నిరుద్యోగులకు అండగా గ్రంథాలయం

ABN , First Publish Date - 2022-05-14T06:48:48+05:30 IST

రాష్ట్రప్రభుత్వం వివిధశాఖల్లో ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్‌లు జారీచేస్తున్న నేపథ్యంలో కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు తమకు అందుబాటులో ఉన్న గ్రం థాలయాలు, కోచింగ్‌సెంటర్‌లను ఆశ్రయిస్తున్నారు.

నిరుద్యోగులకు అండగా గ్రంథాలయం
జిల్లా గ్రంథాలయంలో పుస్తకాలను చదువుతున్న విద్యార్థులు

పుస్తకాలతో కుస్తీకి వేదికైన జిల్లా లైబ్రరీ

పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి ఆసరాగా జిల్లా గ్రంథాలయం 

విద్యార్థులతో నిండిపోయిన ప్రాంగణం

మరిన్ని సౌకర్యాలు సమకూరుస్తామంటున్న కలెక్టర్‌ 

పాఠకులను ప్రోత్సహిస్తున్న గ్రంథాలయ సంస్థ 

నిర్మల్‌, మే 13 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రప్రభుత్వం వివిధశాఖల్లో ఖాళీల భర్తీకి వరుసగా నోటిఫికేషన్‌లు జారీచేస్తున్న నేపథ్యంలో కొలువుల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులు తమకు అందుబాటులో ఉన్న గ్రం థాలయాలు, కోచింగ్‌సెంటర్‌లను ఆశ్రయిస్తున్నారు. ముఖ్యంగా జిల్లా కేంద్రంలోని ప్రఽధాన గ్రంథాలయం పోటీ పరీక్షలకు సమాయత్తం మ య్యేందుకు నిరుద్యోగులకు అండగా నిలుస్తోంది. ప్రతీరోజూ పెద్దసంఖ్యలో పోటీ పరీక్షల కోసం పుస్తకాలతో అభ్యర్థులు కుస్తీ పడుతున్నారు. రోజురోజుకూ నిరుద్యోగుల సంఖ్య పెరిగిపోతుండడంతో ఇక్కడి జిల్లా గ్రంథాలయంలో వారికి అవసరమైన మేరకు సౌకర్యాలను సమకూరుస్తున్నారు. తెలుగుఅకాడమీ పుస్తకాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకున్నప్పటికీ వివిధ రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను జిల్లా గ్రంథాలయంలో అందుబాటులో ఉంచుతున్నారు. ప్రభుత్వం ఉద్యో గాల నోటిఫికేషన్‌లు జారీ చేయనున్నట్లు ప్రకటించిన నాటి నుంచే జిల్లా గ్రంథాలయ సంస్థ ఎర్రవోతు రాజేందర్‌ ఆ దిశగా దృష్టి సారించి జిల్లా గ్రంథాలయంను పెరిగే పాఠకుల సంఖ్యకు అనుగుణంగా సౌకర్యాలను సమకూర్చడంలో నిమగ్నమయ్యారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేంధర్‌ ప్రతీరోజూ ఇక్కడికి వచ్చి పాఠకులకు ఇంకా అవసరమైన సౌకర్యాల గురించి ఆరా తీస్తూ అందుకు అనుగుణమైన చర్యలు చేపడుతున్నారు. అలాగే మరిన్ని సౌకర్యాలను సమకూర్చేందుకు ఆయన జిల్లా కలెక్టర్‌ దృష్టికి కూడా తీసుకుపోయారు. దీంతో శుక్రవారం జిల్లా కలెక్టర్‌ ముషారఫ్‌ ఆలీ ఫారూఖీ జిల్లా గ్రంథాలయాన్ని సందర్శించారు. ఇక్కడ నిరుద్యోగ అభ్యర్థుల కోసం అందుబాటులో ఉన్న పుస్తకాలు అవ సరమయ్యే పుస్తకాల గురించి ఆరా తీశారు. అలాగే నిరుద్యోగ అభ్యర్థులకు పుస్తకాలు చదివేందు కోసం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అవసరమైన సౌకర్యాలను సమకూర్చేందుకు తాను ప్రత్యేక నిధులను సైతం మంజూరు చేస్తానంటూ కలెక్టర్‌ హామీనిచ్చారు. ఈ సందర్భంగా ప్రస్తుతసంఖ్యకు అనుగుణంగా గ్రంథాలయంలో అవసరమైన సౌకర్యాల విషయమై చైర్మన్‌ ఎర్రవోతు రాజేంధర్‌ కలెక్టర్‌ దృష్టికి తీసుకుపోయారు. కాగా జిల్లా గ్రంథాలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్నశాఖ గ్రంథాలయాల్లో కూడా పోటీ పరీక్షలకు అవసరమయ్యే పుస్తకాలను, దినపత్రికలను అందుబాటులో ఉంచే దిశగా చర్యలు మొదలయ్యాయి. జిల్లా గ్రంథాలయంలో డిజిటల్‌ రీడింగ్‌ సౌకర్యాలను కూడా అందుబాటులో ఉంచుతున్నారు. మొత్తానికి కోచింగ్‌ సెంటర్‌లను తలపించే విధంగా జిల్లా గ్రంథాలయంలో ఇటు విలువైన పుస్తకాలు, అటు డిజిటల్‌ రీడింగ్‌ సౌకర్యాన్ని అందుబాటులో ఉంచుతుండడం అంతటా ప్రశంసలు అందుకుంటోంది. గ్రంథాలయ పంచసూత్రాలకు అను గుణంగా పాఠకుల అవసరాలకు తగినట్లుగా పాలకమండలి సౌక ర్యాలను సమకూరుస్తుంది. జిల్లా నుంచి నిరుద్యోగులు అధికసంఖ్యలో ఉద్యోగాలు సాధించాలనేది తన ఆశయంగా జిల్లా గ్రంథాలయ సంస చైర్మన్‌ ఎర్రవోతు రాజేందర్‌ తెలిపారు. కాలనుగుణంగా మార్పులు చెందుతున్న గ్రంథాలయం చూసి పాఠకులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. 

