి విక్రయాలు చేపడితే కఠినచర్యలు తప్పవని రూరల్‌ సీఐ జలందర్‌రెడ్డి హెచ్చరించారు. శనివారం తాండూరు మండలం కరన్‌కోట్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలోని శశిప్రభ థియేటర్‌, గౌతాపూర్‌, చెంగోల్‌ తదితర ప్రాంతాల్లో పాన్‌షాపులు, టీ కొట్లలో విస్తృతంగా తనిఖీ  నిర్వహించారు. ధారూరు మండలంలోని ధారూరు, స్టేషన్‌ ధారూరు గ్రామాల్లో సీఐ తిరుపతి రాజు ఆధ్వర్యంలో పీఎస్‌ఐ రాథోడ్‌ రాజు,  పోలీసు సిబ్బంది పాన్‌షాపుల్లో తనిఖీలు నిర్వహించారు. ధారూరులో ఆరు పాన్‌షాపులు, స్టేషన్‌ ధారూరులో రెండు పాన్‌షాపుల్లో తనిఖీలు చేశామని సీఐ తిరుపతిరాజు తెలిపారు. గంజాయి వంటి మత్తుపదార్థాలు తనిఖీల్లో పట్టుబడలేదని, ఇక ముందు కూడా తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. గంజాయి సమాచారం ఉంటే సెల్‌:9440627254  నెంబరుకు సమాచారం ఇవ్వాలని సీఐ కోరారు.  పెద్దేముల్‌ మండల కేంద్రంతోపాటు మంబాపూర్‌, రుక్మాపూర్‌ గ్రామాల్లో కిరాణా దుకా ణాలు, పాన్‌షాపుల్లో ఇన్‌చార్జి ట్రైనీ ఎస్‌ఐ కృష్ణకాంత్‌, సిబ్బందితో కలిసి నిషేధిత గుట్కాల గురించి తనిఖీలు నిర్వహించారు. పెద్దేముల్‌ గ్రామంలోని ఆరీఫ్‌ పాన్‌షాప్‌లో రూ.4500ల విలువ చేసే 1034 నిషేధిత గుట్కా ప్యాకెట్లు, మంబాపూర్‌ గ్రామంలో రూ.3600ల విలువ చేసే 2400 గుట్కా ప్యాకెట్లు లభించినట్లు వెల్లడించారు. దోమ మండల పరిధి బాసుపల్లి ప్రధాన రోడ్డుపై పోలీసులు వాహన తనిఖీ చేశారు. మోమిన్‌పేట మండలంలోని పాన్‌షాప్‌లు, కిరాణా దుకాణాలను సీఐ వెంకటేశం ఆధ్వర్యంలో తనిఖీలు చేశారు. లభ్యమైన గుట్కాలను స్వాధీనం చేసుకుని దుకాణ యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. త్వరలో గ్రామాల్లోనూ తనిఖీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. వికారాబాద్‌ పట్టణంలోని పాన్‌ షాపుల్లో సీఐ రాజశేఖర్‌ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. పలు దుకాణాల్లో లభ్యమైన గుట్కా ప్యాకెట్లను సీజ్‌చేసి పదిమంది నిర్వాహకులపై కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బషీరాబాద్‌లో ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి ఆధ్వర్యంలో మూడు బృందాలుగా పోలీసులు విడిపోయి ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు. మైలపూరం సుధాకర్‌ దుకాణంలో నిషేదిత గుట్కాలు భారీగా లభ్యం కాగా తాటికొండ సుభాష్‌, వెంకట్‌రెడ్డి, అనిల్‌పాన్‌ షాపులో గుట్కాలు దొరికాయి. ఒకరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

పంట పొలాల్లో గంజాయి 

మర్పల్లి: పంటపొలాల్లో పండిస్తున్న గంజాయి మొక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్న సంఘటన మండలంలోని కల్కోడలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సత్యనారాయణ పొలంలో చాటుమాటుగా గంజాయి పండిస్తున్నాడని మోమిన్‌పేట ఎక్సైజ్‌ కార్యాలయానికి సమాచారం అందింది. దీంతో ఎక్సైజ్‌ సీఐ శ్రీలత తమ బృందంతో సత్యనారాయణ పొలంలో ఆకస్మిక తనిఖీలు చేశారు.  పంట పొలాల మధ్య 13 గంజాయి మొక్కలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు శ్రీలత తెలిపారు. 

Updated Date - 2021-10-24T04:53:12+05:30 IST