‘అమ్మ’లతోనూ అబద్ధాలే!

ABN , First Publish Date - 2022-06-28T08:12:48+05:30 IST

‘అమ్మ’లతోనూ అబద్ధాలే!

‘అమ్మ’లతోనూ అబద్ధాలే!

  • ‘అమ్మఒడి’పై అవాస్తవాలు, అసత్యాలు
  • రూ.కోట్లు ఖర్చుతో ఫుల్‌పేజీ ప్రకటనలు
  • ప్రకటనల్లో, సీఎం మాటల్లో కాకి లెక్కలు
  • పథకం ఇచ్చింది 43 లక్షల మందికి...
  • 82 లక్షల మందికి లబ్ధి అంటూ ప్రచారం
  • రూ.13 వేలు సాయంచేసి 15 వేలకు లెక్క
  • హాజరు లేదనే కారణంగా కొందరికి ఇవ్వలేదట!
  • సాంకేతిక కారణాలతోనే ఎక్కువ మందికి కట్‌

సచివాలయాలకు వేసిన పార్టీ రంగుల నుంచి సర్పంచులకు ఇవ్వాల్సిన నిధుల విడుదల వరకు కోర్టులకు అబద్ధాలు! అడ్డగోలు అప్పులకోసం కేంద్రప్రభుత్వానికి, కాగ్‌కు అబద్ధాల నివేదికలు! ఇక ఇప్పుడు అమ్మలతోనూ పచ్చిఅబద్ధాలే! అమ్మఒడి పథకం అందుకుంటున్న వారి సంఖ్య నుంచి అందిస్తున్న నగదు వరకు అన్నీ కాకిలెక్కలే! అమ్మఒడిపై ఇచ్చిన ఫుల్‌పేజీ ప్రకటనల్లో వండివార్చిన అబద్ధాలు. సోమవారం అమ్మఒడి నిధులను బటన్‌ నొక్కి విడుదల చేసిన సందర్భంగా సీఎం నోటి వెంట కూడా అవే అర్ధ సత్యాలు, అసత్యాలు!


(అమరావతి - ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ‘అమ్మ ఒడి’ లబ్ధిదారుల సంఖ్య... 43.96 లక్షలు. కానీ... రాష్ట్రంలో ఒకటో తరగతి నుంచి ఇంటర్‌ వరకు చదువుతున్న 82,31,502 మంది విద్యార్థులకు లబ్ధి చేకూర్చామంటూ ఆర్భాటపు ప్రకటన చేశారు. స్కూలు నిర్వహణ, మరుగుదొడ్ల నిర్వహణ పేరుతో రూ.2వేలు కోసేశారు. కానీ... తల్లుల ఖాతాల్లో  రూ.15వేలు నేరుగా జమ చేస్తున్నామంటూ మరో అబద్ధం చెప్పారు.కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి సోమవారం జారీ చేసిన ప్రకటనల్లో అనేక అబద్ధాలు, అర్ధ సత్యాలు పొందుపరిచారు. ఈ ఏడాది 43.96 లక్షలమంది తల్లులకు లబ్ధి చేకూర్చినట్టు శ్రీకాకుళంలో జరిగిన ‘నిధుల విడుదల’ కార్యక్రమంలో సీఎం జగన్‌ పేర్కొన్నారు. గత ఏడాది 44.47 లక్షలమందికి సాయం చేయగా, నిర్దేశించిన హాజరు లేని కారణంగా వారిలో 51వేలమందికి ఈసారి ఇవ్వలేకపోతున్నామని కూడా వివరించారు.  కానీ, సర్కారు ఇచ్చిన ఫుల్‌పేజీ ప్రకటనల్లో మాత్రం లబ్ధిదారులు ఏకంగా రెట్టింపు అయ్యారు.