ప్రత్యేకంగా పోటీ పరీక్షల పుస్తకాలు

ప్రస్తుతం వివిధ రకాల ఉద్యోగాలకు పోటీపరీక్షలు రాయబోతున్న నిరుద్యోగులకు వారికి అవసరమయ్యే పుస్తకాలన్నింటినీ అందుబాటులో ఉంచుతున్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థచైర్మన్‌ ఎర్రవోతు రాజేంధర్‌ ప్రత్యేక మాస, పక్ష పత్రికలు, విషయ నిపుణులు రాసిన పోటీ పరీక్షల పుస్తకాలను ప్రత్యేకంగా తెప్పించారు. జిల్లా గ్రంథాలయంతో పాటు మండలాల్లోని శాఖ గ్రంథాలయాల్లో కూడా పోటీ పరీక్షలకు సంబంధించిన పుస్తకాలను మాగ్యజైన్‌లను దినపత్రికలను అందుబాటులో ఉంచి నిరుద్యోగులను ఈ లైబ్రరీలకు రప్పించే విధంగా చూస్తున్నారు. ప్రస్తు తం మారిన సిలబస్‌ను పరిగణలోకి తీసుకొని పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నారు. 

డిజిటల్‌ రూపంలో..

పుస్తకాలతో పాటు డిజిటల్‌ రీడింగ్‌ సౌకర్యాన్ని కూడా జిల్లా గ్రంథాలయంలో నిరుద్యోగ అభ్యర్థుల కోసం అందుబాటులో ఉంచుతున్నారు. జిల్లా గ్రంథాలయానికి ఇప్పటికే ఇంటర్నేట్‌ సౌకర్యం ఉండడమే కాకుండా కంప్యూటర్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. దీంతో నిరుద్యోగ అభ్యర్థులు పోటీపరీక్షల కోసం అవసరమయ్యే జనరల్‌ నాలెడ్జ్‌, కరెంటు అఫైర్స్‌, రీజనింగ్‌ ఎబిలిటీ, మెంటల్‌ ఎబిలిటీ, అర్తమేటిక్‌, జనరల్‌ ఇంగ్లీష్‌, కరెంటు అఫైర్స్‌ లాంటి అంశాలన్నింటినీ తెలుసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. వీటితో పాటు సబ్జెక్ట్‌ల సమాచారాన్ని కూడా అందుబాటులో ఉంచుతూ విలువైన పుస్తకాలను పాఠకులకు అందిస్తున్నారు. డిజిటల్‌ రూపంలో సునాయసంగా సమాచారం తెలుసుకుంటున్న అభ్యర్థులు ఎప్పటికప్పుడు నోట్స్‌ రాసుకుంటూ చదువుల్లో నిమగ్న మవుతున్నారు. 

కోచింగ్‌ సెంటర్‌లకు దీటుగా..

జిల్ల్లా గ్రంథాలయంతో పాటు మరికొన్ని శాఖ గ్రంథాలయాల్లో పోటీ పరీక్షలకు ధీటుగా సౌకర్యాలను సమకూరుస్తున్నారు. కోచింగ్‌ సెంటర్‌లలో అందుబాటులో లేనంతగా ఇక్కడ పుస్తకాలతో పాటు అన్నిరకాల సౌకర్యాలను పాఠకులకు అందించి వారిని ఆకర్షిస్తున్నారు. వేల రూపాయల బిల్లులు చెల్లించి కోచింగ్‌ సెంటర్‌లలో అరకొర పరిజ్ఙానాన్ని సంపాదించే కన్నా జిల్లా గ్రంథాలయంలో సమస్తవిజ్ఙానం అందుబాటులో ఉందంటూ ప్రచారం చేస్తున్నారు. దీని కోసం గానూ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఎర్రవోతు రాజేంధర్‌ స్వచ్చందసంస్థలు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సహకారం తీసుకుంటున్నారు. వారి ద్వారా గ్రంథాలయ ప్రాధాన్యతను వివరిస్తూ నిరుద్యోగ అభ్యర్థులందరినీ గ్రంథాలయాల వైపు ఆకర్షితుల య్యే విధంగా చూస్తున్నారు. 

అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నాం

జిల్లా గ్రంథాలయంలో పాఠకుల కోసం అన్ని సౌకర్యాలను సమకూరుస్తున్నాం. ముఖ్యంగా ఉద్యోగాల కోసం పోటీ పరీక్షలు రాసే వారికి నాణ్యమైన పుస్తకాలతో పాటు మౌలిక సౌకర్యాలు సమకూరుస్తున్నాం. డిజిటల్‌ రీడింగ్‌ సిస్టంను కూడా అందుబాటులో ఉంచుతున్నాం. మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కలెక్టర్‌ ముషారఫ్‌ ఫారూఖీల సహకారంతో మరింత మెరుగైన సౌకర్యాలను సమకూర్చబోతున్నాం. ప్రైవేటు కోచింగ్‌ సెంటర్‌లకు వెళ్లివేల రూపాయలు నష్టపోకుండా నిరుద్యోగ అభ్యర్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలి. 

- ఎర్రవోతు రాజేంధర్‌ , జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ 

Read more