పెద్దాస్పత్రులా.. ఆర్‌ఎంపీ క్లినిక్‌లా...!

ABN , First Publish Date - 2022-08-13T05:28:55+05:30 IST

ప్రభుత్వాసుపత్రులు సమస్యలతో కునారిల్లుతున్నాయి. పలుచోట్ల కనీస వసతులు మృగ్యమయ్యాయి. ముఖ్యంగా నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న కనిగిరి, దర్శి ఆస్పత్రులు సైతం పేద రోగులకు పూర్తి స్థాయిలో సేవలు అందించలేక ఆపసోపాలు పడుతున్నాయి.

పెద్దాస్పత్రులా.. ఆర్‌ఎంపీ క్లినిక్‌లా...!
దర్శిలో నిరుపయోగంగా ఉన్న రక్తనిల్వ కేంద్రం


కనిగిరి, దర్శి నియోజకవర్గాల్లోని పలు ప్రభుత్వాసుపత్రులు సమస్యలతో సతమతం

వైరల్‌ జ్వరాలతో అల్లాడుతున్న పల్లెలు

కొన్నిచోట్ల రోగులకు కేవలం మందుగోళీలు ఇచ్చేందుకే ప్రాధాన్యం

చాలాచోట్ల వైద్యులు, సిబ్బంది కొరత

ఎక్స్‌రే, రక్త నిల్వల ప్లాంట్‌ మూత

ఆపరేషన్లంటే బయటకే


ప్రభుత్వాసుపత్రులు సమస్యలతో కునారిల్లుతున్నాయి. పలుచోట్ల కనీస వసతులు మృగ్యమయ్యాయి. ముఖ్యంగా నియోజకవర్గ కేంద్రాల్లో ఉన్న కనిగిరి, దర్శి ఆస్పత్రులు సైతం పేద రోగులకు పూర్తి స్థాయిలో సేవలు అందించలేక ఆపసోపాలు పడుతున్నాయి. వైద్యులు పోస్టులు ఖాళీగా ఉండడంతో రోగులు రావడం బాగా తగ్గించారు. ఇక మండలాల్లో మిగిలిన ఆస్పత్రులదీ ఆదే దుస్థితి. ప్రస్తుతం వర్షాకాలంలో వైరల్‌ జ్వరాలు విజృంభిస్తున్న వేళ పేద రోగులు ప్రభుత్వాసుపత్రులకంటే స్థానికంగా ఉన్న ఆర్‌ఎంపీలనే నమ్ముకోవడం గమనార్హం. శుక్రవారం ఆంధ్రజ్యోతి నిర్వహించిన విజిట్‌లో పలు వాస్తవాలు వెల్లడయ్యాయి.


కనిగిరి, ఆగస్టు 12 : కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రి కేవలం ప్రాథమిక చికత్సలు అందించేందుకే పరిమితమైంది. లక్షలు ఖర్చుపెట్టి నిర్మించిన ఈ ఆస్పత్రి లక్ష్యం పక్కదారిపట్టింది. ఈ కమ్యూనిటీ వైద్యశాల పరిధిలో డిప్యూటి సివిల్‌ సర్జన్‌, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టులు 3 ఖాళీగా ఉన్నాయి. దీంతో సర్జరీలకు ఇబ్బందికరంగా మారింది. ప్రధానంగా మత్తు డాక్టర్‌ పోస్టు ఏళ్ల తరబడి ఖాళీగా ఉంది. ఈ డాక్టర్‌ నియామకం జరగకుండా ముఖ్యనేత అడ్డుపడుతూ ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. గర్భిణులు ప్రసవం సమయంలో ఆపరేషన్‌ అవసరమైతే కందుకూరు, ఒంగోలు తరలించాల్సిందే. ఈ సందర్భంలో కొన్నిసార్లు ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఏఎన్‌ఎంలు ఇద్దరికిగాను ఒకరే విధుల్లో ఉన్నారు. ఆసుపత్రి పరిధిలో వివిధ కేటగిరీల్లో వైద్యులు, సిబ్బంది 36 మంది ఉండాల్సి ఉండగా, 23 మంది మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. వివిధ కేటగిరీలకు చెందిన 13 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. నియోజకవర్గంలో పామూరు, పీసీపల్లి, వెలిగండ్ల, సీఎ్‌సపురం, హెచ్‌ఎంపాడు ప్రాంతాల్లో ప్రజలు తీవ్రంగా జ్వరాల బారినపడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు సీజనల్‌ వ్యాధులు వ్యాపిస్తున్నాయి. ఒక్క కనిగిరి ప్రభుత్వ ఆస్పత్రిలోనే రెండు రోజులుగా కేవలం 15 నుంచి 20 జ్వర కేసులు నమోదయ్యాయి. ఇక ప్రైవేటు ఆసుపత్రులైతే జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి. పామూరులోనూ అదే పరిస్థితి నెలకొంది. వెలిగండ్ల ఆస్పత్రిలో డాక్టర్లు, సిబ్బంది, మందులు ఉన్నా వెలవెలబోతోంది. రోగులు మాత్రం ఆర్‌ఎంపీలను, ప్రైవేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. సీఎ్‌సపురంలో ఆస్పత్రిలో గత రెండు రోజుల్లో రోజుకు 3నుంచి ఐదుగురు మాత్రమే జ్వరపీడితులు వైద్యం కోసం వచ్చారు. వైద్యులు, సిబ్బంది కొరత లేదు. రోగులు మాత్రం ప్రైవేటు ఆసుపత్రులను, ఆర్‌ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. చాలా కాలంగా కుటుంబ సంక్షేమ ఆపరేషన్లు చేయడం లేదు. పేద గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు.


