పేద రైతుకు దగా!

ABN , First Publish Date - 2022-06-27T07:24:40+05:30 IST

పేద రైతుకు దగా!

పేద రైతుకు దగా!

వైఎస్‌ఆర్‌ జలకళకు గండి

సోలార్‌ పంపుసెట్లకు చెల్లుచీటీ

పార్లమెంట్‌ నియోజకవర్గానికో రిగ్‌ ఏదీ?

అసెంబ్లీ నియోజకవర్గానికొకటీ అంతే 

మూడేళ్లలో 2.13 లక్షల దరఖాస్తులు 

వేసిన బోర్లు కేవలం 14,774 

790 బోర్లకు మాత్రమే విద్యుత్‌ కనెక్షన్‌

ఈసారి బడ్జెట్‌ కేటాయింపులు 50 కోట్లే

పేద రైతుల పొలాల్లో బోర్లు వట్టిమాటే

బీళ్లుగా వేలాది ఎకరాలు 


ఎన్టీఆర్‌ జలసిరి.. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పేద రైతుల పొలాలకు జల సిరులు కురిపించిన ఉదాత్త పథకం. కానీ.. జగన్‌ అధికారంలోకి వచ్చాక.. కేవలం పాత పథకాలేవీ కనపడకూడదన్న అక్కసుతో.. సజావుగా సాగుతున్న ఆ పథకాన్ని రద్దు చేశారు. ఆ స్థానంలో వైఎ్‌సఆర్‌ జలకళ అంటూ కొత్త పథకం తెచ్చారు. ఇప్పుడు ఆ పథకానికీ సర్కారు పాతరేసింది. పేద రైతులను దగా చేసింది. దీనిపై ‘ఆంధ్రజ్యోతి’ ప్రత్యేక కథనం.


 మేనిఫెస్టో మాట 

అధికారంలోకి వచ్చాక ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికో బోర్‌ రిగ్‌ కొనుగోలు చేస్తాం. రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేస్తాం.

కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ.. 

ప్రతి నియోజకవర్గంలో ఒక బోర్‌ రిగ్‌ను ఏర్పాటు చేశాం. 2 లక్షల బోర్లు తవ్వే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. మేనిఫెస్టోలో చెప్పిందే కాకుండా.. సన్న, చిన్న కారు రైతులకు మోటార్లు కూడా బిగించేలా మార్పులు చేస్తున్నాం. 

- 2020 సెప్టెంబరు 27న వైఎ్‌సఆర్‌ 

జలకళ ప్రారంభం సందర్భంగా జగన్‌ 

వాస్తవం ఇదీ.. 

ప్రభుత్వం ఒక బోర్‌ రిగ్‌ కూడా కొనలేదు. రైతుల పొలాల్లో బోర్లు వేసేందుకు ప్రైవేటు వారికి అప్పగించారు. బిల్లులు చెల్లించకపోవడంతో వాళ్లు చెతులెత్తేశారు. మూడేళ్లలో ఉచిత బోర్ల కోసం 2.13 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటి వరకు 14,774 మంది రైతుల పొలాల్లో మాత్రమే బోర్లు వేశారు. అందులోనూ 790 బోర్లకు మాత్రమే విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చారు.


 (అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలో వైఎ్‌సఆర్‌ జలకళకు మంగళం పాడారా? గతంలో సజావుగా అమలవుతున్న ఎన్టీఆర్‌ జలసిరిని రద్దు చేసిన జగన్‌ సర్కార్‌ పేద రైతుల జల‘కల’ను చిదిమేసిందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇది ముమ్మాటికీ నిజం! రాష్ట్రంలో పేద రైతుల పొలాల్లో సిరులు వెదజల్లుతున్న పథకాన్ని రద్దు చేసిన వైసీపీ సర్కార్‌ కొత్త పథకాన్ని అమలు చేయక పోవడంతో పేద రైతులను దగా చేశారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్న పథకం రద్దు చేసి.. కొత్త పథకం సమర్థంగా అమలు చేయకపోవడంతో వేలాది ఎకరాలు బీడు పెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని బడుగు రైతులు వాపోతున్నారు.


పాత పథకాలేవీ కనపడకూడదనే...

