అమ్మకు ఉద్యోగం చేయలేనని చెప్పా!

ABN , First Publish Date - 2021-04-18T05:30:00+05:30 IST

వేసవి గురుతులు... చిన్ననాటి సంగతులు...చదువుకు సంబంధించిన విశేషాలు... కరోనా కాలంలో తీసుకుంటున్న జాగ్రత్తలు...‘నవ్య’తో ప్రియా ప్రకాశ్‌

అమ్మకు ఉద్యోగం చేయలేనని చెప్పా!

వేసవి గురుతులు... చిన్ననాటి సంగతులు...చదువుకు సంబంధించిన విశేషాలు... కరోనా కాలంలో తీసుకుంటున్న జాగ్రత్తలు...‘నవ్య’తో ప్రియా ప్రకాశ్‌ వారియర్‌ ముచ్చట్లు!


అమ్మ  ఎంబీఏ చేయమంటోంది!

గత ఏడాది బీకాం పూర్తి చేశా. ఇక, పీజీ చేసే ఆలోచన లేదు. నటనపైనే నా దృష్టంతా! డిగ్రీ చేసేటప్పుడు కొన్ని అవకాశాలు కోల్పోయా. అందుకే, ఇప్పుడు రిస్క్‌ తీసుకోలేను. ఇక్కడ ఓ విషయం చెప్పాలి... చిన్నతనం నుంచి నాకు నటన, సినిమాలపై ఆసక్తి ఉండేది. కానీ, మా అమ్మానాన్న సీరియస్‌గా తీసుకోలేదు. యాక్టింగ్‌ను కెరీర్‌గా ఎంచుకుంటానని అనుకోలేదు. నేను ఆడిషన్స్‌ చేస్తున్నట్టు చెప్పగానే... ‘ఆర్‌ యు సీరియస్‌?’ అని అడిగారు. ‘అవును’ అని చెప్పా. నెట్టింట కన్నుగీటే సన్నివేశం వైరల్‌ అయ్యే సమయానికి నేను డిగ్రీ తొలి సెమిస్టర్‌లో ఉన్నాను. అప్పుడు ‘నువ్వు డిగ్రీ చేయాలనుకుంటే చెయ్‌. లేదంటే వద్దు. నటనకు డిగ్రీతో సంబంధం ఏముంది?’ అన్నారు నాన్న. కానీ, అమ్మ ఒప్పుకోలేదు. దాంతో బీకాం పూర్తి చేశా.


పరీక్షల ముందువరకూ నా సబ్జెక్టులు ఏంటో నాకు తెలిసేది కాదు. నాలుగు రోజుల ముందు స్నేహితులతో కలిసి చదివేదాన్ని. అయితే, అటెండెన్స్‌ పెద్ద ఇష్యూ అయ్యింది. కాలేజీలో మాట్లాడి పరీక్షలకు అనుమతి తీసుకున్నా. ఇప్పుడు అమ్మ ఎంబీఏ చేయమంటోంది. ‘అమ్మా... ఎందుకు? వై?? నాకు 9-5 ఉద్యోగం చేయాలని లేదు. యాక్టింగ్‌ ఇంట్రెస్ట్‌’ అని చెప్పేశా. ‘పీజీ ఉంటే మంచిది కదా! చాలామంది డాక్టర్‌ చదివి యాక్టింగ్‌ చేస్తున్నారు’ అంటుంది. ‘అమ్మా... ఒకవేళ నేనింకా చదుకోవాలని నువ్వు భావిస్తే విదేశాలు వెళ్లి సినిమాకు సంబంధించినది ఏదో ఒకటి చదువుతా’ అన్నాను. ఇప్పుడు కాదు కానీ... సినిమాల్లో నాకు మంచి బ్రేక్‌ వచ్చిన తర్వాత, కొన్నాళ్లు విరామం తీసుకున్నా పర్వాలేదని అనిపించినప్పుడు సినిమాలకు సంబంధించిన కోర్స్‌ చేస్తా.




వేసవి అంటే కజిన్స్‌ను కలవడమే!