ఒక కుటుంబంలో చదివే (ఇంటరు, ఆ లోపు) పిల్లలందరికీ అమ్మఒడి ఇస్తేనే 82,31,502 మందికి లబ్ధి చేకూరుతుంది. నిజానికి.. విపక్షంలో ఉండగా వైసీపీ ఇచ్చిన హామీ కూడా ఇదే. బడికి వెళ్లే ప్రతి పిల్లాడికీ రూ.15వేలు చొప్పున అందిస్తామన్నారు. తర్వాత... పిల్లలను పక్కనపెట్టి తల్లులకు మాత్రమే ఇస్తామని మాట మార్చారు. చదువుతున్న పిల్లలు కుటుంబంలో ఎందరు ఉన్నా ఒక్కరికే వర్తింపజేశారు. అయినా సరే... మొత్తం పిల్లలందరికీ పథకం వర్తింప చేసినట్లుగా కలరింగ్‌ ఇవ్వడం గమనార్హం.


కత్తెరలు ఏ ఖాతాలో?

పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా రూ.15,000 ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ప్రకటనల్లో ఆర్భాటం చేశారు. ఆ ప్రకారమే బటన్‌ నొక్కి 6,595 కోట్లు జమ చేసినట్టు సభలో సీఎం ప్రకటించారు. ఇది మరో అబద్ధం. ఓ వైపు ప్రభుత్వమే అమ్మఒడి మొత్తం రూ.15 వేలల్లో రూ.1000లు పారిశుధ్యం కోసం, మరో రూ.1000 స్కూల్‌  నిర్వహణ నిధుల కోసం కేటాయించినట్టు చెబుతోంది. గత ఏడాది పారిశుధ్య నిధి కోసం రూ. వెయ్యి కత్తిరించి రూ. 14 వేలు జమ చేశారు. ఈసారి.. స్కూలు నిర్వహణనూ కలిపి మొత్తం రూ. రెండు వేలు కోసేశారు. అంటే అమ్మఒడి లబ్ధిదారుల చేతికి అందింది రూ.13 వేలు మాత్రమే. నిర్ధారించిన జాబితాలు ప్రకటించిన 43,96,402 మందికి రూ.13 వేలు వంతున ఖాతాల్లో వేస్తే రూ.5,715 కోట్లు ఖర్చు అవుతుంది. అయితే రూ. 15వేలు చొప్పున లెక్కించి.. కాకమ్మ కథలు చెబుతున్నారు. 


హాజరే కారణమా? 

అమ్మఒడి వర్తింపునకు 75 శాతం హాజరు శాతాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ఈ ఒక్క కారణంగానే గతంలో లబ్ధిపొందినవారిలో 51 వేలమందికి ఈసారి ఇవ్వలేకపోతున్నామని సీఎం సెలవిచ్చారు. పైగా... ఇకనైనా పిల్లలను స్కూలుకు సక్రమంగా పంపించాలని సలహా కూడా ఇచ్చారు. కానీ, ఇది నిజమా? ఆధార్‌కు ఫోన్‌ నంబరు, బ్యాంకు ఖాతాల లింకు కాలేదని కొందరిని కోశారు. 300 యూనిట్లకు మించి కరెంటు కాల్చారని మరికొందరికి కత్తెర వేశారు. ఇప్పటికే స్కాలర్‌షిప్పు తీసుకుంటున్నారంటూ మరికొందరిని తప్పించారు. ఇంకా విచిత్రంగా.. అర్హుల జాబితాలో పేర్లు ఉన్నా ఇన్‌ యాక్టివ్‌ అంటూ ఇంకొందరిని పక్కనపెట్టారు. దీంతో అమ్మఒడి ఈసారి అయోమయంలో పడిపోయినట్టు సచివాలయాల ఉద్యోగులే అంగీకరిస్తున్నారు. ఎందుకు పేర్లు తీసి వేస్తున్నారో, ఎవరెవరిని కొత్తగా జత చేస్తున్నారో తెలియని పరిస్థితి! ప్రక్రియ ప్రారంభం నుంచీ లబ్ధిదారులతోపాటు వలంటీర్లు, సిబ్బందినీ జగన్‌ సర్కారు గురిచేసింది. 