జగన్‌ ప్రభుత్వం వచ్చిన వెంటనే పాత పథకాలేవీ కనపడకూడదన్న ఒకే ఒక లక్ష్యంతో ఎన్టీఆర్‌ జలసిరిని రద్దు చేశారు. వైఎ్‌సఆర్‌ జలకళ పేరుతో బోరుబావుల పథకం విధి విధానాలు తెచ్చారు. అందుకోసం 2019-20 బడ్జెట్‌లో రూ.200 కోట్లు, 2020-21లో రూ.100 కోట్లు, 2021-22లో రూ.200 కోట్లు కేటాయించారు. అయితే ఏ సంవత్సరం కూడా రూ.50 కోట్లకు మించి ఖర్చు చేయలేదు. అందుకే ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.50 కోట్లు మాత్రమే కేటాయించారు. ఉచితంగా సోలార్‌ పంపుసెట్లు రైతులకు అందిస్తామని మరోసారి మార్గదర్శకాలు జారీచేశారు. మోటార్లు ఇవ్వడం అటుంచి బోర్లు వేయడంలో కూడా వెనుకబడ్డారు. 14 వేలకు పైచిలుకు బోర్లు తవ్వినప్పటికీ బోరుమెషీన్‌ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో వారు ఆందోళన చేపట్టాల్సి వచ్చింది. ఫలితంగా బోర్లు తవ్వే కార్యక్రమం కూడా నిలిచిపోయింది.  


బోర్‌ రిగ్‌లు ఏవీ? 

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గానికో బోర్‌ మెషీన్‌ కొనుగోలు చేసి రైతుల పొలాల్లో ఉచితంగా బోర్లు వేస్తామని అప్పట్లో వాగ్దానం చేసింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా అదే హామీ మరోసారి ఇచ్చింది. టెండర్లు పిలిచారు. ఏమయిందో ఏమో.. బోర్‌ మెషీన్లు కొనలేదు. ఆ తర్వాత ప్రైవేట్‌ కాంట్రాక్టర్ల ద్వారా బోర్లు తవ్వాలని నిర్ణయించారు. టెండర్లు పిలిచి మరీ నియోజకవర్గానికో బోర్‌ మెషీన్‌ను ఏర్పాటు చేసినట్లు ప్రదర్శనలు కూడా చేశారు. ఆ తర్వాత వారికి బిల్లులు ఇవ్వకపోవడంతో వారు బోర్లు వేయకుండా నిలిపేశారు. చివరగా బోర్లను రైతులే వేయించుకోవాలని సలహా ఇచ్చారు. అయితే తమ పొలాల్లో బోర్లు వేసుకున్నప్పటికీ బిల్లులు చేస్తారా? అనే అపనమ్మకంతో రైతులు ఆ సాహసం చేయలేకపోతున్నారు. 


790 బోర్లకు మాత్రమే విద్యుత్‌ కనెక్షన్‌

మూడేళ్లుగా వైసీపీ సర్కార్‌ కసరత్తు చేసి రాష్ట్ర వ్యాప్తంగా పేద రైతుల నుంచి 2.14 లక్షల దరఖాస్తులను స్వీకరించింది. అందులో భూములు సక్రమంగా ఉన్నాయంటూ వీఆర్వో ఆమోదించిన దరఖాస్తులు 1.78 లక్షలు కాగా అన్ని వడపోతలూ పూర్తయి భూగర్భ సర్వే చేసేందుకు జియాలజిస్టులకు దగ్గర వెళ్లిన దరఖాస్తులు 55,287 మాత్రమే. అందులో కేవలం 41,215 దరఖాస్తులు మాత్రమే సర్వే పూర్తి చేసుకోగా, అందులో ఏపీడీ ఆమోదం పొందినవి 37,718 దరఖాస్తులు మాత్రమే. అందులోనూ 14,774 మంది రైతుల పొలాల్లో మాత్రమే బోర్లు వేశారు. వాటిలో 13,116 బోర్లలో మాత్రమే నీళ్లు పడ్డాయి. ఇందులో విద్యుత్‌ కనెక్షన్‌ కోసం 7,425 బోర్లు మాత్రమే అర్హత కలిగి ఉన్నాయని విద్యుత్‌శాఖ తేల్చింది. 4,940 బోర్లకు విద్యుదీకరణకు డిస్కంలు ఆమోదించాయి. అయితే ఇప్పటి వరకు 790 బోర్లకు మాత్రమే విద్యుత్‌  సౌకర్యం కల్పించారు. 


