పతన బాటలో LIC షేర్లు.. రూ.5 లక్షల కోట్ల దిగువకు మార్కెట్ క్యాప్

ABN , First Publish Date - 2022-06-06T17:23:47+05:30 IST

ఇటివలే లిస్టింగ్ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి.

పతన బాటలో LIC షేర్లు.. రూ.5 లక్షల కోట్ల దిగువకు మార్కెట్ క్యాప్

ముంబై : ఇటివలే లిస్టింగ్ అయిన లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) షేర్లు నష్టాల బాటలో కొనసాగుతున్నాయి. సోమవారం సెషన్‌లో బీఎస్ఈపై 2 శాతం మేర దిగజారి(ఉదయం 11:30 గంటల సమయంలో) రూ.786.05 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. వరుసగా ఐదవ సెషన్‌లోనూ పతనమై లిస్టింగ్ నాటి నుంచి మరింత కనిష్ఠ స్థాయికి షేర్లు పడిపోయాయి. దీంతో ఎల్‌ఐసీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.5 లక్షల కోట్ల దిగువకు దిగజారింది.


కాగా మే 17, 2022న అంచనాలను తలకిందులు చేస్తూ ఎల్ఐసీ షేర్లు ఇష్యూ ప్రైస్ కంటే దాదాపు 8 శాతం తక్కువగా లిస్టయ్యాయి. తాజాగా సోమవారం పతనంతో ఇష్యూ ప్రైస్ రూ.949 నుంచి ఇప్పటివరకు మొత్తం 17 శాతం మేర షేర్లు నష్టపోయినట్టయింది. వారం రోజుల వ్యవధిలోనే ఇన్వెస్టర్లు ఈ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. 


కాగా కొన్ని బ్రోకరేజీ సంస్థలు ఎల్ఐసీ షేర్ల విషయంలో సానుకూలంగా ఉన్నాయి. ‘హోల్డ్’ రేటింగ్‌ను ఇస్తున్నట్టు ఎమ్కే గ్లోబల్ ఫైనాన్సియల్ సర్వీసెస్ గతవారమే రిపోర్ట్ విడుదల చేసింది. ఎల్ఐసీ షేర్లు  స్వల్పకాలంలోనే ప్రస్తుత స్థాయి నుంచి 11 శాతం మేర వృద్ధి చెందుతాయని అంచనా వేసింది. ఇందుకు పలు సానుకూల అంశాలున్నాయని విశ్లేషించింది. కాగా మార్కెట్ నిపుణులు కూడా సానుకూలంగానే ఉన్నారు. ఎల్ఐసీ లీడర్‌షిప్, వ్యాల్యూయేషన్లు సౌలభ్యంగా ఉండడం సానుకూలమంటున్నారు. మార్కెట్‌లో సహచర కంపెనీలతో పోల్చితే మెరుగైన వృద్ధి సాధించేందుకు ఎల్ఐసీకే ఎక్కువ అవకాశాలున్నాయని విశ్లేషిస్తున్నారు.

Updated Date - 2022-06-06T17:23:47+05:30 IST