నేలమ్మను కాపాడుకుందాం

ABN , First Publish Date - 2021-04-22T06:03:26+05:30 IST

పర్యావరణ పరిరక్షణకు మద్దతు ఇచ్చేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రీ దినోత్సవం జరుపుకుంటారు....

నేలమ్మను కాపాడుకుందాం

పర్యావరణ పరిరక్షణకు మద్దతు ఇచ్చేందుకు ప్రతి సంవత్సరం ఏప్రిల్ 22న ప్రపంచ ధరిత్రీ దినోత్సవం జరుపుకుంటారు. 2021 ప్రపంచ ధరిత్రీ దినోత్సవం నినాదం ‘భూమిని పునరుద్ధరించండి’. మన భూమిని మనం పునరుద్ధరించడం అంటే అర్థం భూమిపై మనం మన ఉద్యోగాలు, మన జీవన ఉపాధి, మన ఆరోగ్యం, ఆనందాలను పొందడానికి ప్రతి ఒక్కరికి ఆరోగ్యకరమైన ధరిత్రీ అవసరం. 


భూమి మీద ఉన్న వనరులు 2050నాటికి పూర్తిగా నిండుకుంటాయి. ఆ పరిస్థితే వస్తే మానవజాతి ఈ విశ్వంలో మరో రెండు భూములను వెతుక్కొక తప్పదని ‘ప్రపంచ వన్యప్రాణి నిధి ఆస్ట్రేలియా’ నివేదిక చెబుతున్నది. మానవుడు పలు వ్యాధులు, కాలుష్యం లేకుండా ఆరోగ్యంగా, సంతోషంగా జీవించాలంటే పర్యావరణానికి పునరుజ్జీవం పోయాలి. భూమి, నీరు, మొక్కలను జీవులను కాపాడుకోవాలి. ప్రస్తుతం గత సంవత్సర కాలం నుంచి యావత్ ప్రపంచానికి  సవాల్ విసురుతున్న కరోనా నుంచి అనేక పాఠాలు నేర్చుకోవలసిన ఆవశ్యకత మనపై ఉంది. జీవ వైవిధ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటు పడాల్సిన అవసరం ఉంది.


ప్రకృతి అందించే సహజ వనరులను పొదుపుగా సమర్థంగా కాపాడుకోవడానికి ప్రభుత్వాలు ప్రణాళికలు రచించాలి. అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచాలన్న నిర్దేశిత లక్ష్య సాధనలో సామాన్య ప్రజలను భాగస్వామ్యులను చేయాలి. పచ్చదనం పెంపుదల, హరితహారం కార్యక్రమాల్లో ప్రజలందరూ స్వచ్ఛందంగా పాల్గొన్నప్పుడు నేలను పర్యావరణ విపత్తు నుంచి కాపాడుకోగలం.


మన భవిష్యత్ తరాలకు పచ్చని చెట్లతో కూడిన పరిశుద్ధమైన, ఆరోగ్యకరమైన, జీవన యోగ్యమైన జీవితాన్ని అందించాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ధరిత్రి అంటేనే కోట్లకొలది జీవరాశులకు జీవవైవిధ్య పుట్టిల్లు. అలాంటి ధరిత్రిని సమస్త మానవాళి యథాతథంగా జాగ్రత్తగా కాపాడి భవిష్యత్ తరాలకు అందించడమే ఈ ప్రపంచ ధరిత్రి దినోత్సవ అంతరార్థం అనే సంగతి మనం ఎవరం మరువరాదు. 

పుల్లూరు వేణుగోపాల్

(నేడు ప్రపంచ ధరిత్రీ దినోత్సవం) 

Updated Date - 2021-04-22T06:03:26+05:30 IST