ఆ భూములు మావే..

ABN , First Publish Date - 2022-06-20T08:18:35+05:30 IST

పెట్టుబడుల ఉపసంహరణ పేరిట.. తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్మొద్దంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు.

ఆ భూములు మావే..

తెలంగాణ ప్రజల హక్కు.. మా ఆస్తులను అమ్ముతున్నట్లే

6 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు గతంలో 7,200 ఎకరాలు

ప్రస్తుతం వాటి మార్కెట్‌ విలువ రూ.40 వేల కోట్లకు పైనే

విక్రయిస్తామంటే ఊరుకోం.. మీతో కాకుంటే మాకిచ్చేయండి

కొత్త పరిశ్రమల ఏర్పాటుకు మాకు అవకాశం కల్పించండి

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలకు రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ లేఖ


హైదరాబాద్‌, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడుల ఉపసంహరణ పేరిట.. తెలంగాణలోని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులను అమ్మొద్దంటూ కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ కోరారు. రాష్ట్రంలో వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక అనుకూల వాతావరణం ఉన్న నేపథ్యంలో.. గతంలో కేటాయించిన భూముల్లో కొత్త పరిశ్రమలు, సంస్థలు నెలకొల్పాలని, అందుకు వీలు కాకుంటే అదేచోట కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసే అవకాశం తమకు ఇవ్వాలని కోరారు. ఇవేమీకాకుండా తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థలు, వాటి ఆస్తులను అమ్మేసి సొమ్ము చేసుకోవాలనుకుంటే కచ్చితంగా వ్యతిరేకిస్తామన్నారు. ఈ మేరకు ఆదివారం నిర్మలకు కేటీఆర్‌ లేఖ రాశారు. ‘‘హిందుస్థాన్‌ కేబుల్స్‌ లిమిటెట్‌, హిందుస్థాన్‌ ఫ్లోరో కార్బన్స్‌ లిమిటెడ్‌, ఇండియన్‌ డ్రగ్స్‌ అండ్‌ ఫార్మాస్యూటికల్స్‌ లిమిటెడ్‌, హెచ్‌ఎంటీ, సిమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీలకు గత ప్రభుత్వాలు 7,200 ఎకరాలు ఇచ్చాయి. ప్రభుత్వ ధరల ప్రకారం వీటి ప్రస్తుత విలువ రూ.5 వేల కోట్లు. మార్కెట్‌ ధరల ప్రకారం రూ.40 వేల కోట్లు. ఈ సంస్థల భౌతిక ఆస్తులు తెలంగాణ ప్రజల హక్కు. వీటిని ప్రైవేటుపరం చేయడమంటే తెలంగాణ ఆస్తులను అమ్ముతున్నట్లుగానే మా ప్రజలు భావిస్తారు’’ అని కేటీఆర్‌ స్పష్టం చేశారు. తెలంగాణకు రాజ్యాంగబద్ధంగా దక్కాల్సిన ఎన్నో హామీలను పట్టించుకోకుండా.. రాష్ట్రంలోని సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో వాటి ఆస్తులను అప్పనంగా అమ్ముతోందని దుయ్యబట్టారు.


స్కై వే భూములకు మార్కెట్‌ రేటు అడిగారుగా?

హైదరాబాద్‌లో ప్రజా రవాణాను సులభతరం చేసేందుకు స్కై వే ప్రాజెక్టులకు భూమి అడిగితే.. మార్కెట్‌ ధర ప్రకారం పరిహారం చెల్లించాలని  కేంద్రం డిమాండ్‌ చేసిన విషయాన్ని కేటీఆర్‌ గుర్తుచేశారు. అలాంటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన భూములను అమ్మే హక్కు వారికి ఎక్కడుందని నిలదీశారు. తమిళనాడు సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు.. వారిదగ్గరున్న ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మడానికి కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో పునరాలోచన చేయాలని కేంద్రానికి సూచించారు.


యువతకు ఉపాధిపై సోయి లేకుండా..

దేశాభివృద్ధి, ప్రజల ఆత్మగౌరవానికి చిహ్నంగా నిలిచిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం అడ్డికి పావుశేరు కింద విక్రయిస్తోందని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. దీనిని తమ ప్రభుత్వం, టీఆర్‌ఎస్‌ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు కేటీఆర్‌ స్పష్టం చేశారు. ‘‘వేలాదిమందికి ప్రత్యక్షంగా, లక్షలమందికి పరోక్షంగా ఉపాధి కల్పించిన ప్రభుత్వ రంగ సంస్థలను తిరిగి ప్రారంభిస్తే ఉద్యోగ అవకాశాలు విస్తృతమవుతాయన్న సోయి మోదీ ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరం. దేశ ఆర్థిక వ్యవస్థకు దన్నుగా నిలిచిన సంస్థలను అప్పనంగా అమ్మడమే వారి లక్ష్యంగా ఉంది’’ అని లేఖలో పేర్కొన్నారు. మరోవైపు ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు..రా ష్ట్రాల హక్కులను అపహాస్యం చేసేలా ఉందని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చిన దగ్గరినుంచీ యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించకుండా కథలు చెబుతున్న మోదీ ప్రభుత్వం.. రూ.వేల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థల విక్రయంలో మాత్రం తీరిక లేకుండా ఉందని విమర్శించారు.

Updated Date - 2022-06-20T08:18:35+05:30 IST