వైద్యుల కొరత వలన అందని వైద్యం

దర్శి, ఆగస్టు 12 : దర్శి సీహెచ్‌సీ సెంటర్‌ను సమస్యలు వేధిస్తున్నాయి. పేరుకే 50 పడకల ఆస్పత్రి అయినప్పటికీ గతంలో ఉన్న 30 పడకల ఆస్పత్రి సిబ్బంది మాత్రమే పనిచేస్తుండడం గమనార్హం. ఆస్పత్రి స్థాయిని పెంచినప్పటికీ వసతుల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. వైద్యుల కొరతతో రోగులకు పూర్తి స్థాయి వైద్యం అందటంలేదు. దీనికితోడు పెద్దఎక్స్‌రే ప్లాంటు పనిచేయటం లేదు. రక్తనిల్వ కేంద్రం మూతపడిం ది. ఇక్కడ ఉండాల్సిన ఎండీ జనరల్‌ మెడిసిన్‌ పోస్టు, మ త్తు డాక్టర్‌ పోస్టు, ఇద్దరు జనరల్‌ డ్యూటీ డాక్టరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మహిళా డాక్టరు మెటర్నటీ సెలవుపై ఉన్నారు. కేవలం ఇద్దరు వైద్యులతోనే 50 పడకల ఆస్పత్రి నడుస్తుండడం గమనార్హం.


సిబ్బందికే పరిమితమైన దొనకొండ పీహెచ్‌సీ

దొనకొండ, ఆగస్టు 12 : స్థానిక పీహెచ్‌సీ రోగులు లేక వెలవెలబోతోంది. కొన్ని నెలలుగా ఆస్పత్రి మరమ్మతుల్లో భాగంగా అన్ని గదుల్లోని ఫ్లోరింగ్‌ పగులకొట్టి తిరిగి నిర్మాణం చేపట్టకుండా వదిలేశారు. అడపాదడపా ఆస్పత్రికి వచ్చే రోగు లు, పనిచేసే సిబ్బంది ఇసుక మట్టిపైనే తిరుగు తూ ఇబ్బందులుపడుతున్నారు. ప్రభుత్వ ఆస్పత్రి వెలవెలబోతుండగా, ఆర్‌ఎంపీల క్లీనిక్‌లు రోగులతో కిటకిటలాడుతుంటాయి. గ్రామంలో దాదాపు తొమ్మిది ఆర్‌ఎంపీ క్లీనిక్‌లు నడుస్తుండటం గమనార్హం. ఆస్పత్రిలో ఇద్దరు మహిళా డాక్టర్లు సేవలందిస్తున్నారు.


అప్‌గ్రేడ్‌ చేసి సౌకర్యాలు మరిచారు

పామూరు, ఆగస్టు 12 : పామూరు కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ సమస్యలతో కునారిల్లుతోంది. తగినంత వైద్య సిబ్బంది, సౌకర్యాలు అందుబాటులో లేక రోగులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం పీహెచ్‌సీని సీహెచ్‌సీగా అప్‌గ్రేడ్‌ చేస్తూ సుమారు రూ.3 కోట్లతో అధునాతనంగా బిల్డింగ్‌లు నిర్మించింది. నిధుల కొరత కారణంగా పైఫోర్‌ పనులను అర్ధంతరంగా నిలిపివేశారు. అదేవిధంగా పూర్తి స్థాయిలో తగినంత మంది వైద్యులు, సిబ్బందిని నియమించలేదు. వైద్యశాలకు, సరైన రోడ్డు లేదు. ప్రహరీ, అంతర్గత రోడ్లు, మీటింగ్‌హాల్‌ జనరేటర్‌, పోస్టుమార్గం గదులు వంటి మౌలిక వసతులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఆరుగురికిగాను ప్రస్తుతం నలుగురు వైద్యులు మాత్రమే ఉన్నారు. రోజుకు 70 నుంచి 85 వరకు ఓపీ వస్తుందని, అందుబాటులో ఉన్న సిబ్బందితో వైద్య సేవలు అందిస్తున్నామన్నామని వైద్యులు తెలిపారు.


మరమ్మతుల పేరిట ఏడాదిన్నరగా పనులు

తాళ్లూరు, ఆగస్టు 12 : స్థానిక పీహెచ్‌సీ ఇద్దరు డాక్టర్లకు గాను ఒకరే ఉండటంతో సరైన వైద్యం అందక రోగులు ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ పని చేస్తున్న రెండవ డాక్టర్‌ను ఒంగోలు రిమ్స్‌కు డిప్యూటేషన్‌పై రెండేళ్ల క్రితం బదిలీ చేశారు. ప్రస్తుతం మహిళా డాక్టర్‌ మాత్రమే రోగులకు వైద్యసేవలు అందిస్తున్నారు. ఏడాదిన్నర క్రితం  దా దాపు రూ.40లక్షల నిధులతో మర్మమ్మతులకు శ్రీకారం చు ట్టారు. గతంలో ఉన్న మరుగుదొడ్లను తొలగించినా నేటికీ పూర్తి చేయలేదు. వైద్యసిబ్బందితోపాటు కాన్పులకు వచ్చేగర్భిణులు, కాన్పులైన బాలింతలు మలమూత్ర విసర్జన చే సేందుకు మరుగుదొడ్లులేక  తీవ్ర అవస్థలు పడుతున్నారు.  



Updated Date - 2022-08-13T05:28:55+05:30 IST