‘టెక్నో సమ్రాట్‌’గా అవతరిద్దాం

ABN , First Publish Date - 2021-07-20T08:31:27+05:30 IST

చైనా ఇటీవల కుజ గ్రహం పైకి ఒక వ్యోమనౌకను విజయవంతంగా ప్రయోగించింది. సూర్యునిలో ఉండే ఉష్ణోగ్రతలకు సమస్థాయి ఉష్ణోగ్రతలను...

‘టెక్నో సమ్రాట్‌’గా అవతరిద్దాం

చైనా ఇటీవల కుజ గ్రహం పైకి ఒక వ్యోమనౌకను విజయవంతంగా ప్రయోగించింది. సూర్యునిలో ఉండే ఉష్ణోగ్రతలకు సమస్థాయి ఉష్ణోగ్రతలను తమ ప్రయోగశాలల్లో సృష్టించడంలో చైనీస్ శాస్త్రవేత్తలు సఫలమయ్యారు. చైనా సొంతంగా అత్యాధునిక యుద్ధవిమానాలను తయారు చేసుకుంటోంది. ఇవి అసాధారణ విజయాలు, సందేహం లేదు. మరి  వీటిని చైనా ఎలా సాధించగలిగింది? అధునాతన సాంకేతికతలను సృష్టించేందుకు భారీ మదుపులు చేయడం వల్లే ఆ విజయాలు సాధ్యమయ్యాయి. వైజ్ఞానిక, సాంకేతిక ప్రగతి సాధనలో చైనా కంటే మనం చాలావెనుకబడి ఉన్నామని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 


మన ప్రభుత్వరంగ సంస్థల మొత్తం మార్కెట్ మూలధనీకరణ విలువ రూ.20 లక్షల కోట్లు. మన ప్రభుత్వ వార్షిక మూలధన వ్యయాల (రూ.5.5 లక్షల కోట్లు)కు ఇది నాలుగు రెట్లు అధికం. కొన్ని ప్రభుత్వరంగ సంస్థలు యథావిధిగా కొనసాగడం తప్పనిసరి. స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇందుకొక ఉదాహరణ. ఇది దేశవ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ క్లియరింగ్ హౌజెస్‌ను నిర్వహిస్తోంది.  వివిధ సంస్థల మధ్య ఉన్న పరస్పర రుణబాధ్యతలను లెక్కించి ఏయే సంస్థలు నికరంగా ఎంతెంత మొత్తాలను ఏయే సంస్థలకు చెల్లించాలో తేల్చి చెప్పే సంస్థే క్లియరింగ్ హౌజ్‌. మరొక ఉదాహరణ సెంట్రల్ బోర్డ్ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్. ఇది దేశవ్యాప్తంగా పాఠశాలలను క్రమబద్ధీకరిస్తుంది ఇటువంటి ప్రభుత్వరంగ సంస్థలు ప్రభుత్వాలు మాత్రమే సమకూర్చగల ప్రజోపయోగ అంశాలను అనగా విద్య, ప్రజారోగ్యసేవలు, గ్రంథాలయాలు, వస్తుప్రదర్శనశాలలు మొదలైన వాటిని అందిస్తాయి. 


వీటిని సమకూర్చేవి మినహా ఇతర ప్రభుత్వరంగ సంస్థలు ఏవీ అత్యావశ్యకమైనవి కావు. ఉదాహరణకు ఆర్థికవ్యవస్థకు ఎటువంటి నష్టం వాటిల్లకుండా ఎస్‌బిఐమినహా ఇతర ప్రభుత్వరంగ బ్యాంకులను సులువుగా ప్రైవేటీకరించవచ్చు. ఇందుకు ఏమాత్రం సంశయించనవసరం లేదు.


చెప్పవచ్చిందేమిటంటే బ్యాంకింగ్ మొదలైన సేవలు అందించడంలో ప్రభుత్వం పాత్ర అనావశ్యకం. ఎందుకంటే వివిధ ఆర్థిక కార్యకలాపాలలో ప్రైవేట్‌ సంస్థలు అత్యంత సమర్థంగా వ్యవహరిస్తూ ప్రజల ఆదరాన్ని పొందుతున్నాయి. క్లియరింగ్ హౌజెస్ నిర్వహణ, పాఠశాలల క్రమబద్ధీకరణ మొదలైన అనివార్య సేవలను అందించే ప్రభుత్వరంగ సంస్థలు మినహా మిగతా వాటిని ప్రైవేటీకరించడమే శ్రేయస్కరం. అలా చేయడం వల్ల రూ.15 లక్షల కోట్లు సమకూరుతాయి. అత్యాధునిక సాంకేతికతల అభివృద్ధికి మదుపు చేసేందుకు ఈ నిధులను ఉపయోగించుకోవచ్చు. నవీన సాంకేతికతలతో మాత్రమే మనం ప్రపంచ ఆర్థికశక్తులతో పోటీ పడగలం.


