పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం

ABN , First Publish Date - 2021-04-23T07:47:36+05:30 IST

విశ్వవ్యాప్తంగా రోజు రోజుకూ తలెత్తుతున్న వాతావరణ మార్పులు..

పర్యావరణాన్ని పరిరక్షించుకుందాం

  • రాష్ట్ర ప్రజలకు సీఎం కేసీఆర్‌ పిలుపు 
  • ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): విశ్వవ్యాప్తంగా రోజు రోజుకూ తలెత్తుతున్న వాతావరణ మార్పులు.. తద్వారా మానవ జాతికి కలుగుతున్న కీడు మనిషి స్వయంకృతాపారాధమనే విషయాన్ని అందరమూ గ్రహించాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. కరోనా వంటి మహమ్మారితో పొంచి ఉన్న ప్రమాదాలపై అవగాహన పెంచుకొని, పర్యావరణాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మన పిల్లల కోసం డబ్బు, ఆస్తులు కూడబెట్టడం మాత్రమే మనం చేయాల్సిన పనికాదన్నారు. ధరిత్రి సంరక్షణ పట్ల మనం ఎంత బాధ్యతగా వ్యవహరిస్తే.. భవిష్యత్తు తరాలకు అంత ఆనందం పంచినవాళ్లమవుతామని చెప్పారు. ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. మనం నివసిస్తున్న ప్రాంతంలో పర్యావరణాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. 


నిలకడగానే సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం

జగదేవ్‌పూర్‌: కరోనా బారిన పడిన సీఎం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిసింది. బుధవారం రాత్రి ఆయనకు సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రానికి వెళ్లారు.


భూమిని కాపాడాలంటే మొక్కలు నాటాలి: ఇంద్రకరణ్‌

సహజ వనరులను ఇష్టానుసారంగా వినియోగించడం వల్లే పర్యావరణానికి హాని కలుగుతోందని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఫలితంగా ఓజోన్‌ పొర క్షీణిస్తోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం ప్రపంచ ధరిత్రీ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ భూమిని కాపాడాలంటే మానవుని జీవనశైలిలో మార్పు రావాలన్నారు. కాగా, అటవీ ఉద్యోగుల సౌకర్యార్థం అరణ్యభవన్‌లో వ్యాక్సినేషన్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశారు.

Updated Date - 2021-04-23T07:47:36+05:30 IST