నా చిన్నతనంలో వేసవి సెలవుల్లో కజిన్స్‌, ఫ్రెండ్స్‌ను కలిసేవాళ్లం! మూడేళ్ల నుంచి అసలు ఖాళీ ఉండటం లేదు. ఎవరినీ కలవడం కుదరడం లేదు. సినిమాలు, షూటింగులు, పరీక్షలతోనే సరిపోతోంది. కిందట వారం విషు పండక్కి(మలయాళ సంవత్సరాది) ఇంటికి వెళ్లా. చాలా రోజులకు బంధుమిత్రులను కలిశా. అందరూ హ్యాపీ! ఇంకొకటి... వేసవి అంటే నాకు గుర్తొచ్చేది కరిక్కు (కొబ్బరినీళ్లు). ఎక్కువగా తాగుతా. కేరళలో కొబ్బరిచెట్లు ఎక్కువ కదా!




విజయం తమ్ముడిదే!

నాకు ఆటలు ఆడడం ఇష్టం ఉండదు. ఆన్‌లైన్‌ గేమ్స్‌ అంతగా నచ్చవు కూడా! గేమ్స్‌ అంటే బోర్‌. నా ఫోనులో గేమింగ్‌ యాప్స్‌ ఉండవు. ఒకవేళ ఆటలు ఆడాలంటే తమ్ముడితో కలిసి పీఎస్‌4 ఆడతా. ఎప్పుడూ తమ్ముడే గెలుస్తాడు. పీఎస్‌4లో వాడు ఎక్స్‌పర్ట్‌. ఇప్పుడు మా కజిన్స్‌ అంతా కలిస్తే పబ్జీ లాంటి ఆన్‌లైన్‌ గేమ్స్‌ ఆడుతూ కనిపిస్తారు. మా చిన్నతనంలో అలా ఉండేది కాదు. అప్పుడు కంప్యూటర్లు, ఫోన్లు ఎక్కడివి? ఇసుకలో గళ్లు గీసి రాళ్లతో ఆటలు ఆడుకునేవాళ్లం. ఎంతైనా ఆ రోజులే వేరు.




అప్పుడు ఇంట్లోనూ మాస్క్‌ తీయను!

అమ్మానాన్న, మా నానమ్మ, తాతయ్య, నేను, తమ్ముడు... మేమంతా ఒకే ఇంట్లో ఉంటాం. ఇంట్లో 60 ఏళ్లు దాటిన వ్యక్తులు ఉన్నప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి కదా! కరోనా నేపథ్యంలో ప్రతిరోజూ ఆవిరి పడుతున్నా. వేడి నీళ్లలో పసుపు వేసుకుని తాగుతున్నా. షూటింగులు లేదా ఇతర నగరాల నుంచి ఇంటికి వెళ్లినప్పుడు... రెండు రోజులు ఎవరి దగ్గరకు వెళ్లను. దూరంగా ఉంటా. ముఖ్యంగా నానమ్మ, తాతయ్యకు! ఇంట్లోనూ మాస్క్‌ ధరించే తిరుగుతా. అసలు తీయను! రెండు రోజుల తర్వాత ఎటువంటి లక్షణాలు లేవనీ, అంతా బావుందని అనిపిస్తే... అందరితో కలిసిపోతా.






నా వ్యక్తిత్వంలో  ఏ మార్పు లేదు!

హీరోయిన్‌ అయ్యాక నా వ్యక్తిత్వంలో ఎటువంటి మార్పు లేదు. అంతకు ముందు ఎలా ఉన్నానో... ఇప్పుడూ అలానే ఉన్నాను. నటన నా వృత్తి... అంతే! జీవితం నా వ్యక్తిగతం! వృత్తిపరంగానూ, వ్యక్తిగతంగానూ ఒకేలా ఉంటా. ఖాళీగా ఉన్నప్పుడు స్నేహితులతో మాట్లాడతా. ఇంకొకటి, మా మధ్య సినిమా చర్చలు ఉండవు. ర్యాండమ్‌ థింగ్స్‌, సరదా కబుర్లు చెప్పుకొంటాం. ఎంజాయ్‌ చేస్తాం. సినిమాల గురించి అమ్మానాన్నతో చర్చిస్తా.


Updated Date - 2021-04-18T05:30:00+05:30 IST