బుకాయింపులు.. ఆపై బుక్‌!

చంద్రబాబు హయాంలో 2019 జనవరి నుంచి సామాజిక పెన్షన్‌ను రూ.రెండు వేలకు పెంచారు. అయితే జగన్‌ తాను చేసే ప్రతి ప్రసంగంలోను, పత్రికల ప్రకటనల్లోను దీనిపై అసత్యాలే చెబుతున్నారు. వైసీపీ ప్రభుత్వమే పెన్షన్‌ను రూ.2250కు పెంచినట్లు చెబుతున్నారు. చంద్రబాబు హయాంలో 39 లక్షల పెన్షన్లు మాత్రమే ఇస్తుండేవారని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత 60 లక్షల పెన్షన్లు ఇస్తున్నామని కూడా అసత్యాలు ప్రచారం చేసుకున్నారు. వాస్తవానికి టీడీపీ ప్రభుత్వం దిగిపోయే సమయానికి 54 లక్షల పెన్షన్లు మంజూరుచేసి పంపిణీ చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్టీఆర్‌ విద్యోన్నతి పథకాన్ని రద్దు చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, అగ్రవర్ణాల పేదలకు సంబంధించిన విద్యార్థులు విదేశాల్లో సీట్లు పొందితే వారికి ఆర్థిక సాయం రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల దాకా ఈ పథకం కింద అందించేవారు.


ఈ విషయంపై అసెంబ్లీలో పలువురు ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ప్రశ్నలు వేసినప్పుడు సాక్షాత్తు ఆ శాఖ మంత్రిగా ఉన్న పినిపె విశ్వరూప్‌ పచ్చి అవాస్తవాలు చెప్పారు. విద్యోన్నతి పథకాన్ని రద్దు చేయలేదని, అమల్లో ఉందని ప్రకటించి స్వపక్ష సభ్యులను సైతం ఆశ్చర్యంలోకి నెట్టారు. రెండేళ్ల కిందట అసెంబ్లీలో ముఖ్యమంత్రి స్వయంగా రైతుల పంట బీమా ప్రీమియం మొత్తం ప్రభుత్వం చెల్లించదని అబద్ధాలు ప్రకటించారు. ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు సీఎం అబద్ధాలు చెప్పారంటూ ధర్నాకు కూర్చొన్నారు. ఆ రాత్రికి రాత్రే రూ.500 కోట్లు బీమా కంపెనీకి చెల్లించి ఆ అబద్ధాన్ని ఏదోలా కవర్‌ చేసుకున్నారు. రైతుల సున్నా వడ్డీ విషయంలో కూడా వైసీపీ తోసిన లెక్కలు చెప్పి దొరికిపోయింది. టీడీపీ హయాంలో సున్నావడ్డీ అమలు చేయలేదని సీఎం జగన్‌ ఆరోపించారు. దానిని టీడీపీ నేతలు సవాల్‌ చేశారు. టీడీపీ హయాంలో సున్నావడ్డీ కింద రైతులకు రూ.100 కోట్లు చెల్లించింది వాస్తవమేనని తేలింది. వైఎ్‌సఆర్‌ జలకళ కార్యక్రమం గురించి అసెంబ్లీలో ప్రభుత్వం అన్నీ అబద్ధాలే చెప్పింది. ప్రతి నియోజకవర్గానికి ఒక బోరు మెషిన్‌ కొనుగోలు చేశామని, ఉచితంగా బోర్లు వేయించి వారికి మోటార్లు ఇస్తున్నామని ప్రకటించారు. అయితే ఎక్కడా ఒక్క  బోరు మెషిన్‌ కొనుగోలు చేసిన దాఖలాల్లేని విపక్షాలు రుజువులతో సహా బయటపెట్టాయి.

Updated Date - 2022-06-28T08:12:48+05:30 IST