యాసిన్‌ మాలిక్‌కు యావజ్జీవం

ABN , First Publish Date - 2022-05-26T08:31:14+05:30 IST

జమ్మూ కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ అధినేత, కశ్మీర్‌ వేర్పాటువాది యాసిన్‌ మాలిక్‌కు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

యాసిన్‌ మాలిక్‌కు యావజ్జీవం

రెండు కేసుల్లో జీవితకాల జైలు శిక్ష

మరో 5 కేసులో పదేళ్ల చొప్పున కారాగారం

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం,  దేశద్రోహం కేసుల్లో ఎన్‌ఐఏ కోర్టు తీర్పు 

కశ్మీర్‌లో టీవీ నటి కాల్చివేత ఆమె వెంట ఉన్న పదేళ్ల బాలుడికి గాయం

దారుణానికి తెగబడ్డ ఉగ్రవాదులు

బారాముల్లాలో ఎన్‌కౌంటర్‌

ముగ్గురు జైషే ఉగ్రవాదులు హతం

ఓ పోలీసు వీరమరణం

2 కేసుల్లో జీవితకాల జైలు శిక్ష


న్యూఢిల్లీ, మే 25: జమ్మూ కశ్మీర్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌ అధినేత, కశ్మీర్‌ వేర్పాటువాది యాసిన్‌ మాలిక్‌కు ఢిల్లీలోని ప్రత్యేక కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం(ఉపా)తోపాటు ఐపీసీలోని రాజద్రోహం, కుట్ర సెక్షన్‌ల కింద యాసిన్‌ మాలిక్‌పై ఆరోపణలు రుజువయ్యాయి. ఈ మేరకు ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు మే 19న మాలిక్‌ను దోషిగా తేల్చింది. బుధవారం ఆయనకు శిక్షను ఖరారుచేస్తూ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. మాలిక్‌కు మొత్తం 2 యావజ్జీవ కారాగార శిక్షలు, మరో 5 కేసుల్లో ఒక్కోదానిలో 10 సంవత్సరాల చొప్పున కఠిన కారాగార శిక్షలు ఖరారయ్యాయి.


అలాగే రూ.10లక్షలకుపైగా జరిమానాను కోర్టు విధించింది. ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలవుతాయి. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడంతోపాటు తనపై వచ్చిన ఇతర నేరారోపణలను యాసిన్‌ మాలిక్‌ అంగీకరించాడని, దీన్ని కోర్టు పరిగణనలోకి తీసుకుందని తీర్పు ఉత్తర్వుల్లో న్యాయమూర్తి పేర్కొన్నారు. సాక్షులు చెప్పిన విషయాలను, డాక్యుమెంటరీ ఆధారాలను విశ్లేషించామని... కేసులోని నిందితులందరూ పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలతో కలిసి పనిచేసినట్టు తేలిందని స్పష్టం చేశారు. ఇదే కేసుతో సంబంధం ఉన్న మాజీ ఎమ్మెల్యే రషీద్‌ ఇంజనీర్‌, వ్యాపారవేత్త అహ్మద్‌షా వతాలి, బషీర్‌ అహ్మద్‌ భట్‌ తదితరులపై కూడా అభియోగాలు నమోదుచేయాలని కోర్టు ఆదేశాలు జారీచేసింది. సాక్షులందరూ కూడా... ఆల్‌ పార్టీ హురియత్‌ కాన్ఫరెన్స్‌, దాన్నుం చి చీలిన ఇతర నాయకులందరికీ ఒకే ఒక లక్ష్యం ఉం దని, అది జమ్మూ కశ్మీర్‌ను భారత్‌ నుంచి వేరుచేయడమేనని చెప్పారని కోర్టు స్పష్టంచేసింది. బుధవారం తీర్పు వెలువడక ముందు జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) తరఫు న్యాయవాది మాట్లాడుతూ... మాలిక్‌కు ఉరిశిక్ష విధించాలని కోర్టును కోరారు. వాదనల సందర్భంగా యాసి న్‌ మాలిక్‌ స్పందిస్తూ... తాను క్షమాభి క్ష కోరనని చెప్పాడు. తాను గాంధేయ మార్గంలో, అహింసాయుత పద్ధతుల్లో రాజకీయాల్లో కొనసాగుతున్నట్టు చెప్పాడు. గత 28 ఏళ్లలో ఎప్పుడైనా ఉగ్రవాద కార్యకలాపాలకుగానీ, హింసకుగానీ పాల్పడినట్టు ఎన్‌ఐఏ నిరూపిస్తే రాజకీయాల నుంచి వైదొలగుతానని, ఉరిశిక్షకూ సిద్ధమేనని అన్నాడు.  


