పెరరివాలన్‌కు విముక్తి

ABN , First Publish Date - 2022-05-19T08:12:09+05:30 IST

మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో 7వ దోషి, గత 30 ఏళ్లుగా ఖైదు అనుభవిస్తున్న ఏజీ పెరరివాలన్‌ను విడుదల చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది.

పెరరివాలన్‌కు విముక్తి

సుప్రీంకోర్టు ‘అసాధారణ’ తీర్పు

ఆర్టికల్‌ 142 ప్రకారం ఆదేశిస్తున్నామన్న జస్టిస్‌ లావు నేతృత్వంలోని ధర్మాసనం

29 పేజీల తీర్పును వెలువరించిన కోర్టు

క్షమాభిక్షపై గవర్నర్‌ది అసాధారణ జాప్యం

మంత్రి మండలి తీర్మానానికి కట్టుబడలేదు

సుప్రీం త్రిసభ్య ధర్మాసనం వ్యాఖ్యలు

ఇదో దుర్దినం.. బాధగా ఉంది: కాంగ్రెస్‌


చెన్నై/న్యూఢిల్లీ, మే 18 (ఆంధ్రజ్యోతి): మాజీ ప్రధాని రాజీవ్‌ గాంధీ హత్య కేసులో 7వ దోషి, గత 30 ఏళ్లుగా ఖైదు అనుభవిస్తున్న ఏజీ పెరరివాలన్‌ను విడుదల చేయాలని దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు బుధవారం సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 ప్రకారం అసాధారణ అధికారాన్ని వినియోగించుకుని ఈ ఆదేశాలు జారీ చేస్తున్నట్టు న్యాయమూర్తి జస్టిస్‌ లావు నాగేశ్వరరావు నేతృత్వంలోని జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఈ మేరకు 29 పేజీలతో కూడిన తీర్పును వెలువరించింది. కాగా, ఈ కేసులో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఏడుగురు దోషుల ముందస్తు విడుదలకు తమిళనాడు కేబినెట్‌ సిఫారసు చేసినా గవర్నర్‌ తొక్కిపెట్టారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అంతేకాదు.. ఐపీసీ సెక్షన్‌ 302 ప్రకారం క్షమాభిక్ష అధికారం రాష్ట్రపతికే ఉంటుందన్న కేంద్రం వాదనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.


ఆర్టికల్‌ 161 ప్రకారం గవర్నర్‌కు కూడా ఆ అధికారం ఉందని గుర్తు చేసింది. ఈ విషయంలో గవర్నర్‌ ‘అసాధారణ జాప్యం’ చేశారని వ్యాఖ్యానించింది. హత్య కేసు ల్లో దోషులకు క్షమాభిక్ష పెట్టే విషయంపై సిఫారసులు చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని, మంత్రి మండలి సిఫారసులకు గవర్నర్‌ కట్టుబడాల్సిందేనని పేర్కొంది. ఈ సందర్భంగా అదనపు సొలిసిటర్‌ జనరల్‌ కేఎం నటరాజ్‌ వాదనలు వినిపిస్తూ కేంద్ర చట్టం ప్రకారం క్షమాభిక్ష పెట్టడం, శిక్షను తగ్గించడం వంటి విచక్షణాధికారాలు రాష్ట్రపతికి ఉన్నాయన్నారు. ఈ వాదనలను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. కాగా, 2020, నవంబరు 20న సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్‌లో పెరరివాలన్‌ క్షమాభిక్ష అంశంపై గవర్నర్‌ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. అంతేకాదు.. రాజీవ్‌ గాంధీ హత్యపై ఏర్పాటైన జైన్‌ కమిషన్‌ రిపోర్టు నేపథ్యంలో ఈ కేసు వెనుక ఉన్న భారీ కుట్రను ఛేదించేందుకు సీబీఐ నేతృత్వంలో ఎండీఎంఏ ఏర్పాటైందని తెలిపింది. అయితే, ఎండీఎంకే జరుపుతున్న విచారణలో పెరరివాలన్‌ అంశం లేదని తెలిపింది. ఇక, ఈ ఏడాది మార్చి 9న పెరరివాలన్‌కు సుప్రీంకోర్టు బెయి ల్‌ మంజూరు చేసింది. సుదీర్ఘ కాలం జైలులో ఉండ డం, పెరోల్‌పై బయటకు వచ్చినప్పుడు ఎలాంటి నేరాలకు పాల్పడకపోవడంతో ఆయనకు బెయిల్‌ ఇచ్చింది.  