కొవిడ్-19 వాక్సిన్ ధరలో సగ భాగాన్ని ఆస్ట్రాజెనెకా, ఇతర కంపెనీలకు రాయల్టీగా చెల్లిస్తున్నామనే విషయాన్ని మనం విస్మరించకూడదు. కొవిడ్ వ్యాక్సిన్లను సృష్టించేందుకు భారీగా మదుపు చేసి ఉంటే ఇంత పెద్దమొత్తాలను విదేశీ కంపెనీలకు చెల్లించవలసిన అవసరం మనకు ఉండేది కాదు. ఇప్పటికైనా భారత ప్రభుత్వం వివిధ నవీన సాంకేతికతల అభివృద్ధికి తక్షణమే గణ నీయంగా మదుపు చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది.


కృత్రిమ మేధ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్-ఎఐ) వాటిలో మొదటిది. ఒక రోగికి సంబంధించిన ఆరోగ్య సమాచారాన్ని సమగ్రంగా ప్రాసెస్ చేసి, చికిత్స పద్ధతులను నిర్ణయించడంలో డాక్టర్లకు తోడ్పడేందుకు ‘వాట్సన్’ అనే ప్రాజెక్ట్‌ను ఐబిఎమ్ నిర్వహిస్తోంది. వివిధ ప్రత్యామ్నాయ చికిత్స పద్ధతులను డాక్టర్‌కు సమకూర్చి రోగికి సత్వర స్వస్థత కల్పించేందుకు ఎఐ ప్రోగ్రామ్స్‌ విశేషంగా తోడ్పడుతున్నాయి. వైద్యరంగంలో పురోగతికి మనం తప్పక ఎఐ అభివృద్ధి కోసం మదుపు చేయవలసి ఉంది. రెండోది ఇంటర్నెట్ ఆప్ థింగ్స్ (ఐఒటి). కంపెనీల కార్యాలయాలు కంప్యూటర్ల ద్వారా మెరుగైన భద్రతను సమకూర్చుకోవచ్చు. చోరీ జరిగే అవకాశాల గురించి ముందస్తుగా హెచ్చరించడం ద్వారా ఆటోమెటిక్‌గా ద్వారాల మూసివేతకు, పోలీసులకు సమాచార మందించడానికి కంప్యూటర్లు తోడ్పడుతాయి. 


మూడోది జన్యుమార్పిడి సాంకేతికత. దీనితో మానవాళికి విశేష లబ్ధిని కల్పించేందుకు ఎంతైనా అవకాశముంది. అధిక దిగుబడుల నిచ్చే విత్తనాల సృష్టి ఇందుకొక నిదర్శనం. నాలుగవది ఆయుర్వేద, హోమియోపతి, యునాని మొదలైన సంప్రదాయక వైద్యవిధానాల ఆధునికీకరణ, అభివృద్ధికి విశేషస్థాయిలో మదుపులు చేయవలసిన అవసరముంది. అలోపతి వైద్యానికి అనేక పరిమితులు ఉన్నాయన్న సత్యం అంతకంతకూ రుజువు అవుతున్నందున సంప్రదాయ వైద్యాలను అభివృద్ధిపరచుకోవలసి ఉంది. అలోపతి వైద్యం యాంటీబయోటిక్స్‌ను ప్రతిఘటించే సూక్ష్మక్రిముల సంబంధిత అంటువ్యాధుల విజృంభణకు దారి తీస్తోంది. ఈ వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని ఆఫ్రికన్ ఆదివాసీ వైద్యాలతో సహా ప్రత్యామ్నాయ వైద్యవిధానాల ఆధునికీకరణ, అభివృద్ధికి ప్రభుత్వం భారీనిధులను వెచ్చించడం చాలా ముఖ్యం. 


వాణిజ్య వ్యోమనౌకను ప్రయోగించేందుకు వర్జిన్‌ గెలాక్టిక్ అనే సంస్థ సంసిద్ధమవుతోంది. వివిధ దేశాలకు చెందిన అనేక ఉపగ్రహాలను వాణిజ్య ప్రాతిపదికన ప్రయోగించడంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఇప్పటికే అనేక ఘనవిజయాలను సాధించింది. ఈ దృష్ట్యా వాణిజ్య వ్యోమనౌకలను ప్రయోగించేందుకు ప్రభుత్వం ఒక ప్రత్యేక ప్రభుత్వరంగ సంస్థను ఏర్పాటు చేయాలి. ఇంకా పలు రంగాలలో నవీన సాంకేతికతలను అభివృద్ధిపరిచేందుకు ప్రభుత్వం భారీ పెట్టుబడులు పెట్టవలసిన అవసరముంది.


బ్యాంకులు, పౌర విమానయాన సంస్థలు, చమురు కంపెనీలు మొదలైన అప్రధాన ప్రభుత్వరంగ సంస్థలనుప్రభుత్వం సత్వరమే ప్రైవేటీకరణ చేయాలి. తద్వారా సమకూరే డబ్బును కృత్రిమ మేధ, జన్యుమార్పిడి మొదలైన అధునాతన సాంకేతికతల అభివృద్ధికి మదుపు చేయాలి. మన సార్వభౌమత్వాన్ని సంపూర్ణంగా సంరక్షించుకునేందుకు వినూత్న సాంకేతికతల సృష్టి విశేషంగా తోడ్పడుతుంది. 


భరత్ ఝున్‌ఝున్‌వాలా

(వ్యాసకర్త ఆర్థికవేత్త, బెంగుళూరు ఐఐఎం రిటైర్‌్డ ప్రొఫెసర్‌)

Updated Date - 2021-07-20T08:31:27+05:30 IST