వాళ్ళ బతుకులో పిడుగు పడింది!

ABN , First Publish Date - 2021-10-03T06:27:46+05:30 IST

పిడుగుపాటు వారిద్దరి బిడ్డలనూ అవిటివాళ్లుగా మార్చివేసింది.ఉన్న ఎకరా భూమి అమ్మి, అప్పులు చేసి చికిత్స చేయించినా బిడ్డలు మాత్రం అవిటివారుగానే మిగిలిపోయారు.చివరకు అప్పులు తీర్చేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికోసం దరఖాస్తు చేసుకొని ఏడేళ్లైనా ఎదురు చూపులే మిగిలిన ఓ కుటుంబ దయనీయ గాథ ఇది.

వాళ్ళ బతుకులో పిడుగు పడింది!
పిడుగుపాటుతో కాళ్లు కాలిపోయిన మురుగన్‌, విజయ్‌కుమార్‌

వికలాంగులుగా మారిన ఇద్దరు పిల్లలు 

సీఎం సహాయనిధి కోసం ఏడేళ్లుగా 

 ఎదురు చూస్తున్న  తల్లిదండ్రులు 


 పిడుగుపాటు వారిద్దరి బిడ్డలనూ అవిటివాళ్లుగా మార్చివేసింది.ఉన్న ఎకరా భూమి అమ్మి, అప్పులు చేసి చికిత్స చేయించినా బిడ్డలు మాత్రం అవిటివారుగానే మిగిలిపోయారు.చివరకు అప్పులు తీర్చేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికోసం దరఖాస్తు చేసుకొని ఏడేళ్లైనా ఎదురు చూపులే మిగిలిన ఓ కుటుంబ దయనీయ గాథ ఇది.

 పలమనేరు మండలంలోని మూరుమూల అటవీ గ్రామం చెత్తపెంటకు చెందిన వెంకటేశు, రాజేశ్వరి దంపతులు గ్రామ సమీపంలో పొలం వద్ద నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్దబ్బాయి మురుగన్‌ 8వ తరగతి, చిన్నబ్బాయి విజయకుమార్‌ 6వతరగతి చదువుకుంటుండేవారు. 2014వ సంవత్సరం అక్టోబరు26వ తేది బడికి వెళ్లివచ్చిన మురుగన్‌, విజయకుమార్‌ పొలం వద్దకెళ్లారు.వర్షం ప్రారంభం కావడంతో పక్కనే ఉన్న చెట్టుకిందకు వెళ్లారు. అంతలోనే ఆ చెట్టుపై పిడుగు పడి మురుగన్‌, విజయ్‌కుమార్‌ ఎడమకాళ్లు కాలిపోయాయి.వెంటనే పలమనేరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు.పెద్దాస్పత్రికి తీసుకెళ్లాలని వైద్యులు చెప్పడంతో చెన్నెలోని సిటీ  ఆస్పత్రిలో చేర్పించారు.చికిత్సకోసం ఉన్న ఎకరా 70 సెంట్ల పొలంలో ఎకరా అమ్మేశారు.అయినకాడికి అప్పులూ చేశారు.ఇంత చేసినా మురుగన్‌, విజయకుమార్‌ అవిటివారుగానే మిగిలిపోయారు.ప్రకృతి వైపరీత్యం వల్ల కలిగిన నష్టానికి ఆర్థిక చేయూత లభిస్తుందని తెలియడంతో ముఖ్యమంత్రి సహాయనిధి కోసం కలెక్టరుకు 2015 మేనెల 15వ తేది దరఖాస్తు ఇచ్చారు. ఆయన స్పందించి విచారణ జరిపి నివేదిక పంపాలని పలమనేరు తహసీల్దార్‌ను ఆదేశించారు.అదనపు రెవెన్యూ అధికారి విచారణ జరిపి పిడుగుపడి పిల్లలు తీవ్రంగా గాయపడడం, బిడ్డల చికిత్సకోసం వెంకటేశు భూమి అమ్ముకొన్న విషయం వాస్తవమేనని, వీరిది దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబమని నివేదిక ఇచ్చారు.ముఖ్యమంత్రి సహాయనిధి పొందేందుకు వెంకటేశ్‌ కుటుంబం అర్హమైనదేనంటూ అప్పటి తహసీల్దార్‌ రవిచంద్రన్‌ మే 21న కలెక్టరుకు నివేదిక పంపారు.అప్పట్నుంచీ వెంకటేశు పలుమార్లు కలెక్టరును కలిసి తన గోడు వెళ్లబోసుకున్నా, అప్పటి మంత్రి అమరనాథరెడ్డిని కలిసి ఆదుకోవాలని ప్రాధేయపడినా ఫలితం లేకుండా పోయింది.ఇప్పటికైనా అధికారులు స్పందించి ముఖ్యమంత్రి సహాయనిధి అందేలా చర్యలు తీసుకోవాలని వెంకటేశు కుటుంబం వేడుకుంటోంది.

- పలమనేరు


Updated Date - 2021-10-03T06:27:46+05:30 IST