గతంలో పేద రైతుల జలసిరి 

రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతో పాటు అగ్రవర్ణాల పేద రైతుల భూములను సస్యశ్యామలం చేసేందుకు రూపొందించిన పథకం ఎన్టీఆర్‌ జలసిరి. కాంగ్రెస్‌ ప్రభుత్వంలోనే ఇందిర జలప్రభ పేరుతో ఈ పథకం ప్రారంభమైనా... అప్పట్లో నాబార్డు నిధులివ్వకపోవడంతో కొనసాగలేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని నెలల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులే స్వయంగా నిరంతర కసరత్తుతో పకడ్బందీగా ఈ పథకాన్ని అమల్లోకి తెచ్చారు. పేద రైతులందరికీ ఈ పథకం ఉపయోగపడేలా అప్పటి సీఎస్‌ ఎస్పీ టక్కర్‌, ఆ తర్వాత వచ్చిన దినే్‌షకుమార్‌ సుమారు 10 మంది నిపుణులతో కమిటీలు వేసి సమగ్రమైన మార్గదర్శకాలను రూపొందించారు. దరఖాస్తు ప్రక్రియ నుంచి సర్టిఫికెట్ల సమర్పణ వరకు అన్నీ సరళతరం చేసి శాచురేషన్‌ విధానంలో భూమి ఉన్న ప్రతి పేద రైతుకూ బోరు వేసే విధంగా ప్రణాళికలు రూపొందించారు. రెండేళ్ల పాటు ఈ పథకం ప్రయోగ దశలో నడిచింది. ఆ తర్వాత ఈ పథకంపై విస్తృతంగా అవగాహన కలగడంతో రైతులు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. ఎన్టీఆర్‌ జలసిరి ద్వారా రూ.6 వేలు చెల్లిస్తే ఐదెకరాల లోపు ఎస్సీ, ఎస్టీ రైతులకు 200 అడుగుల బోరుబావితో పాటు రూ.2.42 లక్షల విలువ చేసే 5 హెచ్‌పీ సోలార్‌పంపు సెట్లను అమర్చేవారు. అగ్రవర్ణాలకైతే రూ.25 వేలు చెల్లిస్తే ఈ సౌకర్యాలన్నీ అందేవి. 2018-19కి సంబంధించి 45,300 బోర్లను తవ్వి వాటికి సోలార్‌ పంపుసెట్లను అమర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అప్పట్లో 12,305 బోరుబావులను తవ్వారు. దాదాపు 8,939 బోరుబావులను సోలార్‌ పంపుసెట్లతో శక్త్తిమంతం చేశారు. దీంతో 17,878 రైతులు లబ్ధిపొందగా, 44,695 ఎకరాలు సాగులోకి వచ్చాయి. ఇందుకు ప్రభుత్వం రూ.51.26 కోట్లు ఖర్చు చేసింది. 2016-17 లో ప్రారంభించిన ఈ పథకం అంచెలంచెలుగా పేదల్లోకి వెళ్లింది. రాష్ట్రవ్యాప్తంగా లక్ష బోర్లు ఏర్పాటుచేసి 10 లక్షల ఎకరాలకు సాగుచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మంజూరైన బోర్లన్నీ రద్దు చేసి పేద రైతులను దగా చేసింది.


జగన్‌ ఏమన్నారంటే.. 

2020 సెప్టెంబరు 27న వైఎ్‌సఆర్‌ జలకళ ప్రారంభించిన సందర్భంగా అధికారులతో సీఎం జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ప్రభుత్వం ఏర్పడి 16 నెలలు కావొస్తోందని, ఇచ్చిన మాటను నెరవేరుస్తూ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. ‘‘144 గ్రామీణ నియోజకవర్గాలు, 19 సెమీ అర్బన్‌ నియోజకవర్గాలు కలిపి 163 నియోజకవర్గాల్లో బోర్లు వేసే కార్యక్రమం చేపడుతున్నాం. రైతన్నకు అండగా నిలబడుతూ 2 లక్షల బోర్లు తవ్వించడమే కాకుండా కేసింగ్‌ పైపు ఇస్తున్నాం. వచ్చే నాలుగేళ్లలో ఇందుకోసం రూ.2340 కోట్లు ఖర్చు చేయబోతున్నామని గర్వంగా చెప్తున్నాం. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిందే కాకుండా... రైతుల ఇబ్బంది చూసిన తర్వాత సన్న, చిన్న కారు రైతులకు బోర్లు మాత్రమ కాదు, మోటార్లు కూడా బిగించి ఇస్తామని ఈ కార్యక్రమంలో చిన్న మార్పులు చేస్తున్నాం. మిగిలిన రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తాం. దీనికి మరో 1600 కోట్లు ఖర్చవుతుందని అధికారులు చెప్పారు. అందుకు సిద్ధపడి ఈ ప్రకటన చేస్తున్నాం. ఇందుకోసం ప్రతి నియోజకవర్గంలో ఒక బోర్‌ రిగ్‌ను ఏర్పాటు చేశాం. రైతులు ఆన్‌లైన్‌ ద్వారా నమోదు చేసుకోవచ్చు. రైతులు వారి పొలాల్లో హైడ్రో జియాలజికల్‌ సర్వే కూడా అధికారులు శాస్త్రీయంగా నిర్వహిస్తారు. సర్వే, బోరు ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుంది. రైతన్నకు ఎవరికైనా బోరు లేకపోతే, ఫెయిల్‌ అయితే రెండో సారి కూడా అదే రైతన్నకు బోరు వేసే కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు చెప్పాం’’ అని జగన్‌ ప్రకటించారు. 

Updated Date - 2022-06-27T07:24:40+05:30 IST