బ్యాటరీలు కొనుగోలు చేసి..

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో దాదాపు 30 సంవత్సరాల పాటు జైలు జీవితం గడిపిన పెరరివాలన్‌కు ఈ హత్యలో ఉన్న పాత్ర ఏంటనేది ఆసక్తిదాయకం. ఈ కేసులో పెరరివాలన్‌ అరెస్టు అయ్యేనాటికి(1991) అతని వయసు 19 ఏళ్లు. అయితే, ఆత్మాహుతి బాంబర్‌ వినియోగించిన బాంబులో వాడేందుకు బ్యాటరీలను పెరరివాలన్‌ కొనుగోలు చేశాడు. ఈ కారణంగానే ఆయనను 7వ దోషిగా కోర్టు అప్పట్లో తేల్చింది. కాగా, సుప్రీం కోర్టు ఆదేశాల అనంతరం, ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న పెరరివాలన్‌ తిరుపత్తూరు జిల్లా జోలార్‌పేటలోని తన ఇంటి వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పుడే స్వేచ్ఛావాయువులు పీల్చుకుంటున్నానన్నారు.

‘‘30 ఏళ్ల న్యాయ పోరాటం తర్వాత ఇప్పుడే బయట పడ్డాను. నన్నుకొంచెం ఊపిరి పీల్చుకోనివ్వండి. కొంత సమయం ఇవ్వండి’’ అని అన్నారు. కాగా, 1971 జూలై 30న తిరుపత్తూర్‌ జిల్లా జోలార్‌పేటలో జ్ఞానశేఖరన్‌ అలియాస్‌ కుయిల్‌దాసన్‌, అర్బుదమ్మాళ్‌ దంపతులకు జన్మించాడు. అరెస్టయ్యేనాటికి పేరరివాలన్‌ ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌లో డిప్లమా పూర్తి చేశాడు. అరెస్టయ్యాక వేలూరు సెంట్రల్‌ జైలు నుంచి  తమిళనాడు ఓపెన్‌ యూనివర్శిటీ నిర్వహించి న డిప్లమా కోర్సులో స్వర్ణపతాకాన్ని సాధించుకున్నాడు.  


‘అమ్మ’ అలుపెరుగని న్యాయపోరు

పెరరివాలన్‌కు జైలు నుంచి విముక్తి కల్పించేందుకు ఆయన మాతృమూర్తి, 73 ఏళ్ల అర్బుదమ్మాళ్‌ దశాబ్దాలపాటు న్యాయ పోరాటం చేశారు. కుమారుడిని రక్షించుకునేందుకు ఆమె తొక్కని గడపలేదు, ఆశ్రయించని నేత లేడు. టాడా కోర్టు నుంచి సుప్రీంకోర్టు దాకా రేయింబవళ్లు పరుగులు పెట్టారు. ‘19 ఏళ్ల ప్రాయంలో మంచేదో చెడేదో ఏ బిడ్డకైనా ఎలా తెలుస్తుంది? ఏ నేరానికీ 30 ఏళ్ల శిక్ష లేనప్పుడు నా కొడుకునెందుకు అంతకాలం జైల్లో పెడతారు? కనీసం నేను కాటికెళ్లే లోపైనా కనికరించడయ్యా’ అంటూ ఆ మాతృమూర్తి చేసిన వినతులు కంటతడిపెట్టించాయి. ఆఖరికి ఆమె విజయం సాధించింది. ముఖ్యమంత్రి స్టాలిన్‌ స్వయంగా అర్బుదమ్మాళ్‌లకు ఫోన్‌ చేసి శుభాకాంక్షలు తెలిపారు.   


ఏమిటీ ఆర్టికల్‌ 142

రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 142 సుప్రీంకోర్టుకు అసాధారణ అధికారాలను కట్టబెట్టింది. కోర్టు ముందు పెండింగులో ఉన్న ఎలాంటి కేసులో అయినా న్యాయపరిధిని నిర్ణయించడం, ఆదేశాలు జారీ చేయడం, సంపూర్ణ తీర్పులు వెలువరించే అధికారాలను ఈ ఆర్టికల్‌ కల్పించింది. సుప్రీం కోర్టు 1989లో యూనియన్‌ కార్బైడ్‌(భోపాల్‌ గ్యాస్‌) విషయంలోను, 2019లో రామజన్మభూమి-బాబ్రీ మసీద్‌ వివాదంలోనూ సుప్రీం కోర్టు ఆర్టికల్‌ 142ను వినియోగించుకుంది.

Updated Date - 2022-05-19T08:12:09+05:30 IST