చాణక్యనీతి: ఈ నలుగురితో ఎప్పుడైనా గొడవ పడితే.. జీవితాంతం పశ్చాత్తాపమే!

ABN , First Publish Date - 2022-05-08T13:51:59+05:30 IST

ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో రాజకీయాలు, ఆర్థిక విషయాలతో...

చాణక్యనీతి: ఈ నలుగురితో ఎప్పుడైనా గొడవ పడితే.. జీవితాంతం పశ్చాత్తాపమే!

ఆచార్య చాణక్యుడు తన నీతిశాస్త్రంలో రాజకీయాలు, ఆర్థిక విషయాలతో పాటు జీవితంలో ఎదురయ్యే పలు సమస్యలకు పరిష్కారాన్ని కూడా చెప్పాడు. ప్రతి వ్యక్తికి వారి జీవన విధానాలకు సంబంధించి విభిన్న ఆలోచనలు ఉంటాయి. ఆచార్య చాణక్యుడి విధానాలు జీవిత సత్యాన్ని తెలియజేస్తాయి. అందుకే అవి కొందరికి కఠినంగా అనిపిస్తాయి. అయితే నిజానికి ఆ అమూల్య అంశాలు జీవితంలోని ప్రతి పరీక్షలో సహాయపడతాయి. చాణక్యనీతి ప్రకారం ఎవరైనా సరే తమ బంధువులు, స్నేహితులు, మూర్ఖులు, గురువులతో ఎప్పుడూ గొడవపడకూడదు.

బంధుత్వమే జీవితానికి ఆధారం

ఆచార్య చాణక్యుడు తెలిపిన జీవిన విధానాల ప్రకారం ప్రతి వ్యక్తి జీవితానికి ఆధారం అతని కుటుంబ సభ్యులే. అటువంటి పరిస్థితిలో వారితో వివాదం నెలకొంటే.. ఆ వ్యక్తి జీవితాంతం చింతించాల్సివస్తుంది. కుటుంబ సభ్యులే మనకు మంచి చెడులపై అవగాహన కలిగిస్తారు. అటువంటి పరిస్థితిలో వారితో గొడవ పడితే తరువాత పశ్చాత్తాపపడాల్సివస్తుంది. 


స్నేహం ఎంతో గొప్పది

ప్రపంచంలో స్నేహమే అతి గొప్పదని, నిజమైన స్నేహితుడు ప్రతి సందర్భంలోనూ అండగా ఉంటాడని ఆచార్య చాణక్య తెలిపారు. అందుకే ఎవరైనా సరే తమ స్నేహితునితో గొడవపడితే అతను నమ్మకమైన సంబంధాన్ని కోల్పోతాడు. దీని గురించి జీవితాంతం పశ్చాత్తాపపడతాడు.

గురువు మంచి మార్గదర్శకుడు

మనకు మార్గనిర్దేశం చేసేది గురువు అని చాణక్య నీతి చెబుతుంది. గురువు మనకు జీవితంలో మంచి, చెడులకు సంబంధించిన జ్ఞానాన్ని అందిస్తాడు. సరైన మార్గాన్ని ఎంచుకునేందుకు మనకు సహాయం చేస్తాడు. ఎవరైనాసరే తన గురువుతో విభేదిస్తే, అతను గురు కృపకు దూరమవుతాడు. అప్పుడు అతనికి జ్ఞానోదయం చేసి మార్గనిర్దేశం చేసేవారు కరువవుతారు. 

మూర్ఖులతో వివాదం వద్దు

ఆచార్య చాణక్యుడు తెలిపిన వివరాల ప్రకారం మూర్ఖంగా వాదించే ఎవరితోనూ గొడవపెట్టుకోకూడదు. ఇది మీ సమయాన్ని వృథా చేయడంతో పాటు మీకు ప్రశాంతతను కూడా దూరం చేస్తుంది. అలాంటి వ్యక్తికి ఏదైనా వివరించడం అంటే వృథా ప్రయాస అవుతుంది. 

Read more