బలగాలు, ఆందోళనకారుల మధ్య ఘర్షణ

బుధవారం కోర్టు తీర్పు వెలువడక ముందు జేకేఎల్‌ఎఫ్‌ కార్యకర్తలు, భద్రతా దళాల మధ్య శ్రీనగర్‌లో ఘర్షణ చోటుచేసుకుంది. యాసిన్‌ మాలిక్‌ నివాసం వద్ద ఆయన మద్దతుదారులు పెద్దసంఖ్యలో గుమికూడారు. మైసుమా చౌక్‌ వైపు వెళ్లడానికి ప్రయత్నించగా భద్రతా దళాలు వారిని అడ్డుకున్నాయి. కోర్టు తీర్పు వెలువడిన తర్వాత జమ్మూ కశ్మీర్‌ వ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపేశారు. కాగా కోర్టు తీర్పుపై కశ్మీర్‌కు చెందిన పార్టీల కూటమి ‘పీపుల్స్‌ అలయన్స్‌ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌’ (పీఏజీడీ) స్పందిస్తూ... శాంతి ప్రక్రియకు దీన్ని ఎదురుదెబ్బగా అభివర్ణించింది. కోర్టు తీర్పు కశ్మీర్‌లో వేర్పాటువాద భావాలను మరింత పెంచే అవకాశం ఉందని ఫరూక్‌ అబ్దుల్లా నేతృత్వంలోని పీఏజీడీ వ్యాఖ్యానించింది. అలాగే మాలిక్‌కు యావజ్జీవ శిక్ష విధించడాన్ని హురియత్‌ చీలిక నేత మిర్వాయిజ్‌ ఉమర్‌ ఫరూక్‌ ఖండించారు. మాలిక్‌కు ఢిల్లీ ప్రత్యేక కోర్టు యావజ్జీవ శిక్ష విధించడాన్ని పాకిస్థాన్‌ ఖండించింది.  


యాసిన్‌ మాలిక్‌ ప్రస్థానం...

యాసిన్‌ మాలిక్‌.. గాంధేయమార్గంలో పోరాడుతానంటూ జైలు నుంచి బయటికొచ్చి... కశ్మీర్‌లో వేర్పాటువాదాన్ని ప్రోత్సహించాడు. 1966లో శ్రీనగర్‌లో జన్మించిన మాలిక్‌... విద్యార్థి దశ నుంచే రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉండేవాడు. ఇస్లామిక్‌ స్టూడెంట్‌ లీగ్‌ స్థాపించి... 1987 కశ్మీర్‌ ఎన్నికల్లో ముస్లిం యునైటెడ్‌ ఫ్రంట్‌కు మద్దతు ఇచ్చాడు. 1988లో ఉగ్రవాదాన్ని ఆశ్రయించి జేకేఎల్‌ఎ్‌ఫలో చేరాడు. శిక్షణ కోసం పాకిస్థాన్‌ వెళ్లాడు. 1989లో నాటి కేంద్ర హోంమంత్రి ముఫ్తీ మహ్మద్‌ సయీద్‌ కుమార్తె కిడ్నాప్‌, 1990లో శ్రీనగర్‌లో ఎయిర్‌ఫోర్స్‌ సిబ్బందిపై ఉగ్రదాడి కేసుల్లో విచారణను ఎదుర్కొన్నాడు. జేకేఎల్‌ఎఫ్‌ కోర్‌ గ్రూప్‌లో ఉంటూ కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించాడు. 1990లో భారత భద్రతా దళాల దాడిలో గాయాలతో పట్టుబడ్డాడు. నిషేధిత ఉగ్రసంస్థలతో కలిసి కశ్మీర్‌లో ఉగ్రవాదులకు నిధులు సమకూర్చడం, కశ్మీర్‌ను భారత్‌ నుంచి వేరుచేయడానికి కుట్రపన్నడం, దేశద్రోహం ఆరోపణలతో ఎన్‌ఐఏ యాసిన్‌ మాలిక్‌పై అభియోగాలు నమోదుచేసింది.

Updated Date - 2022-05-26T08:31:14+05:30 IST